Arulnithi and Priya Bhavani Shankar's Demonte Colony 2 Horror Thriller Review: అరుళ్ నిధి హీరోగా అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'డీమాంటీ కాలనీ' 2015లో విడుదలై మంచి విజయం సాధించింది. తొమ్మిదేళ్ల తర్వాత ఆ సినిమా సీక్వెల్ 'డీమాంటీ కాలనీ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. తమిళంలో ఈ నెల 15న సినిమా విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు వారం ఆలస్యంగా ఆగస్టు 23న వస్తోంది. అయితే... మూడు రోజుల ముందు స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Demonte Colony 2 Movie Story): సామ్... శామ్యూల్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్) మరణించి ఆరేళ్లు. క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయిన అతను ఆత్మహత్యకు పాల్పడటాన్ని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకు అలా చేశాడని తెలుసుకోవడం మొదలు పెడుతుంది. ఆరేళ్లకు ఓసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి తీసుకు వెళ్లిన వ్యక్తులు అందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. ఆ మరణాలు ఆపడానికి డెబీ ప్రయత్నిస్తుంది. అప్పుడు శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని గుర్తిస్తుంది.
దుష్ట శక్తి నుంచి శ్రీనివాస్, రఘునందన్ సోదరులను డెబీ, ఆమె మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్) కాపాడారా? లేదా? వాళ్ల ప్రయత్నాలకు టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఏ విధంగా సాయం చేశారు? డీమాంటీ ఇంటిలో, భర్త కోరిక మేరకు డెబీ ప్రారంభించిన చైనీస్ రెస్టారెంట్‌లో ఏం జరిగింది? తొలుత శ్రీనివాస్‌ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Demonte Colony 2 Review Telugu): హారర్ సినిమాలకు ముఖ్యమైనది అంశాల్లో సౌండ్ ఒకటి. దర్శకుడు రాసుకున్న సన్నివేశంలో భయాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళేది నేపథ్య సంగీతమే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... 'డీమాంటీ కాలనీ 2'. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు విజువల్స్, సంగీత దర్శకుడు సామ్ సిఎస్ కలిసి బెస్ట్ హారర్ అండ్ థ్రిల్లర్ మూమెంట్స్ అందించారు.
'డీమాంటీ కాలనీ 2'ను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే... 'డీమాంటీ కాలనీ'ని ఫాస్ట్ ఫార్వార్డ్‌లో ఒక్కసారైనా చూడాలి. ఈ సినిమా ప్రారంభంలో 'రీ క్యాప్' చూపించారు. కానీ, ఫస్ట్ పార్ట్ చూస్తే డీమాంటీ గురించి పూర్తిగా అర్థం అవుతుంది. అది పక్కన పెడితే... 'డీమాంటీ కాలనీ 2'లో స్టార్టింగ్ నుంచి ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, భర్త ఆత్మతో మాట్లాడాలని భార్య చేసే ప్రయత్నాలు ఆసక్తిగా ముందుకు సాగాయి. ఈ కథలోకి 'డీమాంటీ కాలనీ'లో క్యారెక్టర్లను తీసుకు వచ్చిన తీరు బావుంది. ఆ సినిమా చూడని ప్రేక్షకులు సైతం కొత్త సినిమాగా చూసేలా పాత్రలను తీర్చిదిద్దారు. సాధారణ హారర్ సన్నివేశాలను సైతం తన నేపథ్య సంగీతంతో మరోమెట్టు పైకి ఎక్కించారు సామ్ సిఎస్.
'డీమాంటీ కాలనీ 2'లో జస్ట్ హారర్ మాత్రమే కాదు... అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు వంటివి తీసుకొచ్చి వినోదం పండించాడు. అయితే... అసలు మజా డీమాంటీ కాలనీకి వెళ్లిన తర్వాత, డీమాంటీ తెరపైకి వచ్చాక మొదలైంది. వాట్ నెక్స్ట్? అని క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా తీశారు.
'డీమాంటీ కాలనీ 2'లో ప్రొడక్షన్ డిజైన్ బావుంది. మొదటి సినిమాతో పోలిస్తే బడ్జెట్ ఎక్కువ రావడంతో లావిష్‌నెస్ కనిపించింది. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ కథలో మూడ్ ఎలివేట్ చేసేలా ఉంది. అయితే... గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాలేదు. దర్శకుడి ఊహకు, స్క్రీన్ మీద వచ్చే విజువల్స్‌కు సంబంధం లేదు. అక్కడ కేర్ తీసుకుని ఉంటే బావుండేది. పతాక సన్నివేశాలకు ముందు వచ్చే చిన్న పిల్లాడి ట్విస్ట్ ఊహించడం కష్టం ఏమీ కాదు. క్లైమాక్స్ కాస్త తేలిపోతే... థర్డ్ సీక్వెల్ కోసం ఇచ్చిన లీడ్ మరో సినిమాపై ఆసక్తి పెంచింది.
హీరో అరుళ్ నిధి డ్యూయల్ రోల్ చేశారు. రెండు క్యారెక్టర్ల మధ్య లుక్స్ పరంగా వేరియేషన్ చూపించారు. అలాగే, నటనలో కూడా! ఓ పాత్రకు 'డీమాంటీ కాలనీ' లుక్ మళ్లీ సేమ్ టు సేమ్ దించారు. అరుళ్ నిధి జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించలేదు. కానీ, సినిమాలో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ ఆవిడ చేశారు. హెయిర్ స్టయిల్ మార్చడం వల్ల ఆమె లుక్ కొత్తగా కనిపించింది. నటిగా ఆవిడ ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. అయితే... చాలా రోజుల తర్వాత ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. బాగా చేశారు. అర్చనా రవిచంద్రన్ కనిపించేది కాసేపే అయినా నవ్వించారు. ముత్తు కుమార్, సర్జనో ఖాలిద్ తదితరులు చక్కగా నటించారు.
'డీమాంటీ కాలనీ 2'లో కామెడీ ఉంది. అలాగని, హారర్ కామెడీ కాదిది. ప్రోపర్ హారర్ అండ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రమిది. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం లేకుండా అజయ్ జ్ఞానముత్తు తీసిన ఈ సీక్వెల్ ఊహించుకోవడం కష్టం. కథలో సర్‌ప్రైజ్‌లు కంటే కథనం (స్క్రీన్ ప్లే) ఎక్కువ ఎంగేజ్ చేసింది. హారర్ అండ్ థ్రిల్లర్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. మాంచి థ్రిల్, భయపెట్టే మూమెంట్స్ కోసం హారర్ ప్రేమికులు 'డీమాంటీ కాలనీ 2'కు హ్యాపీగా వెళ్లొచ్చు.
Also Read: బ్లడీ ఇష్క్ రివ్యూ - Hotstarలో అవికా గోర్ హారర్ ఫిల్మ్ - ఈ ఎఫైర్స్ ఏంటి డాడీ బ్రో?