Shakalaka Shankar About Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను అమితంగా అభిమానించి తన నుంచి ఏమీ ఆశించకుండా తనకు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అందులో కొందరు సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు. అలాంటి వారిలో షకలక శంకర్ ఒకరు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పిన శంకర్.. మరోసారి ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన బాటలో నడవాలి అనుకొని సొంత డబ్బును ప్రజల కోసం ఎలా ఖర్చుపెట్టాడో గుర్తుచేసుకున్నాడు. 2019, 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా ప్రచారం చేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.


అన్నయ్య వచ్చాడు..


2019లో తనకు ఒక సినిమా కోసం అడ్వాన్స్ వచ్చినప్పుడు తను ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోకుండా తుఫాన్ బాధితులకు సాయం చేశానని చెప్పుకొచ్చాడు షకలక శంకర్. అప్పుడు వచ్చిన డబ్బుల్లో సగం తుఫాన్ బాధితులకు ఇవ్వగా.. మరొక సగం ఎలక్షన్ ప్రచారంలో ఉపయోగించానని గుర్తుచేసుకున్నాడు. ‘‘ఎందుకంటే అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు. నేను వెళ్లగానే అన్న వచ్చాడు అని నావైపు ధీనంగా చూస్తారు. ఆ సమయంలో తియ్యండి బండ్లు అంటూ నాలుగు రోజులు ఖర్చుపెట్టి ప్రచారాలు చేశాం. ఆ తర్వాత చేతిలో రూపాయి లేకుండా ఇంటికి వెళ్లాను. అప్పటికే ఇంట్లో వాళ్లకి డబ్బులు వచ్చాయని చెప్పాను. కానీ అన్ని ఖర్చు అయిపోయాయి’’ అని చెప్పాడు శంకర్.


ఏమీ ఆశించలేదు..


‘‘నేను చేసింది తప్పు కాదు. కానీ ఒక ఫ్యామిలీగా వాళ్లకి ఉండాల్సిన ఆశలు వాళ్లకు ఉన్నాయి. డబ్బులు మొత్తం ఖర్చుపెట్టేశానని నాలుగు రోజులు మా ఆవిడ నాతో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ అంటూ అన్నీ ఖర్చుపెట్టేశావ్, మనం ఏమైనా ఉన్నవాళ్లమా అని కోప్పడింది. నెలరోజుల తర్వాత మా మావయ్య వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ఇంత చేశావు ఆయన నీకు ఫోన్ చేశారా, కనీసం మెసేజ్ అయినా పెట్టారా అని అడిగారు. నాకు అప్పటివరకు అలాంటి ఆలోచనే లేదు. నేను అలాంటివి ఏమీ ఆశించను. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసినప్పుడు ఒక్కసారి ఫోటో కూడా అడగలేదు. మనసులోని చెరిగిపోని ఫోటో ఉంది. మనం చేసింది పవన్ కళ్యాణ్‌కు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి అభిమానంతో చేశాను అనుకున్నాను’’ అని పవన్‌పై అభిమానాన్ని బయటపెట్టాడు షకలక శంకర్.


వలసలు ఆగిపోవాలి..


‘‘2024 ఎన్నికల్లో కూడా వారం రోజులు ప్రచారంలో తిరిగాను. కాకపోతే ఈసారి నా దగ్గర ఖర్చుపెట్టడానికి ఏం లేదు. ఖర్చులన్నీ వాళ్లే చూసుకున్నారు. కేవలం అభిమానంతో వెళ్లాను అంతే. ఇలాంటప్పుడే ఆయనకు మా సపోర్ట్ కావాలి. ఎదుటివాళ్లను అనే హక్కు మనకు లేదు. ముందు మనం ఏం చేస్తున్నామన్నది జనాలకు చెప్పాలి. ఏపీ నుంచి హైదరాబాద్ పారిపోయి వచ్చే యువత ఇంక ఉండకూడదు. కానీ వాళ్ళు వీళ్లని అనడం, వీళ్లు వాళ్లను అనడంతోనే సరిపోయింది. తిట్టడం వల్ల ఏం ఉపయోగం? పవన్ కళ్యాణ్ మంచోడు. తన కడుపులో నుంచి తీసి కూడా వేరేవాళ్లకు పెడతాడు. ఏదీ దాచుకోడు, దోచుకోడు. సంపాదించింది మొత్తం ప్రజల కోసమే ఖర్చుపెడతా అని మాటిచ్చాడు. అందరికీ అవకాశం ఇచ్చారు వాళ్లు ఏం చేశారో చూశారు. అలాగే ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అనే ప్రచారాల్లో చెప్పాను’’ అని ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేశాడు శంకర్.


Also Read: పాతికేళ్ల వయసులో ప్రగతి - సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత ఫోటో చూశారా?