Anand Deverakonda's Gam Gam Ganesha Review: 'బేబీ'తో ఆనంద్ దేవరకొండ భారీ విజయం అందుకున్నారు. వసూళ్లతో పాటు నటుడిగా ఆయనకు మంచి పేరు సైతం వచ్చింది. ఆ సినిమా తర్వాత నటించిన సినిమా 'గం గం గణేశా'. 'పెదకాపు' ఫేమ్ ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. మే 31న విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూద్దాం.


కథ (Gum Gum Ganesha Story): గణేష్ (ఆనంద్ దేవరకొండ), శంకర్ ('జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్) అనాథలు. ఛోటా మోటా దొంగతనాలు చేసి చేయడం వాళ్ల వృత్తి. సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం చేసే శృతి (నయన్ సారిక)ను గణేష్ ప్రేమిస్తాడు. తన బాస్ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గణేశుడికి హ్యాండ్ ఇస్తుంది. తాను లక్షలు సంపాదిస్తానని శపథం చేస్తాడు. అరుణ్ సుతారియా (ప్రిన్స్ యావర్) తన సొంత షాపులో ఏడు కోట్ల డైమండ్ దొంగతనం చేయమని సుపారీ ఇవ్వడంతో ఆ డైమండ్ కొట్టేస్తాడు.


నంద్యాలలో కిశోర్ రెడ్డి (రాజ్ అర్జున్)ది మరో కథ. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతాడు. అయితే... అతడు డబ్బు 80 కోట్లను అధికార పక్షం సీజ్ చేయిస్తుంది. అతడికి డబ్బులు రాకుండా అన్ని దారులు మూసేస్తారు. ఆ టైంలో ముంబై నుంచి వంద కోట్లు వినాయకుడి విగ్రహంతో తీసుకొచ్చే పని రుద్ర (కృష్ణచైతన్య)కి అప్పగిస్తాడు. ఆ విగ్రహంలో డైమండ్ వేస్తాడు గణేష్.


వినాయక విగ్రహంలో వంద కోట్లు జాగ్రత్తగా కిశోర్ రెడ్డి దగ్గరకు వచ్చాయా? మధ్యలో రాజావారు (సత్యం రాజేష్) దగ్గరకు గణేష్, రుద్ర ఎందుకు వచ్చారు? ఆర్గాన్ డేవిడ్ (వెన్నెల కిశోర్) ఏం చేశాడు? నీలవేణి (ప్రగతి శ్రీవాత్సవ)తో గణేష్ ప్రేమకథ ఏమిటి? చివరకు డబ్బు ఎవరి చేతికి చేరింది? డైమండ్ ఎవరికి దక్కింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Gam Gam Ganesha Review): క్రైమ్ కామెడీ... డార్క్ క్రైమ్ కామెడీ... ఈ జానర్ సినిమాలు వెస్ట్రన్‌లో వచ్చినంత ఎక్కువ తెలుగులో రాలేదు. కానీ, క్రైమ్ కామెడీ సినిమాలు కరెక్టుగా తీస్తే ట్రెండ్ సెట్ హిట్ గ్యారంటీ అని 'స్వామి రారా' వంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. మరి, 'గం గం గణేశా' ఎలా ఉంది? అనేది చూస్తే...


'గం గం గణేశా' క్రైమ్ కామెడీ సినిమాయే. అయితే, క్రైమ్ కంటే కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు దర్శకుడు. కామెడీ మీద పెట్టిన దృష్టి క్యారెక్టర్స్ డిజైన్ మీద, సీన్స్ మీద పెట్టలేదు. దాంతో మూవీ రోలర్ కోస్టర్ రైడ్ అన్నట్టు ఉంటుంది. 'గం గం గణేశా'లో స్టార్టింగ్ ట్రబుల్ కనిపిస్తుంది. ఒక క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఆనంద్ దేవరకొండ - నయన్ సారిక మధ్య ప్రేమకథ, మరోవైపు ప్రిన్స్ యావర్ బెట్టింగ్ కహాని... ఓ కథతో మరొక కథ కనెక్ట్ కావడనికి టైం పట్టింది. అయితే... ఒక్కసారి కథలోకి వెళ్లిన తర్వాత కామెడీ కనెక్ట్ కావడంతో నవ్వులతో టైమ్ గడిచిపోతుంది.


దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టిలో కామెడీ టైమింగ్ ఉంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ సన్నివేశాల్లో కామెడీ చాలా బావుంది. ఆనంద్ దేవరకొండ - ఇమ్మాన్యుయేల్ సీన్స్ కూడా వర్కవుట్ అయ్యాయి. టాటూ గురించి ఆనంద్ చెప్పే సీన్లు నవ్విస్తాయి. ఆ కామెడీ ముందు మ్యూజిక్, కెమెరా వర్క్, మిగతావి ఏవీ అంతగా రిజిస్టర్ కావు.


Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ: విశ్వక్ సేన్‌ ను నెక్స్ట్ లెవల్‌ కు తీసుకెళుతుందా? సినిమా హిట్టా? ఫట్టా?


'బేబీ'తో కంపేర్ చేస్తే ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. కామెడీ టైమింగ్ ఇంప్రూవ్ అయ్యింది. స్టైల్ పరంగా వేరియేషన్ చూపించారు. హీరోయిన్లు ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక పాత్రలకు కథలో పెద్దగా వెయిటేజ్ లేదు. ఉన్నంతలో పర్వాలేదు. 'వెన్నెల' కిశోర్, 'సత్యం' రాజేశ్, ఇమ్మాన్యుయేల్ నవ్వించారు. రాజ్ అర్జున్ నటన ఓకే. కానీ, ఆయనకు ఆ డబ్బింగ్ లౌడ్ అనిపించింది. రుద్ర పాత్రలో కృష్ణచైతన్య బాగా చేశారు. మిగతా నటీనటులు ఓకే.


ఆనంద్ దేవరకొండ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయని సినిమా 'గం గం గణేశా'. ముఖ్యంగా 'వెన్నెల' కిశోర్ కామెడీ హిలేరియస్‌గా ఉంది. ఆనంద్ దేవరకొండ, ఇమ్మాన్యుయేల్ కామెడీ నవ్విస్తుంది. డిఫరెంట్ సెటప్, కాన్సెప్ట్ ఉన్నా గానీ కథ అంతగా ఎగ్జైట్ చేయలేదు. కానీ, నవ్వులు ఢోకా లేదు. ఈ వీకెండ్ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఫన్ రైడ్ గ్యారంటీ.


Also Readఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?