కేఫ్ బాధ్యతలను మేనేజర్‌కి అప్పగిస్తాడు నందు. కేఫ్ కి వెళ్ళడం ఎందుకు మానేస్తున్నారని తులసి అంటే మనుషుల మధ్యకి వెళ్లాలని అనిపించడం లేదని బాధపడతాడు. దివ్య పంతులుతో డీల్ సెట్ చేసుకుంటుంది. దివ్య రోగం కుదిరిందని బసవయ్య వాళ్ళు తెగ సంతోషపడిపోతారు. పంతులు ఇంకా వెళ్లకపోవడం ఏంటని అడుగుతుంది. దివ్య చెప్పినట్టు పంతులు చెప్పకపోయేసరికి ఏమైందని అడుగుతుంది. చెప్పినట్టు చేయకపోతే తను అనుకున్నది చేస్తానని బెదిరిస్తుంది. టిఫిన్ కోసం అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే విక్రమ్ కింద కూర్చుంటాడు. దివ్య వచ్చి కింద కూర్చోకుండా నిలబడే ఉంటే వెళ్ళి కూర్చోమని రాజ్యలక్ష్మి వెటకారంగా మాట్లాడుతుంది.


Also Read: భర్తతో విడాకులు ఇప్పించి ప్రేమించిన వాడితో పెళ్లి చేయమన్న ముకుంద- కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారీ


దివ్య కూర్చోబోతుంటే పంతులు వచ్చి ఆగమ్మ ఈరోజుతో మీ అత్తకి ఉన్న దోషం మొత్తం పోయింది, ఇక విక్రమ్ నేల మీద కూర్చుని తినే దీక్ష అవసరం లేదు. దర్జాగా టేబుల్ మీద కూర్చుని తీనొచ్చని చెప్పేసరికి అందరికీ ఫ్యూజులు ఎరిగిపోతాయి. దోషం పోవడానికి 20 ఏళ్లు పడుతుందని చెప్పి ఇప్పుడే దోషం పోయిందని అంటారెంటని రాజ్యలక్ష్మి అడుగుతుంది. మనుషులే మారుతుంటే గ్రహాలు మారావా అని దివ్య విక్రమ్ ని పైకి లేపి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది. నా పెద్ద కొడుకు పక్కన కూర్చుని తినే అదృష్టం దొరికితే బాగుండని మనసులో కోరుకున్నారని దివ్య ఇరికిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత అమ్మ పక్కన కూర్చుని తింటున్నావ్ నీ అనుభూతి ఏంటి విక్రమ్ అని అడుగుతుంది. మళ్ళీ జన్మ ఎత్తిన ఆనందంగా ఉందని విక్రమ్ అంటాడు. సంజయ్ ని పక్కకి జరిపేసి దివ్య వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంటుంది. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు. అది చూసి రాజ్యలక్ష్మికి కాలిపోతుంది.


నందు తులసి దగ్గరకి వచ్చి దివ్య గుర్తుకు వస్తుందని దిగులుగా ఉందని అంటాడు. రెండు రోజుల తర్వాత వెళ్దామని తులసి అంటే మళ్ళీ కుదురుతుందో లేదో జైలుకి వెళ్లాల్సి వస్తే తనని చూసే అదృష్టం కూడా ఉండదు. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన వరం తులసి. కానీ దురదృష్టం కొద్ది నేను నిన్ను దూరం చేసుకున్నాను. ఈ ఇంటికి ఏం కావాలన్నా నువ్వు చూసుకున్నావ్ అని నిరాశగా మాట్లాడిపోతాడు. ఎంత దూరంగా ఉందామని అనుకున్నా ఎందుకు దేవుడు ఒప్పుకోవడం లేదని తులసి బాధపడుతుంది. రాజ్యలక్ష్మికి షాక్ ఇవ్వడంతో ప్రియ దివ్యని మెచ్చుకుంటుంది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే విక్రమ్ తాతయ్య వచ్చి మీరు ఇలా ఉంటే బాగుందని అంటాడు. త్వరలోనే విక్రమ్ కి తల్లి గురించి తెలుసుకునేలా చేస్తానని మాట ఇస్తుంది.


ALso Read: చెల్లిని తప్పుగా అర్థం చేసుకున్న స్వప్న- ఇంట్లో చిచ్చు రాజేసిన రుద్రాణి


నందు, తులసి బయటకి వెళ్తుంటే లాస్య ఎదురుపడుతుంది. చిలకా గోరింక ఎక్కడికో బయల్దేరినట్టు ఉన్నారని నీచంగా మాట్లాడుతుంది. నా మొగుడిని బాగానే బుట్టలో వేసుకున్నావని తిడుతుంది. మా మొగుడు పెళ్ళాల మధ్య నుంచి వెళ్లిపొమ్మని లాస్య అంటుంది. వెళ్లాల్సింది తులసి కాదు నువ్వు ఈ ఇంటికి రావద్దని అన్నాను ఎందుకు వచ్చావని నందు ఆవేశంతో ఊగిపోతాడు. లాస్య కావాలని నందుని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. కొట్టకుండానే కొట్టావాని కేసు పెట్టాను బయటకి రావడం తెలియక గిలాగిలా కొట్టుకుంటున్నావ్ మళ్ళీ ఎందుకు ఇదంతా అని అవమానిస్తుంది.