Ajay Ghosh and Chandini Chowdhury's Music Shop Murthy Review In Telugu: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ఐదు పదుల వయసులో డీజే కావాలని ప్రయత్నించే ఓ పెద్దాయన కథతో రూపొందిన చిత్రమిది. దర్శకుడు శివ పాలడుగు తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. సినిమా బాలేకపోతే ఫోన్ చేసి బూతులు తిట్టమని ఏకంగా ఫోన్ నంబర్ ఇచ్చారు అజయ్ ఘోష్. మరి, సినిమా ఎలా ఉంది? బావుందా? లేదంటే ఆయనకు ఫోన్ చేసి బూతులు తిట్టేలా ఉందా? రివ్యూలో చూద్దాం.
కథ (Music Shop Murthy Story): మూర్తి (అజయ్ ఘోష్) 30 ఏళ్లుగా వినుకొండలో మ్యూజిక్ షాప్ నడుపుతున్నాడు. సంపాదన లేని ఆ షాప్ ఎందుకు? దండగ పని మానేసి, సెల్ ఫోన్ షాప్ పెడితే నాలుగు డబ్బులు వస్తాయని, ఎదిగే పిల్లల చదువు & బాధ్యతలు దృష్టిలో పెట్టుకోమని భార్య జయ (ఆమని) వద్దని గొడవ పెట్టినా వినిపించుకోడు. మ్యూజిక్ షాప్ వదిలిపెట్టడు. ఒక కుర్రాడు ఇచ్చిన సలహాతో డీజే కావాలని అనుకుంటాడు.
అమెరికాలో చదువుకుని వచ్చిన అమ్మాయి అంజనా (చాందినీ చౌదరి) సాయంతో డీజే నేర్చుకుంటాడు. అయితే... వాళ్లిద్దరి గురు శిష్యుల సంబంధాన్ని ఇరువురి కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటారు. డీజే అయితే విషయం తాగి చచ్చిపోతానని మూర్తికి జయ వార్నింగ్ ఇస్తుంది. మూర్తి గురించి అంజనాను తండ్రి ప్రశ్నిస్తాడు.
ఇంట్లో పరిస్థితుల వల్ల మూర్తి డీజే వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. దాంతో అతనికి, ఆంజనాకు మనస్పర్థలు వస్తాయి. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు మూర్తిని ఎందుకు అరెస్టు చేశారు? పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వినుకొండ నుంచి హైదరాబాద్ మూర్తి ఎందుకు వెళ్ళాడు? అతడు డీజే అయ్యాడా? లేదా? అంజనా ఏం అయ్యింది? చివరకు ఇద్దరూ ఏం చేశారు? కుటుంబ బాధ్యతలు మూర్తిని ఏం చేశాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Music Shop Murthy Review): ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. అయితే... ఆ కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయడానికి కొందరికి కుటుంబ బంధాలు, బరువు బాధ్యతలు అడ్డు వస్తాయి. అవన్నీ తీర్చిన తర్వాత కొత్త ప్రయత్నం చేయడానికి, కలలు సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకిగా అనిపించి వెనకడుగు వేస్తారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కొత్త అడుగులు వేయవచ్చని స్ఫూర్తినిచ్చే సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'.
కాలంతో పాటు కథలు, కథానాయకుడి పాత్రలు మారుతున్నాయని చెప్పడానికి చక్కటి ఉదాహరణ 'మ్యూజిక్ షాప్ మూర్తి'. కెరీర్ అంటే 20 ఏళ్లలోనే కాదు, 60లలో మొదలు పెట్టవచ్చని ఆ మధ్య వచ్చిన 'పంచతంత్రం'లో బ్రహ్మానందం పాత్ర చెబుతుంది. 'మ్యూజిక్ షాప్ మూర్తి'లోనూ అటువంటి సందేశం ఇచ్చారు. కానీ, ఇక్కడ కథానాయకుడి క్యారెక్టర్ వేరు, కథా నేపథ్యం వేరు, పరిస్థితులు వేరు.
'మ్యూజిక్ షాప్ మూర్తి'లో మీకు సగటు సినిమా హీరో లేడు, కనిపించడు. పరిస్థితుల కారణంగా, తప్పనిసరి పరిస్థితుల్లో రొటీన్ లైఫ్ స్టైల్‌కు బతుకు బండి నెట్టుకొస్తున్న తండ్రి లేదంటే మనకు తెలిసిన అంకుల్ ఎవరో ఒకరు కనిపిస్తారు. ఆ పాత్రకు గానీ, కథకు గానీ కమర్షియల్ హంగులు అద్దడానికి దర్శకుడు ప్రయత్నించలేదు. వీలైనంత సహజంగా చూపించారు. పిల్లల భవిష్యత్ కోసం భర్త మెరుగైన సంపాదన వైపు అడుగులు వేయాలని కోరుకునే భార్య పాత్ర రొటీన్ అనిపించవచ్చు. గతంలో భర్తను తక్కువ చేసి మాట్లాడిన కొన్ని పాత్రలు గుర్తుకు రావచ్చు. కానీ, అందులోనూ ఓ నిజాయతీ ఉంది. అమెరికా నుంచి తిరిగొచ్చి నచ్చిన పని చేయాలని కలలు కనే చాందినీ చౌదరి పాత్రను... ఆమె పట్ల తండ్రి, స్నేహితుడు ప్రవర్తించే విధానం ద్వారా సమాజంలో పోకడల్ని సున్నితంగా ఎత్తి చూపారు.
మూర్తి (అజయ్ ఘోష్) కుటుంబ నేపథ్యం గానీ, భార్య పిల్లలతో సన్నివేశాలు గానీ అంత ఆసక్తిగా అనిపించవు. అయితే... అంజనా (చాందినీ చౌదరి)తో పరిచయం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కథలో వేగం పెంచాయి. కన్న కుమార్తె అని కూడా చూడకుండా అంజనా మీద తండ్రి (భానుచందర్) మాట్లాడిన మాటలు అతడిపై అసహ్యం కలిగేలా చేస్తాయి. మూర్తి హైదరాబాద్ వెళ్లిన తర్వాత కథ మరో మలుపు తీసుకుంటుంది. ఒక వయసు వచ్చాక ఉద్యోగాలు రావడం ఎంత కష్టమనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ వయసులో కొత్తగా కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ల కంటే పరిస్థితుల ప్రభావం వల్ల, జీవితంలో పరిస్థితుల వల్ల పెద్దవాళ్లు ఉద్యోగం కోసం తిరగాలంటే అంత కష్టపడాలా? అని ఆలోచన కలిగేలా చేస్తుంది. మూర్తి సక్సెస్‌తో కథకు శుభం కార్డు వేస్తే రెగ్యులర్, రొటీన్ అనిపించేది! కానీ, దర్శకుడు ఆ తర్వాత ముందుకు నడిపిన కథ కంటతడి పెట్టిస్తుంది.
'మ్యూజిక్ షాప్ మూర్తి'లో సాంగ్స్, రీ రికార్డింగ్ ఓకే. అయితే... డీజే బ్యాగ్రౌండ్ కనుక మరింత ట్రెండీగా, కాంటెంపరరీగా ఉండాలి. మ్యూజిక్‌లో ఆ పంచ్ మిస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి. సినిమా ప్రారంభంలో కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా బావుండేది. రన్ టైమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి, ఆమని... ముగ్గురూ టాలెంటెడ్ ఆర్టిస్టులు. కథ, తమ పాత్రలకు తగ్గట్టు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. చాందినీ చౌదరి కథానాయికగా చేస్తూ... ఇటువంటి రోల్స్ యాక్సెప్ట్ చేయడం అభినందించదగ్గ విషయం. కథలో ఆవిడ మెయిన్ లీడ్. కానీ, హీరోయిన్ కాదు. హీరోను గైడ్ చేసే క్యారెక్టర్. అందులో కమాండబుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 'పుష్ప', 'మంగళవారం', ఇంకా పలు హిట్ సినిమాల్లో చేసిన క్యారెక్టర్లతో పోలిస్తే... అజయ్ ఘోష్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. అటు విలనిజం గానీ, ఇటు కామెడీ గానీ కనపడనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. భాను చందర్ నటన ఓకే.
Music Shop Murthy Review In Telugu: కెరీర్ పట్ల డైలమాలో ఉన్న యువతకు క్లారిటీ ఇవ్వడంతో పాటు మనసుకు నచ్చిన పనిలో ఉన్నత స్థాయికి వెళ్లేలా ప్రయత్నించాలని చెప్పే సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. మనసుకు నచ్చిన పని మొదలు పెట్టడానికి వయసు అడ్డంకి కాదని పెద్దలకు చెప్పే సినిమా. కెరీర్, ఫ్రెండ్షిప్ విషయంలో అమ్మాయిలను జడ్జ్ చేయకూడదని చెప్పే సినిమా.
'మ్యూజిక్ షాప్ మూర్తి' రెగ్యులర్ సినిమా కాదు. అయితే... రెగ్యులర్ సినిమాల్లో ఉండే కామెడీ, ఎమోషన్స్, సాంగ్స్ ఉన్నాయి. సినిమాలో కొంత ల్యాగ్ ఉంది. కానీ, ఎంటర్టైన్ చేస్తుంది. వినోదంతో పాటు సందేశం ఇచ్చే సినిమా. డిఫరెంట్ మూవీస్ కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఎటువంటి అసభ్యతకు తావులేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.
Also Read: మహారాజ రివ్యూ: తమిళంలో బ్లాక్ బస్టర్ రిపోర్ట్, మరి తెలుగులో? - విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే?