సినిమా రివ్యూ : అన్నీ మంచి శకునములే 
రేటింగ్ : 2/5
నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల 
ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
సంగీతం : మిక్కీ జె. మేయర్
నిర్మాణ సంస్థలు : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
నిర్మాత : ప్రియాంకా దత్
దర్శకత్వం : బీవీ నందినీ రెడ్డి
విడుదల తేదీ: మే 18, 2023


యువ కథానాయకుడు సంతోష్ శోభన్ (Santosh) వరుసగా సినిమాలు అయితే చేస్తున్నారు. కానీ, విజయాలు మాత్రం రావడం లేదు. మరి, నందినీ రెడ్డి దర్శకత్వంలో హీరోగా నటించిన అన్నీ మంచి శకునములే ఎలా ఉంది? ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతా రామం సినిమాల తర్వాత స్వప్న సినిమా సంస్థ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది? 
  
కథ (Anni Manchi Sakunamule Movie Story) : ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) & దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్) కుటుంబాల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి. ఓ కాఫీ ఎస్టేట్ గురించి గొడవ! అది పక్కన పెడితే... రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ కొడుకు, ఆర్య (మాళవికా నాయర్) ప్రసాద్ కుమార్తె. ఇద్దరూ ఒకే రోజు పుడతారు. అయితే... ఆస్పత్రిలో నర్సుల మధ్య జరిగిన మిస్ అండర్ స్టాండింగ్ వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో, ఆయన కొడుకుగా రిషి... సుధాకర్ ఇంట్లో, ఆయన కుమార్తెగా ఆర్య పెరుగుతారు. తల్లిదండ్రులకు పిల్లలు మారిన విషయం తెలిసిందా? లేదా? కోర్టు కేసులు ఏమయ్యాయి? రిషి, ఆర్య మధ్య పరిచయం ప్రేమగా మారిందా? లేదా? చివరకి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Anni Manchi Sakunamule Telugu Review) : కాలాలు మారినా, యుగాలు మారినా... తల్లిదండ్రులు, బిడ్డల మధ్య అనుబంధం, ప్రేమ చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. పేరెంట్స్ & చిల్డ్రన్ బంధానికి ఎప్పుడూ ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఆ కారణం వల్లే... ఈ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. అయితే... ఆ ప్రేమను, భావోద్వేగాలను ప్రేక్షకుల హృదయాలను తాకేలా బలంగా, కొత్తగా చెప్పినప్పుడు విజయాలు వరిస్తాయి.


'అన్నీ మంచి శకునములే' టైటిల్ బావుంది. ప్రచార చిత్రాలు సినిమాపై పాజిటివ్ వైబ్ కలిగించాయి. అయితే... సినిమా మొదలైన కాసేపటికి ఆ వైబ్ బదులు మనం ఆల్రెడీ చూసిన కథ తెరపైకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే... స్టార్టింగ్ సీన్లు 'అల వైకుంఠపురములో'ను గుర్తుకు తెస్తుంది. ఆస్పత్రిలో పిల్లలు మారడం కాన్సెప్ట్ మీద ఆ సినిమా తీశారు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు అయితే... ఇక్కడ అమ్మాయి, అబ్బాయి! ఆ తర్వాత సినిమా కూడా కొత్తగా ఏమీ ఉండదు. ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసిన సీన్లు తెరపైకి వస్తాయి. అయితే... కామెడీ కోటింగ్ సరిగా కుదరడంతో ఫస్టాఫ్ పాస్ అయిపోతుంది. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక క్లైమాక్స్ దగ్గరకు వచ్చే వరకు ఆ రొటీన్ సీన్స్ మన సహనాన్ని పరీక్షిస్తాయి. పతాక  సన్నివేశాల్లో భావోద్వేగాలను కొంచెం బలంగా తెరకెక్కించారు. అవి హృదయాలకు హత్తుకునేలా ఉన్నాయి. 


కోర్టు కేసులు, గొడవలు అంటూ చూపించారు కానీ... అందులో దర్శక, రచయితల నిజాయతీ, ఓ స్ట్రాంగ్ పాయింట్ కనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల్లో కూడా గాఢత లోపించింది. ఓల్డ్ సినిమాల్లో పాటలకు పెళ్లిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యాన్స్ చేసే సన్నివేశాలను ఇప్పటికి అయినా అవాయిడ్ చేస్తే మంచిది. ప్రేక్షకులకు బోర్ కొట్టించడానికి, లెంగ్త్ పెంచడానికి తప్ప అవి ఎందుకూ ఉపయోగపడటం లేదు. 


సినిమా, అందులో సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయా? లేదా? అనేది పక్కన పెడితే... క్యారెక్టరైజేషన్స్ పరంగా నందినీ రెడ్డి అండ్ రైటింగ్ టీమ్ మంచి వర్క్ చేసింది. తండ్రి వ్యక్తిత్వం అమ్మాయికి వచ్చినట్లు, తల్లి వ్యక్తిత్వం అబ్బాయికి వచ్చినట్లు కొన్ని సీన్లలో అంతర్లీనంగా చెప్పారు. ఓ కొత్త పాయింట్ మీద రైటింగ్ టీమ్ వర్క్ చేసి ఉంటే మంచి కథ, సీన్లు వచ్చేవి. ఛాయాగ్రహణం బావుంది. మిక్కీ జె మేయర్ సంగీతంలో గుర్తుంచుకునే పాటలు లేవు. నేపథ్య సంగీతం కొన్ని సీన్లలో బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఎక్కడా రాజీ పడలేదు.  


నటీనటులు ఎలా చేశారు? : సరైన సీన్ పడితే సంతోష్ శోభన్ ఎంత బాగా చేస్తాడు? అనేదానికి పతాక సన్నివేశాలు ఓ ఉదాహరణ. ఒకట్రెండు అయినా... ఎమోషనల్ సీన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. తండ్రి చేతిలో తిట్లు తింటూ, ఎప్పుడూ సంతోషంగా ఉండే కుర్రాడిగా మరోసారి మెప్పించారు. గత సినిమాలతో పోలిస్తే... లుక్స్ పరంగా మాళవికా నాయర్ కొత్తగా కనిపించారు. నటిగానూ మెప్పించారు. రావు రమేశ్, నరేశ్, రాజేంద్ర ప్రసాద్, షావుకారు జానకీ... సీనియర్ & సీజనల్ ఆర్టిస్టులు అందరూ పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు. తల్లి పాత్రలో గౌతమిని చూడటం కొంచెం రెఫ్రెషింగ్ గా ఉంది. 


హీరో సిస్టర్ పాత్రలో 'తొలిప్రేమ' ఫేమ్ వాసుకి బావున్నారు. స్టార్ హీరోలకు సిస్టర్ రోల్స్ చేయమంటూ ఆమెకు ఆఫర్లు రావచ్చు. హీరో బావ పాత్ర చేసిన అబ్బాయికి రాహుల్ రవీంద్రన్ చేత డబ్బింగ్ చెప్పించారు. ఆయన నటన కంటే డబ్బింగ్ హైలైట్ అయ్యింది. వాసుకి భర్తగా 'వెన్నెల' కిశోర్ కొన్ని సీన్లలో కనిపించారు. ఉర్వశి, 'రంగస్థలం' మహేష్ పాత్రల పరిధి కూడా కథలో తక్కువే. కేవలం ట్విస్ట్ కోసం వాడుకున్నారు.  


Also Read : ఫాస్ట్ 10 రివ్యూ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో లేటెస్ట్ సినిమా ఎలా ఉంది?


చివరగా చెప్పేది ఏంటంటే? : ఇంటర్వెల్ ముందు కాస్త కామెడీ, తర్వాత మళ్ళీ చివర్లో ఎమోషనల్ క్లైమాక్స్ బావున్నాయి. పార్టులు పార్టులుగా చూస్తే సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ, కథగా చూస్తే కనెక్ట్ కావడం కష్టం. సేమ్ ఓల్డ్ రొటీన్ స్టఫ్! లెట్స్ వెయిట్ ఫర్ ఓటీటీ రిలీజ్!  


Also Read 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?