సినిమా రివ్యూ: మళ్ళీ మొదలైంది
రేటింగ్: 2.5/5
నటీనటులు: సుమంత్, నైనా గంగూలీ, వర్షిణీ సౌందర్ రాజన్, అన్నపూర్ణమ్మ, 'వెన్నెల' కిషోర్, సుహాసిని తదితరులు
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్ 
సినిమాటోగ్రఫీ: శివ జీఆర్ఎన్ 
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: కె. రాజశేఖర్ రెడ్డి 
దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022 (జీ5 ఓటీటీలో విడుదల)


టాలీవుడ్‌లో అక్కినేని నాగచైతన్య - సమంత, కోలీవుడ్‌లో ధనుష్ - రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ - కిరణ్ రావ్... ఇటీవల కాలంలో విడుదల తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్. ప్రజల్లోనూ వాళ్ళ విడాకులు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సమయంలో 'Life After Divorce' (విడాకుల తర్వాత జీవితం) అంటూ సుమంత్ హీరోగా నటించిన 'మళ్ళీ మొదలైంది' సినిమా వచ్చింది. 'జీ 5' ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి?


కథ: విక్రమ్ (సుమంత్) చిన్నప్పటి నుంచి చెఫ్ అవ్వాలని కష్టపడి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఈ క్రమంలోనే నిషాని (వర్షిణి) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే విక్రమ్ తనను పట్టించుకోవడం లేదనే కారణంగా నిషా విడాకులు కోరుతుంది. విక్రమ్ కూడా పెద్దగా బాధ పడకుండానే విడాకులకు ఒప్పుకుంటాడు. కోర్టులో నిషా తరఫున వాదించడానికి వచ్చిన లాయర్ పవిత్రని (నైనా గంగూలీ) మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. విక్రమ్ స్నేహితురాలు వైశాలి(పావని రెడ్డి)ది మరో కథ. మరి పవిత్ర, విక్రమ్‌ని ప్రేమించిందా? చివరికి ఏం అయింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


విశ్లేషణ: మళ్లీ మొదలైంది అనే టైటిల్ చూడగానే.. సుమంత్ సూపర్ హిట్ సినిమా ‘మళ్లీ రావా’ గుర్తొస్తుంది.  ఆ సినిమాకి, ఈ సినిమాకి ఒక పోలిక కూడా ఉంటుంది. ‘మళ్లీ రావా’లో హీరోను పెళ్లి చేసుకోవాలా... వద్దా... అనే కన్ఫ్యూజన్ హీరోయిన్‌కు ఉంటే, ఇందులో ఆ గందరగోళం హీరోకు ఉంటుంది. మొదటి రిలేషన్‌షిప్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న హీరోకి, రెండో రిలేషన్‌షిప్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. పవిత్రను చూడగానే ప్రేమలో పడ్డ విక్రమ్... పెళ్లంటే మాత్రం తటపటాయిస్తూ ఉంటాడు.


ఇలాంటి నేపథ్యంలో తీసే సినిమాలు ఎలా ముందుకు వెళ్తాయి, ఎలా ముగుస్తాయి అనేది ఊహించడం పెద్ద కష్టం. సినిమా చివర్లో రెండు ట్విస్టులు వస్తాయి. మొదటి ట్విస్టును ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ రెండో ట్విస్టు ఊహించనిది అయినప్పటికీ.. సినిమాను ఆ ట్విస్టు లేకుండా ముగించేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుంది. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి కామెడీ ట్రాకులు కథలో పెద్ద రిలీఫ్.


దర్శకుడు టీజీ కీర్తి కుమార్ తీసుకున్న కథ కొత్తగానే ఉంది. విడాకులు తీసుకున్న ఒక మగాడికి సమాజంలో, తర్వాతి రిలేషన్‌షిప్‌లో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి? అనే అంశాన్ని కొంచెం ఫన్నీగా, కొంచెం సీరియస్‌గా, కొంచెం ఆలోచింపజేసేలా తీశారు. ఇక్కడ సమస్య కూడా అదే. కథలో ఎమోషన్ కూడా కొంచెమే ఉంది. విక్రమ్, నిషాల ట్రాక్‌లో వారిద్దరూ విడిపోవడానికి బలమైన కారణాలు కనిపించవు. అలాగే విక్రమ్‌ను పవిత్ర ప్రేమించడానికి, విక్రమ్.. పవిత్రను ప్రేమించడానికి కూడా కారణాలు కనిపించవు. ఎమోషనల్‌గా ఎంగేజింగ్‌గా ఉండాల్సిన కథ ఫ్లాట్‌గా సాగిపోతుంది.


అయితే కథలో మంచి సన్నివేశాలు కూడా ఉన్నాయి. పవిత్ర బిజినెస్ ఐడియా ‘రీసెట్’ కాన్సెప్ట్, ప్రీ-క్లైమ్యాక్స్‌లో పోసాని‌తో సుమంత్ ఎమోషనల్ సీన్ బాగా వచ్చాయి. కనీసం అదే ఫీల్‌తో సినిమాను ముగించేసినా సరిపోయేది. చివర్లో వచ్చిన ట్విస్ట్ అసలు కథ అర్థాన్నే మార్చేసింది. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘దేన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు’ అని.. కానీ మంచి కథ ఉంది కదా అని.. స్క్రీన్‌ప్లేను లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది.


ఇక పెర్ఫార్మెన్స్‌ల విషయానికి వస్తే.. సుమంత్‌కు ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. విక్రమ్ పాత్రలో ఎమోషన్స్‌ను బాగా పండించాడు. ఇక నిషా పాత్రలో వర్షిణి ఆ పాత్రకు న్యాయం చేసింది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్‌లో ఎక్కువ కనిపించిన నైనా గంగూలీకి వాటికి పూర్తి భిన్నమైన ఈ పవిత్ర పాత్రలో ఆకట్టుకుంటుంది. ఇక వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, సుహాసిని, అన్నపూర్ణ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.


చివరిగా చెప్పాలంటే... మన చేతిలో మంచి కథ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్లు కథనం కూడా రాసుకోవాలి అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఈ వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని టైమ్ పాస్ చేయాలంటే ‘మళ్లీ మొదలైంది’ని మొదలు పెట్టేయచ్చు.