వెబ్ సిరీస్ రివ్యూ : ఆఖరి సచ్ 
రేటింగ్ : 2/5
నటీనటులు : తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, కృతి విజ్ తదితరులు
రచన : సౌరవ్, రీతూ శ్రీ 
ఛాయాగ్రహణం : వివేక్ షా, జై భన్సాలీ
సంగీతం : అనూజ్ దనైత్, శివమ్ సేన్ గుప్తా 
నిర్మాతలు : నిఖిల్ నందా, ప్రీతి, నీతి

  
దర్శకత్వం : రాబీ గ్రేవాల్
విడుదల తేదీ: ఆగస్టు 25, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్


తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో, పోలీస్ అధికారిగా నటించిన వెబ్ సిరీస్ 'ఆఖరి సచ్' (Aakhri Sach Web Series). తెలుగులో 'చివరి నిజం' అని అర్థం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney plus hotstar) ఓటీటీ కోసం ఢిల్లీలో 2018లో జరిగిన బురారీ ఫ్యామిలీ హత్యల నేపథ్యంలో రూపొందించిన సిరీస్ ఇది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది. మొదటి రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ రెండూ ఎలా ఉన్నాయి? 


కథ (Aakhri Sach Story) : ఢిల్లీలోని కిషన్ నగర్ ఏరియాలోని ఓ ఫ్యామిలీలో 11 మంది మరణిస్తారు. ఆ కేసును అన్యా (తమన్నా భాటియా) చేతికి అప్పగిస్తారు. ఫ్యామిలీలోని 11 మందిలో ముసలావిడ ఊపిరి పోవడానికి ముందు బతకడానికి పోరాటం చేసినట్లు ఉండటం... మిగతా సభ్యులు కళ్ళకు గంతలు & చేతికి కట్లు కట్టుకుని ఉరి వేసుకుని ఉండటం, ఉరికి కుర్చీలు కొంచెం దూరంగా ఉండటంతో అన్యాకు అనుమానం వస్తుంది. కేసు దర్యాప్తులో ఆమె ఏం తెలుసుకుంది? అనేది కథ. 


విశ్లేషణ (Aakhri Sach Review) : బురారీ కుటుంబ సభ్యుల మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో పలు కథనాలు వినిపించాయి. ఈ మరణాలపై నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 'ఆఖరి సచ్' అని వెబ్ సిరీస్ తీయడంతో క్రైమ్, థ్రిల్లర్ సిరీస్ చూసే వీక్షకులు చూపు దీనిపై పడింది.


'ఆఖరి సచ్' దర్శక, రచయితలు టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్లారు. పదకొండు మంది మరణం చూపించారు. అయితే, రెండో ఎపిసోడ్ చివరి వరకు జరిగిన కథంతా రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ & టీవీ డిబేట్స్, న్యాయం కోసం ప్రజల పోరాటం చూసినట్టు ఉంటుంది. అందులో హుక్ ఫ్యాక్టర్ ఏమీ లేదు... ఒక్క శివిన్ నారంగ్ పాత్ర ప్రయాణం తప్ప! తొలుత అతని పాత్ర మీద అనుమానం వ్యక్తమైనా... క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.


టెక్నికల్ అంశాల పరంగా సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. మ్యూజిక్, కెమెరా వర్క్,  ప్రొడక్షన్ డిజైన్ బావున్నాయి. హిందీలో 'ఆఖరి సచ్' సిరీస్ తీశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అనువదించారు. హిందీలో చూడటం మంచిది. అనువాదంలో కొన్ని తప్పులు దొర్లాయి. రెండు నెలలు అని హిందీలో డైలాగ్ ఉంటే... తెలుగులో రెండు రోజులు అని చెప్పించారు.     


నటీనటులు ఎలా చేశారంటే... : 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌లలో తమన్నా రొమాంటిక్ సీన్స్ గురించి డిస్కషన్ జరిగింది. 'ఆఖరి సచ్'కు వస్తే... వాటికి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించారు. ఇంటెన్స్ క్యారెక్టర్‌ చేశారు. ఎక్కడ గ్లామర్ ఇమేజ్ లేకుండా కేవలం పాత్ర కనిపించేలా మాత్రమే నటించారు. ఈ రెండు ఎపిసోడ్లలో అభిషేక్ బెనర్జీ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ... చాలా బాగా చేశారు. శివిన్ నారంగ్ నటన, ఆయన పాత్ర ప్రయాణం తర్వాత ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు తక్కువ. 


Also Read : 'కింగ్‌ ఆఫ్‌ కొత్త' రివ్యూ : యాక్షన్ హీరోగా దుల్కర్ సల్మాన్ హిట్ అందుకుంటారా?


చివరగా చెప్పేది ఏంటంటే : పోలీస్ అధికారి పాత్రలో తమన్నా హిట్టే! అయితే, సిరీస్ గురించి చెప్పాలంటే... మిగతా ఎపిసోడ్స్ విడుదల కావాలి. మొదటి రెండు ఎపిసోడ్లలో కేవలం పాత్రల పరిచయం, మరణించిన కుటుంబంతో ఎవరెవరికి గొడవలు ఉన్నాయి? అనేది మాత్రమే చెప్పారు. ఆ రెండూ జస్ట్ ఓకే! వీటిలో థ్రిల్స్ తక్కువ, ఇన్వెస్టిగేషన్ ఎక్కువ. 


Also Read 'బెదురులంక' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు - కార్తికేయ ముందున్న కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial