సినిమా రివ్యూ : బెదురులంక 2012
రేటింగ్ : 3/5
నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, 'స్వామి రారా' సత్య, 'వెన్నెల' కిశోర్ తదితరులు
ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
సంగీతం : మణిశర్మ
సమర్పణ : సి. యువరాజు 
నిర్మాత : రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని 
రచన, దర్శకత్వం : క్లాక్స్
విడుదల తేదీ: ఆగస్టు 25, 2023


Bedurulanka 2012 Movie Review : యువ కథానాయకుడు కార్తికేయ (Kartikeya Gummakonda)కు 'ఆర్ఎక్స్ 100' భారీ విజయం అందించింది. అది గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా. అందులో హీరో క్యారెక్టర్ పేరు శివ. కార్తికేయ నటించిన తాజా సినిమా 'బెదురులంక 2012' కూడా గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా. ఇందులోనూ హీరో క్యారెక్టర్ పేరు శివ. సెంటిమెంట్ ప్రకారం అలా పెట్టలేదని, కుదిరిందని కార్తికేయ తెలిపారు. 'ఆర్ఎక్స్ 100'తో పరిచయమైన తాను మరోసారి 'బెదురులంక 2012'తో పరిచయం అవుతున్నానని చెప్పారు. మరి, ఈ సినిమా ఎలా ఉంది?


కథ (Bedurulanka 2012 Movie Story) : యుగాంతం వస్తుందా? ప్రపంచం అంతం అవుతుందా? అని టీవీ ఛానళ్లలో ఒక్కటే వార్తలు. దాంతో డిసెంబర్ 21కి మూడు వారాల ముందు బెదురులంక గ్రామంలో భూషణం (అజయ్ ఘోష్) ఓ నాటకానికి తెర తీస్తాడు. బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ (ఆటో రాంప్రసాద్)తో కలిసి ఊరి ప్రజల డబ్బును దోచేయాలని రంగంలోకి దిగుతాడు. దానికి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) అమాయకత్వాన్ని ఆసరాగా చేసుంటాడు. భూషణం అండ్ కో ఆటలకు శివ (కార్తికేయ గుమ్మకొండ) ఎలా అడ్డుకట్ట వేశాడు? ఎటువంటి బుద్ధి చెప్పాడు? ప్రెసిడెంట్ కుమార్తె చిత్ర (నేహా శెట్టి)తో అతని ప్రేమకథ ఏమిటి? అనేది తెరపై చూడాలి.


విశ్లేషణ (Bedurulanka 2012 Movie Review) : ఆరోగ్యానికి పనికొచ్చే చేదు గుళికకు కొన్నిసార్లు తేనె పూత పూయక తప్పదు. అదే విధంగా సమాజానికి పనికొచ్చే మంచి విషయాన్ని సినిమాల ద్వారా చెప్పడానికి కొన్నిసార్లు కమర్షియల్ హంగులు వంటివి పూయక తప్పదు. 'బెదురులంక 2012'లో హీరో, దర్శక - నిర్మాతలు ఆ పనే చేశారు.


ఎవరి కోసమో కాకుండా... మనకు, మనసుకు నచ్చినట్టు బతికితే చాలా తేలికగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుందని 'బెదురులంక 2012'లో సందేశం ఇచ్చారు. అదీ చివరిలో! వినోదం కావచ్చు, పాటలు కావచ్చు, ప్రేమ కథ కావచ్చు... అప్పటివరకు కమర్షియల్ హంగులు అద్దుతూ కథను ముందుకు నడిపారు.


యుగాంతం నేపథ్యంలో కథ మొదలైనా సరే... అసలు విషయంలోకి వెళ్ళడానికి,  డ్రామా క్రియేట్ చేయడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నారు. విశ్రాంతికి కొద్దిసేపటి ముందు కథలోకి వెళ్లినట్లు ఉంటుంది. అప్పటికే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పాట, కథ సరదాగా సినిమా చూసేలా చేస్తాయి. దేవుడి పేరుతో దోపిడీకి తెర తీసిన తర్వాత అసలు మజా మొదలవుతుంది. విశ్రాంతి తర్వాత కాసేపు మళ్ళీ మామూలుగా ముందుకు వెళ్ళినా... శివ ఆట మొదలైన తర్వాత వినోదం పతాక స్థాయిలోకి వెళ్ళింది.


'బెదురులంక 2012'లో దర్శకుడు క్లాక్స్ మంచి విషయం చెప్పారు. కామెడీ మీద ఆయనకు మంచి గ్రిప్ ఉంది. రెగ్యులర్ కమర్షియల్ కథను కాకుండా కొత్త కథతో తొలి సినిమా తీశారు. అయితే, ఫస్టాఫ్ రోలర్ కోస్టార్ రైడ్ అన్నట్లు సాగడం కాస్త మైనస్. మణిశర్మ పాటలు కథకు, నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ ఓకే. కథల ఎంపికలో నిర్మాత బెన్నీ మరోసారి తన అభిరుచి చాటుకున్నారు. 


నటీనటులు ఎలా చేశారంటే... : కథ, సన్నివేశాల పరిధి మేరకు హీరో కార్తికేయ నటించారు. అవసరమైన చోట నటన కనబరిచారు. స్పేస్ తీసుకుని హీరోయిజం చూపించే ప్రయత్నం చేయలేదు. కథలో అనవసరంగా ఫైట్లు ఇరికించలేదు. అందుకు అభినందించాలి. అఫ్‌కోర్స్... ఓ పాటలో సిక్స్ ప్యాక్ చూపించారు.


పల్లెటూరి అమ్మాయిగా నేహా శెట్టి ఒదిగిపోయారు. 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాటలో ఆమె చాలా అందంగా కనిపించారు. కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బావుంది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ తమ పాత్రలకు న్యాయం చేశారు.
 
'స్వామి రారా' సత్య, 'వెన్నెల' కిశోర్ ఎంట్రీతో నవ్వులు విరబూశాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో కసి రాజుగా రాజ్ కుమార్ కసిరెడ్డి నటన, ఆ సన్నివేశాలకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం. న్యూస్ ప్రజెంటర్ పాత్రలో 'గెటప్' శ్రీను కొంత సేపటి తర్వాత బోర్ కొట్టిస్తారు. ఎల్బీ శ్రీరామ్ పాత్ర, ఆయన నటన హుందాగా ఉన్నాయి. 


Also Read : 'బెదురులంక' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు - కార్తికేయ ముందున్న కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే?


చివరగా చెప్పేది ఏంటంటే : సందేశాత్మక కథతో సినిమా తెరకెక్కించినా... వినోదం ఎక్కువ ఆకట్టుకుంటుంది. డ్రామా కంటే కామెడీ ఎక్కువ క్లిక్ అయ్యింది. టికెట్ రేటుకు సరిపడా నవ్వించే చిత్రమిది. కొత్త కథతో పాటు మంచి సందేశం ఉంది. కార్తికేయ నటన, నేహా శెట్టి గ్లామర్, మణిశర్మ సంగీతం... వీకెండ్ హ్యాపీగా థియేటర్లకు వెళ్ళవచ్చు.


Also Read : 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ రివ్యూ : పోలీస్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial