సినిమా రివ్యూ : బాయ్స్ హాస్టల్ (డబ్)
రేటింగ్ : 2.75/5
నటీనటులు : ప్రజ్వల్, మంజునాథ్ నాయక, నితిన్ కృష్ణమూర్తి, (అతిథి పాత్రల్లో) రష్మి, తరుణ్ భాస్కర్, రిషబ్ శెట్టి, పవన్ కుమార్ తదితరులు
పాటలు : భాస్కర భట్ల, సురేష్ బనిశెట్టి, కోటి మామిడాల
మాటలు (తెలుగులో) : పవన్ చెలంకూరి, వికాస్ తిప్పని, అభిరామ్ త్రిపురనేని, మయ్యూర్ సుదర్శన్, మనోజ్ పోడూరి, ఉదయ్ సాయి ప్రసన్న సామల
ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్.కాశ్యప్
సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు : వరుణ్ గౌడ, ప్రజ్వల్ బీపీ, అరవింద్ ఎస్.కాశ్యప్, నితిన్ కృష్ణమూర్తి
తెలుగులో పంపిణీ : అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నితిన్ కృష్ణమూర్తి
విడుదల తేదీ: ఆగస్టు 26, 2023


2023లో కన్నడలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘హాస్టల్ హుడుగరు బేకిద్దారే’ ఒకటి. కేవలం బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే కాకుండా కంటెంట్ పరంగా కూడా అందరూ మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌తో కలిసి ఈ సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ‘ఛాయ్ బిస్కెట్’. ట్రైలర్ కూడా ఆడియన్స్‌లో సినిమాపై ఇంట్రస్ట్‌ను పెంచింది. మరి ఈ బాయ్స్ హాస్టల్ ఎలా ఉంది?


కథ: అజిత్ (ప్రజ్వల్) ఒక కాలేజీ స్టూడెంట్. బాయ్స్ హాస్టల్‌లో ఫ్రెండ్స్‌తో ఉండి చదువుకుంటూ ఉంటాడు. ఆ హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ (మంజునాథ నాయక) చాలా స్ట్రిక్ట్. ఆయన ముందు నోరెత్తడానికి కూడా స్టూడెంట్స్ భయపడేంత ఫైర్ బ్రాండ్. అజిత్‌కి సినిమా డైరెక్టర్ అవ్వాలనేది కల. హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్ చనిపోవడం, ఆయన శవాన్ని మాయం చేయడం అనే నేపథ్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకుంటాడు. ఆ కథ విని అతని స్నేహితులు అందరూ నవ్వుతారు. కానీ ఒకరోజు నిజంగానే హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. సూసైడ్ నోట్‌లో అజిత్, అతని రూమ్మేట్స్ పేర్లు కూడా ఉంటాయి. దీంతో వారు వార్డెన్ శవాన్ని షార్ట్ ఫిల్మ్‌లో చూపించినట్లే మాయం చేయాలి అనుకుంటారు. అసలు వార్డెన్‌ని చంపింది ఎవరు? చివరికి వారు శవాన్ని మాయం చేశారా? ఈ కథలో రష్మి, వీడియో ఎడిటర్ తరుణ్ భాస్కర్‌ల పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే మీరు ఈ ‘బాయ్స్ హాస్టల్’ చూడాల్సిందే.


విశ్లేషణ: ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్.’ ఈ మాట మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఎవరినైనా మొదట కలిసినప్పుడు వారి మీద మనకు ఏ అభిప్రాయం ఏర్పడిందో దాన్ని మార్చడం అంత సులభం కాదు. ‘బాయ్స్ హాస్టల్’ ఈ ఫస్ట్ ఇంప్రెషన్ విషయంలో సూపర్ సక్సెస్ అయింది. సినిమా ప్రారంభంలో వచ్చే 10-15 నిమిషాల షార్ట్ ఫిల్మ్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్‌ను తాము ఒక కొత్త తరహా సినిమా చూడబోతున్నాం అనే అనుభూతికి ‘బాయ్స్ హాస్టల్’ ఓపెనింగ్ సీన్ గురి చేస్తుంది.


ఫస్టాఫ్ చాలా సరదాగా సాగుతుంది. ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ శవాన్ని మాయం చేయడానికి అజిత్ గ్యాంగ్ వేసే ప్లాన్లు హిలేరియస్‌గా నవ్విస్తాయి. సీన్‌లోకి సీనియర్స్ ఎంట్రీ ఇచ్చాక కామెడీ నెక్స్ట్ లెవల్‌కు చేరుతుంది. ముఖ్యంగా జీనీ, ఎకో పాత్రలు బాగా నవ్విస్తాయి. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తినే జీనీ పాత్రలో కనిపించి మెప్పిస్తాడు. హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు పవన్ కుమార్ చేసిన గెస్ట్ రోల్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. తాగుబోతులుగా వారి నటన థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. కథ మొత్తాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది.


కొత్త వాళ్లతో సినిమా తీసేటప్పుడు ఒక సౌలభ్యం ఉంటుంది. స్క్రీన్‌ప్లేను ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ ఊహించని విధంగా రాసుకోవచ్చు. పాత్రల తీరుతెన్నులను పూర్తిగా మార్చేయవచ్చు. కానీ ఇమేజ్ ఉన్న నటులతో తీసేటప్పుడు ఆ పాత్ర తీరును మార్చడం కష్టం. వారి ఇమేజ్ దానికి అడ్డొస్తుంది. ఆ చట్రానికి లోబడి రాసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ప్లేలో ప్రిడిక్టబులిటీ వచ్చేస్తుంది. ‘బాయ్స్ హాస్టల్’ పూర్తిగా కొత్తవాళ్లతో తీసిన సినిమా. కానీ ఈ సినిమాకు కూడా ప్రిడిక్టబులిటీని తీసుకొచ్చిందే ఇంటర్వల్ ట్విస్ట్. ఇంటర్వెల్ ముగియగానే సినిమా ఎలా ఎండ్ అవుతుంది అనే దాని మీద ప్రేక్షకుడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు ఎంత పెద్ద ప్లస్ అయిందో, కనిపించకుండా అంతే మైనస్ కూడా అయింది.


సెకండాఫ్‌లో కామెడీతో పాటు ఎమోషన్ మీద కూడా దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి ఫోకస్ చేశారు. అయితే ఫస్టాఫ్‌లో కామెడీ పండినంతగా సెకండాఫ్ ప్రారంభంలో ఎమోషన్ వర్కవుట్ అవ్వలేదు. ఫస్టాఫ్‌లో అంత నవ్వించి సెకండాఫ్‌లో గేరు మారిస్తే షిఫ్ట్ అవ్వడానికి ఆడియన్స్‌కు కాస్త కష్టం అవుతుంది. కథలో కీలకమైన ట్విస్ట్ రివీల్ అవ్వడం సస్పెన్స్ ఫ్యాక్టర్‌ను కూడా తగ్గిస్తుంది. కానీ క్లైమ్యాక్స్‌ను మాత్రం సంతృప్తికరంగా ముగించారు. అక్కడ ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. దీంతోపాటు మొదట్లో చూపించిన ఉప కథలను కూడా క్లైమ్యాక్స్ సమయానికి ఒక్క దగ్గరికి చేర్చడం ఆకట్టుకుంటుంది.


‘కాంతార’, ‘విరూపాక్ష’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఉన్నవి రెండు పాటలే అయినా ఆ రెండూ ఆకట్టుకుంటాయి. అరవింద్ ఎస్.కాశ్యప్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రారంభంలో వచ్చే 10 నుంచి 15 నిమిషాల సీక్వెన్స్ చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాలో టెక్నికల్‌గా ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి సీనూ సింగిల్ షాట్‌లోనే తీశారు. అంటే ఒక సీన్ ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా దాన్ని సింగిల్ షాట్‌లో పిక్చరైజ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో కెమెరా మూమెంట్స్ ఇబ్బంది పెట్టినా, ఓవరాల్‌గా ఒక కొత్త తరహా ఫీల్‌ను అందిస్తాయి. సినిమాకు తగ్గట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. హీరోగా నటించిన ప్రజ్వల్, కెమెరామెన్ అరవింద్ ఎస్.కాశ్యప్, దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఈ సినిమా నిర్మాతలే.


ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన వారందరూ దాదాపు కొత్తవాళ్లే. అజిత్ పాత్రలో కనిపించిన ప్రజ్వల్ బాగా నటించాడు. మిక్స్‌డ్ ఎమోషన్స్‌ను చక్కగా పలికించాడు. జీనీ పాత్రలో కనిపించిన దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి, ఎకో, అజిత్ రూమ్మేట్స్... ఇలా ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకుల కోసం ఇద్దరు నటులను రీప్లేస్ చేశారు. కన్నడంలో రమ్య నంబీశన్ పోషించిన పాత్రను తెలుగు వెర్షన్‌లో రష్మి చేశారు. కథతో ఏమాత్రం సంబంధం లేకపోయినా ఈ పాత్ర సినిమాకు గ్లామర్‌ను యాడ్ చేస్తుంది. కన్నడంలో ప్రముఖ నటుడు దిగంత్ పోషించిన వీడియో ఎడిటర్ పాత్రలో ఇక్కడ తరుణ్ భాస్కర్ కనిపించారు. తన స్టైల్ కామెడీ టైమింగ్‌ను తరుణ్ భాస్కర్ సినిమాకు యాడ్ చేశారు.


Also Read 'బెదురులంక 2012' రివ్యూ : కార్తికేయ & టీమ్ నవ్వించారా? సందేశం ఇచ్చారా?


ఓవరాల్‌గా చెప్పాలంటే... సెకండాఫ్‌ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే ‘బాయ్స్ హాస్టల్’ రేంజ్ ఎక్కడో ఉండేది. అలా అని తీసిపారేయదగ్గ సినిమా కూడా కాదు. కొత్త వాళ్లతో కొత్త దర్శకుడి కొత్త తరహా ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు చూడాలనుకునేవారు ఈ ‘బాయ్స్ హాస్టల్’ను వీకెండ్‌లో విజిట్ చేయవచ్చు.


Also Read 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ రివ్యూ : పోలీస్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా హిట్టా? ఫట్టా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial