వెబ్‌ సిరీస్‌ రివ్యూ : మ్యాన్షన్‌ 24
రేటింగ్ : 3/5
నటీనటులు : వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సత్యరాజ్‌, రావు రమేశ్‌, శ్రీమాన్‌, అవికా గోర్‌, మానస్‌ నాగులపల్లి, రాజీవ్‌ కనకాల, అభినయ, నందు, బిందు మాధవి, తులసి, అర్చనా జాయిస్‌, అమర్‌ దీప్‌ చౌదరి, 'బాహుబలి' (కాలకేయ) ప్రభాకర్‌, జయప్రకాశ్‌, సూర్య, విద్యుల్లేఖ తదితరులు
మాటలు : మయూఖ్‌ ఆదిత్య
ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్‌
సంగీతం : వికాస్‌ బాడిస
నిర్మాతలు : ఓంకార్‌, అశ్విన్‌ బాబు, కళ్యాణ్‌ చక్రవర్తి
క్రియేటర్‌, డైరెక్టర్‌ : ఓంకార్‌
విడుదల తేదీ: అక్టోబర్ 17, 2023  
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
ఎపిసోడ్స్‌ : 6


హారర్‌ సినిమాలు తీయడం ఆర్ట్‌. ఇండియాలో చాలా తక్కువ మంది దర్శకులు అందులో పట్టు సాధించారు. ముఖ్యంగా తమిళంలో 'కాంచన' ఫ్రాంఛైజీతో రాఘవా లారెన్స్‌, తెలుగులో 'రాజుగారి గది' ఫ్రాంఛైజీతో ఓంకార్‌ (Omkar) విజయాలు సాధించారు. భయంతో కూడిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. హారర్‌ చిత్రాలతో సిల్వర్‌ స్క్రీన్‌ మీద విజయాలు అందుకున్న ఓంకార్‌... ఇప్పుడు 'మ్యాన్షన్‌ 24' వెబ్‌ సిరీస్‌ (Mansion 24 Web Series)తో ఓటీటీలో అడుగు పెట్టారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌ ఎలా ఉంది?


కథ (Mansion 24 Web Series Story) : అమృత (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఆమె తండ్రి కాళిదాస్‌ (సత్యరాజ్‌) ఆర్కియాలజిస్ట్‌. పురావస్తు తవ్వకాల్లో దొరికిన విలువైన సంపదతో ఆయన పారిపోయాడని వార్తలు వస్తాయి. కాళిదాసుపై దేశద్రోహి అని ముద్ర వేస్తుందీ సమాజం. తన తండ్రి దేశద్రోహి కాదని, నిజాయతీపరుడని అమృత నిరూపించాలని అనుకుంటుంది. తండ్రి గురించి ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించిన ఆమెకు... ఊరికి ఉత్తరాన కొండపై ఉన్న మ్యాన్షన్‌కు వెళ్లారని తెలుస్తుంది. ఆ విషయం పోలీసులకు చెబితే... ఆ మ్యాన్షన్‌లోకి వెళ్లిన వ్యక్తులు ఎవరూ తిరిగి రాలేదని, ఇక తాము కాళిదాసుకు వెతకాల్సిన అవసరం లేదని చెబుతారు. మ్యాన్షన్‌ దగ్గరకు వెళుతుంది అమృత. ఆమెకు వాచ్‌మెన్‌ (రావు రమేశ్‌) ఏం చెప్పారు?


మ్యాన్షన్‌లో రూమ్‌ నంబర్‌ 504లో రచయిత చతుర్వేది (శ్రీమాన్‌), 203లో స్వప్న (అవికా గోర్‌), 605లో (రాజీవ్‌ కనకాల) - రాధ (అభినయ) దంపతులు, 409లో (అర్చనా జోస్‌), 307లో లిల్లీ (నందు) - సుల్తానా బేగం (బిందు మాధవి),  కథలు ఏమిటి? మ్యాన్షన్‌ దగ్గరకు రోజూ వెళ్లి వస్తుండటంతో ఆత్మలు అమృత ఇంటికి వచ్చాయా? మ్యాన్షన్‌లో రూమ్‌ నంబర్‌ 24లో ఏం జరిగింది? ఆ రహస్యం తెలుసుకోవాలని మ్యాన్షన్‌లో అడుగు పెట్టిన అమృతకు ఏమైంది? చివరకు ఏం తేలింది? అనేది సిరీస్‌ చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Mansion 24 Web Series Review) : ఆరు ఎపిసోడ్స్‌... ఆరు కథలు... ప్రతి కథలోనూ డిఫరెంట్‌ పాయింట్‌... అయితే, అన్ని కథల్లోనూ కామన్‌ ఫ్యాక్టర్‌ ఒక్కటే, భయం! 'రాజుగారి గది' ఫ్రాంచైజీ సినిమాల్లో ప్రేక్షకులను భయపెడుతూ నవ్వించారు ఓంకార్‌. ఆయా కథల్లో అంతర్లీనంగా సమాజంలో జరిగిన అంశాలనూ ప్రస్తావించారు. 'మ్యాన్షన్‌ 24'కు వచ్చేసరికి కామెడీని పక్కన పెట్టారు. భయంతో పాటు ప్రజలు భయపడే అంశాలకు సమాధానాలు ఇచ్చారు.


హారర్‌ సన్నివేశాలు తెరకెక్కించడంలో ఒంకార్‌కు అంటూ ఓ స్టైల్‌ ఉంది. ఆయనకు మంచి గ్రిప్‌ ఉంది. 'మ్యాన్షన్‌ 24'లోనూ అది కనిపించింది. అయితే... హారర్‌ సీన్స్‌ తీసే దర్శకుడి కంటే ఎక్కువగా ఆయనలో కథకుడు కనిపించారు. సిరీస్‌లోని ఆరు కథలకూ సమాజంలో జరిగిన ఘటనలే స్ఫూర్తి అని చెప్పాలి. బురారీ ఫ్యామిలీ మరణాలు, వివాహితుడితో ప్రేమలో పడిన యువతి అతడితో భార్యాపిల్లల్ని చంపడానికి ప్రేరేపించిన వైనం... ప్రతి కథలోకి తొంగి చూస్తే స్ఫూర్తి కనబడుతుంది.


ఓంకార్‌ క్రియేషన్‌ ప్రతి కథను కొత్తగా చూపించింది. కథ గురించి ఎక్కువ ఆలోచించే  సమయం ఇవ్వలేదు. దర్శకుడిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెబుతూ ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగిస్తూ సిరీస్‌ను ముందుకు తీసుకువెళ్లారు. ఇందులో పెద్దగా ట్విస్టలు లేవు. కానీ, సింపుల్‌ స్క్రీన్‌ ప్లేతో ఎంగేజ్‌ చేశారు. ఓ కథలో పాత్రలు మరో కథలో కనిపించడం ఆసక్తి కలిగిస్తుంది. అందువల్ల, తర్వాత రాబోయే కథ గురించి ప్రేక్షకులు ముందుగా ప్రిపేర్‌ అయినట్టు అయింది. దాంతో సడన్‌గా ఓ కథ నుంచి మరో కథకు వెళుతున్న ఫీలింగ్‌ రాదు.


వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రావు రమేశ్‌ సన్నివేశాలను విక్రమార్కుడు - బేతాళుడు మధ్య సంభాషణ తరహాలో రాసుకోవడం రెగ్యులర్‌ హారర్‌ థ్రిల్లర్స్‌ సిరీస్‌ మధ్య 'మ్యాన్షన్‌ 24'ను కొత్తగా నిలిపాయి. 'భ్రమకు భయం తోడైతే నిజంలా మారిపోతుంది' వంటి డైలాగులు ప్రతి కథ తర్వాత పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌లో ల్యాండ్‌ అయ్యాయి. సీన్‌లో ఇంపాక్ట్‌ పెంచాయి. ఓంకార్‌ అనుకుంటే... హారర్‌ డోస్‌ మరింత పెంచవచ్చు. కానీ, ఆయన ఓ స్థాయికి లిమిట్‌ చేశారు. క్లైమాక్స్‌లో ఓ పంచ్‌, స్ట్రాంగ్‌ ఎమోషన్‌ & ఎలివేషన్‌ మిస్‌ అయిన ఫీలింగ్‌. అప్పటి వరకు చెప్పిన కథలకు కొత్త ముగింపు ఇస్తారనుకుంటే... రెగ్యులర్‌గా ఎండ్‌ చేశారు. అక్కడ స్వేచ్ఛ తీసుకున్నారు.  


'మ్యాన్షన్‌ 24'లో ప్రొడక్షన్‌ డిజైన్‌ బావుంది. నందు - బిందు మాధవి ఎపిసోడ్‌ గానీ, అంతకు ముందు అర్చనా జాయిస్‌, అవికా గోర్‌ ఎపిసోడ్స్‌ గానీ కొత్తగా చూపించడంలో సక్సెస్‌ అయ్యారు. కెమెరా వర్క్‌ నీట్‌గా ఉంది. హారర్‌ సినిమాల్లో పాటలకు స్కోప్‌ తక్కువ ఉంటుంది. అటువంటిది హారర్‌ సిరీస్‌లో స్పేస్‌ తీసుకుని మరీ పాటలు చేశారు. కమర్షియాలిటీ చూపించారు. కథలతో పాటుగా ఫ్లోలో పాటలు వెళ్లాయి. వికాస్‌ బాడిస పాటలు, నేపథ్య సంగీతం ఓంకార్‌ క్రియేషన్‌కు అండగా నిలిచాయి.


నటీనటులు ఎలా చేశారంటే : వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఎందుకు? సిరీస్‌ ప్రారంభం నుంచి ప్రేక్షకుల మదిలో మెదిలే ప్రశ్న. ముందు నుంచి ఆమెది ఓ సాధారణ పాత్రలా ఉంటుంది. కథలు వినడంతో సరిపోతుంది. పతాక సన్నివేశాల్లో వరలక్ష్మి ఇమేజ్‌, నటనకు తగ్గ సన్నివేశాలు పడ్డాయి. 'మ్యాన్షన్‌ 24' ఎండింగ్‌ చూస్తే... సెకండ్‌ సీజన్‌లో ఆమె క్యారెక్టర్‌ మరింత కీలకం అనేది అర్థం అవుతోంది.


ఒంటి కన్నుతో రావు రమేశ్‌ కొత్తగా కనిపించారు. ప్రేక్షకులు కథలో లీనం కావడానికి వరలక్ష్మీతో మ్యాన్షన్‌ గదుల్లో ఏం జరిగిందో ఆయన వివరించిన తీరూ ఓ కారణమని చెప్పాలి. చివరి ఎపిసోడ్‌లో ఆయన క్యారెక్టర్‌లో మరో షేడ్‌ చూపించారు. సత్యరాజ్‌, తులసి స్కీన్‌ మీద కనిపించేది చాలా తక్కువ సేపే అయినప్పటికీ... ఆయా పాత్రల నిడివి మేరకు నటించారు. అభినయ మరోసారి తన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆమె భర్తగా నటించిన రాజీవ్‌ కనకాల... క్యారెక్టర్‌ మీద క్యూరియాసిటీ కలిగించారు.


అవికా గోర్‌ ఈతరం అమ్మాయిగా నటించారు. తనకు లభించిన స్క్రీన్‌ స్పేస్‌లో నటిగానూ మెరిశారు. 'బ్రహ్మముడి' సీరియల్‌తో పాపులరైన మానస్‌ నాగులపల్లి... 'మ్యాన్షన్‌ 24'లో డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించారు. ఇమేజ్‌ మేకోవర్‌ పరంగా ఆయనకు కొత్త స్టార్ట్‌ అవుతుంది. 'కెజియఫ్‌'లో తల్లి పాత్రలో నటించిన అర్చనా జాయిస్‌... ఈ 'మ్యాన్షన్‌ 24'లో గర్భిణిగా, సంప్రదాయ నృత్య కళాకారిణిగా కళ్లతో హావభావాలు పలికించారు. బిందు మాధవిది వేశ్య పాత్ర. ఇంతకు మించి చెబితే ఆమె క్యారెక్టర్‌ ట్విస్ట్‌ రివీల్‌ అయ్యే అవకాశం ఉంది.


అయ్యప్ప శర్మ రూపం, గొంతు పాత్రకు పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌! శ్రీమాన్‌, 'బాహుబలి' (కాలకేయ) ప్రభాకర్‌, జయప్రకాశ్‌, సూర్య, విద్యుల్లేఖ, అమర్‌ దీప్‌ చౌదరి కీలక పాత్రలు పోషించారు.


Also Read : 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : స్వాతి బోల్డ్ సీన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?


చివరగా చెప్పేది ఏంటంటే : 'మ్యాన్షన్‌ 24'లోకి ప్రేక్షకుడు వెళ్లడానికి పెద్దగా టైమ్‌ పట్టదు. సిరీస్‌ స్టార్ట్‌ అయ్యాక... తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠగా చూసేలా ఓంకార్‌ సిరీస్‌ తీశారు. కథలు ఎక్కువ. కానీ, కన్‌ఫ్యూజన్‌ ఉండదు. క్లారిటీగా చెప్పారు. మధ్య మధ్యలో భయపెట్టారు. మంచి థ్రిల్స్‌ ఇచ్చారు. కమర్షియల్‌ ఫార్మాట్‌లో గ్రిప్పింగ్‌గా తీసిన సిరీస్‌ ఇది. హ్యాపీగా చూడవచ్చు.


PS : కంటెంట్‌ పరంగా న్యూడిటీ, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఎక్స్‌పోజింగ్‌ వంటివి 'మ్యాన్షన్‌ 24'లో లేవు. బహుశా... నందు ఎపిసోడ్‌లో స్టోరీ పాయింట్‌, కిల్లింగ్స్‌ వల్ల 'ఎ' రేటెడ్‌ వెబ్‌ సిరీస్‌ అని చూపిస్తున్నారేమో!? ఫ్యామిలీ కలిసి చూడవచ్చు.


Also Read : :'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial