సినిమా రివ్యూ: మాలిక్ (మలయాళం డబ్) - ఓటీటీ రిలీజ్
రేటింగ్: 3/5
నటీనటులు: ఫహాద్ ఫాజిల్, నిమిషా సజయన్, జోజు జార్జ్, దిలీప్ పోతన్, వినయ్ ఫోర్ట్, సలీం కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సను వర్గీస్
సంగీతం : సుశిన్ శ్యామ్
నిర్మాతలు: అనీల్ కె రెడ్డి, కిషోర్ రెడ్డి.
దర్శకత్వం: మహేష్ నారాయణన్
విడుదల తేదీ: ఆగస్టు 12, 2022
ఓటీటీ ప్లాట్‌ఫాం: ఆహా
‘పార్టీ లేదా పుష్ప’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన విలక్షణ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). విక్రమ్ సినిమాలో అమర్ పాత్రతో అన్ని భాషల ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పుడు మాలిక్ (మలయాళం డబ్) అనే కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఓటీటీలో పలకరించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Malik Movie Story): తిరువనంతపురంలోని రామదాపల్లి అనే ఊరిలో గాడ్ ఫాదర్‌గా పిలుచుకునే అహ్మదాలీ సులేమాన్ (ఫహాద్ ఫాజిల్) మక్కా యాత్రకు బయలుదేరడంలో సినిమా ప్రారంభం అవుతుంది. జైలులో తనను హత్య చేయడానికి కూడా బయట ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తనను బయటకు తీసుకురావడానికి భార్య రోజెలిన్ (నిమిషా సజయన్) ప్రయత్నిసూ ఉంటుంది. అసలు చిన్న నేరాలు చేసుకునే సులేమాన్ ఒక ఊరిని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? చివరికి తను జైలు నుంచి బయటకు వచ్చాడా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ (Malik Movie Review): ఈ సినిమా విషయంలో ముందుగా దర్శకుడు మహేష్ నారాయణన్‌కు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అంటే ఎన్నో ఎలిమెంట్స్‌ను కథలో ఇరికించి ఒక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా మార్చడానికి అవకాశం ఉంది. కానీ మహేష్ నారాయణన్ ఆ దారివైపు వెళ్లలేదు. అహ్మదాలీ సులేమాన్ అనే గ్యాంగ్‌స్టర్ కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. కళ్లు చెదిరే యాక్షన్ సీన్లు, గుక్క తిప్పుకోలేని పంచ్ డైలాగులు మాత్రమే కాదు... చిన్న డైలాగ్, ఒక చిన్న యాక్షన్ సీన్, అంతెందుకు కంటి చూపుతో గూస్ బంప్స్ తెప్పించే సీన్లు మాలిక్‌లో చాలానే ఉన్నాయి. బలమైన సన్నివేశాలు, వాటిని సరిగ్గా తెరకెక్కించడం వల్లనే ఇది సాధ్యమైంది.
కేవలం హీరో పాత్ర మాత్రమే కాకుండా మిగిలిన పాత్రలను కూడా చాలా బలంగా రాసుకోవడం మాలిక్‌లోని మరో ప్రత్యేకత. సినిమాలో కనీసం ఒక్క అనవసరమైన పాత్ర కూడా కనిపించదు. ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకువెళుతుంది. అన్ని ప్రముఖ పాత్రల్లోనూ వేరియేషన్స్ ఉంటాయి. ప్రారంభంలో 10 నిమిషాల పాటు వచ్చే సింగిల్ షాట్ సీనే తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంది. కేరళలో తరచుగా జరిగే ముస్లిం, క్రిస్టియన్ గొడవలను ఈ సినిమాలో ప్రముఖంగా చూపించారు. స్క్రీన్‌ప్లేలో వాడిన నాన్ లీనియర్ నెరేటివ్ టెక్నిక్ సస్పెన్స్‌ను చివరి దాకా హోల్డ్ చేసేందుకు సాయపడింది.
అయితే కథను, క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. ఈ సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాలు. కథ ఎంగేజింగ్‌గా ఉండే నిడివి అనేది అసలు సమస్యే కాదు. కానీ అనవసరమైన సన్నివేశాలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మాత్రం నిడివి అనేది కచ్చితంగా ఇబ్బంది పెట్టే అంశమే.
మాలిక్ సినిమాలో కమల్ హాసన్ ‘నాయకుడు’, ధనుష్ ‘వడ చెన్నై’, మార్లన్ బ్రాండో ‘గాడ్ ఫాదర్’ ఛాయలు అక్కడక్కడా కనిపిస్తాయి. మూల కథ మాత్రం నాయకుడు నుంచి ఇన్‌స్పైర్ అయి రాసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ ట్రీట్‌మెంట్ విషయంలో మహేష్ పూర్తిగా కొత్త పంథాను పాటించాడు. కేరళలో జరిగిన యదార్థ సంఘటనలను ముడిపెడుతూ ఒక ఎంగేజింగ్ పొలిటికల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌ను రాసుకోవడంలో 100 శాతం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా మలయాళంలో గతేడాదే రిలీజై కల్ట్ క్లాసిక్ స్టేటస్‌ను సాధించింది. దీనికి కారణం మహేష్ నారాయణన్ రచనా పంథానే.
సుశిన్ శ్యామ్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. పాటలు వినడానికే కాకుండా తెరపై కూడా ఆకట్టుకుంటాయి. ఇక తను అందించిన నేపథ్య సంగీతం అయితే సినిమా స్థాయిని మరింత పెంచింది. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన సను వర్గీస్ తన కెమెరా కంటితో మనల్ని 2000ల నాటి కేరళకు తీసుకెళ్లిపోతాడు. దర్శకుడు మహేష్ నారాయణనే ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించాడు. రచన మీద ప్రేమతో కొన్ని ల్యాగ్ అనిపించే సన్నివేశాలను కూడా అలానే ఉంచేశాడు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించాల్సింది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ చిత్రం ఇదే. ఆ ఖర్చు తెరపై కనిపిస్తుంది.
Also Read : పేపర్ రాకెట్ రివ్యూ: చావు బండి నుంచి బతుకు వరకూ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఫహాద్ ఫాజిల్ (FaFa) తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆనందం, కోపం, బాధ అన్ని రకాల ఎమోషన్లను కళ్లతోనే పలికిస్తూ సులేమాన్ పాత్రకు ప్రాణం పోశాడు. సాధారణంగా ఇలా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కథల్లో లీడ్ యాక్టర్‌ది వన్ మ్యాన్ షో ఉంటుంది. కానీ మాలిక్ విషయంలో అలా జరగలేదు. తన చుట్టూ మిగతా పాత్రల్లో నటించిన వారు కూడా అద్భుతమైన నటన కనబరిచారు. చుట్టూ అన్ని మంచి పెర్ఫార్మెన్స్‌లు పడ్డాయి కాబట్టే ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఎక్సెల్ అయింది. సులేమాన్ భార్య రోజెలిన్ పాత్రలో కనిపించిన నిమిషా సజయన్, రాజకీయ నాయకుడి పాత్ర పోషించిన దిలీప్ పోతన్, సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించిన జోజు జార్జ్ అందరూ అద్భుతంగా నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మస్ట్ వాచ్. నాయకుడు, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు మీకు నచ్చితే ఇది కూడా కచ్చితంగా నచ్చుతుంది. థియేటర్లో కాకుండా ఓటీటీలోనే విడుదల అయింది కాబట్టి వీకెండ్‌లో ఒకసారి చూసేయచ్చు.
Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?