ఓటీటీ సినిమా రివ్యూ : ఎక్స్‌ట్రాక్షన్ 2
రేటింగ్ : 3/5
నటీనటులు : క్రిస్ హెమ్స్‌వర్త్, ఓల్గా కుర్లింకో, గోల్ షిఫ్టె ఫరహానీ, ఆడం బెస్సా తదితరులు
రచన : జో రుస్సో
ఛాయాగ్రహణం : గ్రెగ్ బాల్డీ
నేపథ్య సంగీతం : హెన్రీ జాక్‌మన్, అలెక్స్ బెల్చర్
నిర్మాణ సంస్థ : నెట్‌ఫ్లిక్స్
దర్శకత్వం : శామ్ హార్‌గ్రీవ్
విడుదల తేదీ: జూన్ 16, 2023
ఓటీటీ ప్లాట్‌ఫాం : నెట్‌ఫ్లిక్స్
2020లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాక్షన్’ నెట్‌ఫ్లిక్స్‌కు పెద్ద గేమ్ ఛేంజర్. దీనికి వచ్చిన రివ్యూలు, పబ్లిక్ ఒపీనియన్ పక్కన పెడితే టేకింగ్, యాక్షన్ సన్నివేశాల గురించి ఎంతో చర్చ జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌కు విపరీతమైన సబ్‌స్క్రిప్షన్లు, వ్యూయర్‌షిప్‌ను ‘ఎక్స్‌ట్రాక్షన్’ తీసుకువచ్చింది. దీంతో సీక్వెల్‌గా ‘ఎక్స్‌ట్రాక్షన్ 2’ని కూడా నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించింది. ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది?
కథ: ‘ఎక్స్‌ట్రాక్షన్’ మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో సీక్వెల్ సరిగ్గా అక్కడే స్టార్ట్ అవుతుంది. మెడకు బుల్లెట్ గాయంతో బంగ్లాదేశ్ దగ్గర బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయిన టైలర్ రేక్ (క్రిస్ హెమ్స్‌వర్త్) భారతదేశంలోని బెంగాల్‌లో ఉన్న ఒక ప్రాంతానికి కొట్టుకుని వస్తాడు. కోలుకున్న వెంటనే టైలర్‌ను మరో మిషన్ వెతుక్కుంటూ వస్తుంది. జార్జియాలోని ప్రమాదకరమైన జైల్లో బందీలుగా ఉన్న కెటెవాన్ (టినాటిన్ దలక్ష్వి), తన పిల్లలను కాపాడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లిన టైలర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ మిషన్‌కు టైలర్‌నే ఎందుకు సెలక్ట్ చేశారు? ఆ కుటుంబాన్ని టైలర్ కాపాడగలిగాడా? ఇలాంటివి తెలియాలంటే ‘ఎక్స్‌ట్రాక్షన్ 2’ చూడాల్సిందే!
విశ్లేషణ: మొదటి భాగం తరహాలోనే సీక్వెల్‌ను పూర్తిగా యాక్షన్‌తో నింపేశారు. కథ, ఎమోషన్స్, యాక్షన్ అన్నిటి విషయంలోనూ మొదటి భాగం కంటే మెరుగ్గా డిజైన్ చేశారు. నిజానికి ‘ఎక్స్‌ట్రాక్షన్’ లాంటి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. కొట్టడానికో సూపర్ హీరో, కొట్టించుకోవడానికి విలన్ గ్యాంగ్, కాపాడటానికి ఒక వ్యక్తి లేదా కుటుంబం... ఈ మూడిటిని కళ్లు చెదిరే ఫైట్లతో మెరుగులు దిద్ది మంచి మసాలా యాక్షన్ సినిమాను రెడీ చేస్తున్నారు. ‘ఎక్స్‌ట్రాక్షన్ 2’ కూడా మొదట్లో అలానే అనిపిస్తుంది. కానీ పోను పోను ఎమోషన్లకు పెద్ద పీట వేశారు.
హీరో పర్సనల్ లైఫ్‌కు ఇందులో మరింత ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి భాగం పూర్తిగా మిషన్ మీదనే సాగుతుంది. కానీ సీక్వెల్‌లో మాత్రం ‘టైలర్ రేక్’ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టారు. ఆ భాగం కాస్త ఎమోషనల్‌గా, ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. అలాగని యాక్షన్‌ను ఏ మాత్రం తక్కువ చేయలేదు. సినిమా ప్రారంభంలో వచ్చే 21 నిమిషాల సింగిల్ షాట్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్. జార్జియా జైల్లో ప్రారంభం అయ, ఎక్కడా ఒక్క కట్ కూడా లేకుండా ట్రైన్ యాక్సిడెంట్‌తో ఎండ్ అయ్యే ఈ సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
ఆస్ట్రియాలోని బిల్డింగ్ మీద జరిగే ఫైట్, క్లైమ్యాక్స్ కూడా ఎక్కడా వంక పెట్టడానికి లేని విధంగా ఉన్నాయి. వయొలెన్స్ కంటే మొదటి భాగం కంటే కొంచెం ఎక్కువగానే చూపించారు. తెర మీద ఒక సూపర్ హీరో రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు జరిగేటప్పుడు అదే స్థాయిలో విలన్ ఉండాలి. కానీ విలన్ పూర్తిగా బలహీనం కావడంతో హీరో కిల్లింగ్ మెషీన్‌లా చంపుకుంటూ వెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది. ప్రతినాయక పాత్ర బలంగా ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉండేది.
సినిమా చివర్లో నెక్స్ట్ పార్ట్‌కి ఇచ్చిన లీడ్ ఆసక్తికరంగా ఉంది. మొదటి రెండు భాగాల కంటే భిన్నంగా మూడో భాగం ఉండనుందని హింట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందని డైరెక్టర్ శామ్ హార్‌గ్రీవ్ గతంలోనే చెప్పారు. కాబట్టి థర్డ్ పార్ట్ అనుకున్న దానికంటే ముందే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గ్రెగ్ బాల్డీ సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ప్లస్ పాయింట్. 21 నిమిషాల సింగిల్ షాట్ సీన్, అది కూడా యాక్షన్ సీక్వెన్స్‌ను తీయడం అంటే మామూలు విషయం కాదు. దీనికి సినిమాటోగ్రాఫర్‌కు క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. హెన్రీ జాక్‌మన్, అలెక్స్ బెల్చర్ సంగీతం థ్రిల్లింగ్‌గా ఉంది.
Also Read : ది ఫ్లాష్ రివ్యూ: డీసీ మల్టీవర్స్ సినిమా ‘ది ఫ్లాష్’ ఎలా ఉంది?
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇది ‘టైలర్ రేక్’గా క్రిస్ హెమ్స్‌వర్త్ వన్ మ్యాన్ షో. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే దాకా అతని భుజాల మీదనే నడుస్తుంది. మిగతా పాత్రలు అక్కడక్కడా మెరవడం తప్ప వారి పాత్రలకు పెద్దగా స్కోప్ కూడా లేదు. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా మిగతా నటీనటులందరూ తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... మీరు యాక్షన్ సినిమాల లవర్ అయితే ‘ఎక్స్‌ట్రాక్షన్ 2’ మీరు కచ్చితంగా చూడాల్సిందే.