సినిమా రివ్యూ : మాచర్ల నియోజకవర్గం
రేటింగ్ : 2/5
నటీనటులు : నితిన్, కృతి శెట్టి, కేథరిన్, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, 'వెన్నెల' కిశోర్, మురళీ శర్మ, బ్రహ్మజీ తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో అంజలి
మాటలు : మామిడాల తిరుపతి

  
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ 
సంగీతం : మహతి స్వర సాగర్ 
నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
కథ, దర్శకత్వం: ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి 
విడుదల తేదీ: ఆగస్టు 12, 2022


నితిన్ (Nithiin) కథానాయకుడిగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా 'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam Movie). కృతి శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటించారు. ఈ చిత్రంతో ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ (ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? 


కథ (Macherla Niyojakavargam Story) : మాచర్లలో రాజప్ప (సముద్రఖని) చేసిందే చట్టం! ఆయనదే రాజ్యం! మాచర్ల నియోజకవర్గంలో 30 ఏళ్లుగా ఎన్నికలు అనేవి జరగనివ్వకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అవుతుంటాడు. ఎన్నికలు జరపాలని వచ్చిన కలెక్టర్ (ఐఏఎస్) ని చంపేస్తాడు. ఆ తర్వాత గుంటూరు జిల్లాకి కలెక్టరుగా సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) వస్తాడు. అసలు పోస్టింగ్ రాకముందే ప్రేమించిన అమ్మాయి స్వాతి (కృతి శెట్టి) కోసం మాచర్లలో సిద్ధు అడుగు పెడతాడు. రాజప్ప కొడుకును కొడతాడు. జిల్లా కలెక్టరుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత సిద్ధార్థ్ రెడ్డి ఏం చేశాడు? మాచర్లలో ఎన్నికలు నిర్వహించాలని అతను చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? రాజప్ప ఏం చేశాడు? ఈ కథలో హైదరాబాద్ సిటీలో సిద్ధార్థ్ రెడ్డి పక్కింట్లో ఉండే గురు (వెన్నెల కిశోర్), అలాగే హీరోను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించే మినిస్టర్ కుమార్తె నిధి (కేథరిన్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Macherla Niyojakavargam Movie Review In Telugu) : కథానాయకుడిని కమర్షియల్ పంథాలో మాసీగా చూపించాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ మధ్య కొంచెం కూడా కొత్తదనం లేని కథతో రెండున్నర గంటలు సినిమా నడిపించాలని అనుకున్న దర్శకుడి గట్స్‌ను మెచ్చుకుని తీరాలి. బహుశా... పదేళ్ల పదిహేనేళ్ల క్రితం ఈ కథతో సినిమా తీస్తే ప్రేక్షకాదరణ ఉండేదేమో!?


'మాచర్ల నియోజకవర్గం' ఎలా ఉంటుందనేది ప్రారంభమైన పది నిమిషాలకు ఒక క్లారిటీ వస్తుంది. హీరోయిన్ వెంటపడుతున్నా తనను ఫ్రెండ్‌గా చూశానని, ఆమెను ప్రేమించడం లేదని హీరో చెప్పడం... తర్వాత మరో అమ్మాయిని బీచ్‌లో చూసి ప్రేమలో పడటం... ఆమె కోసం విలన్లను కొట్టడం... రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు ఏమాత్రం దూరం వెళ్ళకుండా కథ రాసుకున్న ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి, మరీ అంతే రొటీన్‌గా సినిమా తీశారు. ఫైట్లు, పాటలు, సన్నివేశాలు చూస్తుంటే... ఆల్రెడీ హిట్ అయిన కమర్షియల్ సినిమాల్లో ఎక్కడో చూసినట్టు ఉంటాయి. అంజలి చేసిన ప్రత్యేక గీతం 'రా రా రెడ్డి' ఒక్కటీ కాస్త పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. 


నటీనటులు ఎలా చేశారు? : నితిన్ మాస్ సినిమాలు చేశారు. 'సై' లాంటి భారీ మాస్ హిట్ ఆయన కెరీర్‌లో ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో ఫైట్స్ చేశారు. అయితే... 'మాచర్ల నియోజకవర్గం'లో పక్కా కమర్షియల్ సినిమా కోసం ఏం కావాలో అది చేశారు. డ్యాన్సులు, ఫైట్లు చేశారు. పంచ్ డైలాగులు చెప్పారు. కానీ, కొత్తగా ఏమీ చేయలేదు. కృతి శెట్టి, కేథరిన్... హీరోయిన్లు ఇద్దరివీ కూరలో కరివేపాకు లాంటి పాత్రలే. కథలో ఇంపార్టెన్స్ ఉన్నట్టు ఉంటుంది. హీరో, విలన్ మధ్య క్లాష్‌కు వాళ్ళే కారణం అన్నట్టు ఉంటుంది. అయితే... వాళ్ళ పాత్రల్లో, నటనలో కొత్తదనం లేదు. ఈగో ఉన్న వ్యక్తిగా గురు పాత్రలో 'వెన్నెల' కిశోర్ కనిపించారు. ఫస్టాఫ్‌లో హీరో కంటే ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. కామెడీ కొన్ని సీన్స్‌లో వర్కవుట్ అయితే... మెజారిటీ సీన్స్‌లో విసిగించింది. 


సముద్రఖని డ్యూయల్ రోల్ చేశారు. ఆయన లాంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ కూడా పెద్దగా అరుస్తూ భారీ డైలాగులు చెప్పడం మినహా మరొకటి చేయలేదు. ఆయనతో దర్శకుడు అలా చేయించుకున్నారు. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ... పేరున్న నటీనటులు చాలా మంది సినిమాలో కనిపిస్తారు. అందరివీ రొటీన్ సీన్స్. దాంతో ఎవరికీ తమ ప్రత్యేకత చాటుకునే అవకాశం రాలేదు.


Also Read : కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'మాచర్ల నియోజకవర్గం' రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా. కొంచెం కూడా కొత్తదనం లేదు. కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చూడాలంటే కొంచెం ఓపిక కావాలి. నితిన్ ఎంత ప్రయత్నించినప్పటికీ... ఈ సినిమాను నిలబెట్టడం ఆయన వల్ల కూడా కాలేదు. 


Also Read : మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?