సినిమా రివ్యూ : కృష్ణ వ్రింద విహారి
రేటింగ్ : 2.5/5
నటీనటులు : నాగశౌర్య, షిర్లే సేతియా, రాధికా శరత్ కుమార్, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, 'స్వామి రారా' సత్య, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ తదితరులు
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
సంగీతం: మహతి స్వరసాగర్
సమర్పణ : శంకర్ ప్రసాద్ మూల్పూరి
నిర్మాత : ఉషా మూల్పూరి
దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ
విడుదల తేదీ: సెప్టెంబర్ 23, 2022
నాగశౌర్య (Naga Shourya) హీరోగా నటించిన సినిమా 'కృష్ణ వ్రింద విహారి'. ఆయన తల్లి ఉషా ముల్పూరి దీనికి నిర్మాత. కుమారుడికి విజయాలు అందించడం కోసం నాగశౌర్య తల్లిదండ్రులు ఐరా క్రియేషన్స్ సంస్థ స్థాపించారు. తొలి సినిమా 'ఛలో' మంచి హిట్. ఆ తర్వాత '@నర్తనశాల' ఫ్లాప్ అయితే... 'అశ్వథ్థామ' కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి, ఈ 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Review) ఎలా ఉంది?
కథ (Krishna Vrinda Vihari Story) : కృష్ణాచారి (నాగశౌర్య) సంప్రదాయాలు పాటించే స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో యువకుడు. తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్) మాట అంటే అతడికి మాత్రమే కాదు, ఆ ఊరిలో అందరికీ వేదవాక్కు. ఆ తల్లి చాటు నుంచి హైదరాబాద్‌కు వెళతాడు కృష్ణ... ఉద్యోగం రావడంతో! అక్కడ ఆఫీసులో వ్రింద శర్మ (షిర్లే సేతియా)తో ప్రేమలో పడతాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన మోడ్రన్ అమ్మాయి అని చెప్పాలి. తొలుత కృష్ణ ప్రేమను తిరస్కరించినా... ఆ తర్వాత ఓకే చెబుతుంది. అయితే... ఒక కండీషన్ పెడుతుంది. తనకు పిల్లలు పుట్టరని, ఆ విషయం మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత, వాళ్ళ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకుందామని అంటుంది. ఇంట్లో అసలు విషయం చెప్పకుండా మరో అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. ఆ తర్వాత ఏమైంది? కృష్ణ, వ్రింద సంసార జీవితంలో ఏం జరిగింది? ట్రెడిషన్ ఫ్యామిలీ, మోడ్రన్ అమ్మాయి మధ్య ఏం జరిగింది? కృష్ణ ఇంట్లో అసలు నిజం తెలిశాక కుటుంబ సభ్యులు ఏమన్నారు? ఈలోపు కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Krishna Vrinda Vihari Telugu Movie Review) : నాని 'అంటే సుందరానికీ' విడుదలకు ముందు సంగతి... ఆ చిత్రకథ, ఈ 'కృష్ణ వ్రింద విహారి' కథ ఒక్కటేనని ప్రచారం జరిగింది. ఈ రోజు సినిమా చూశాక... ఆ మాట నిజమేనని అనిపిస్తుంది. కథనం, సన్నివేశాలు వేరు కావచ్చు... కానీ రెండు సినిమాల్లో కథాంశం ఒక్కటే!
'అంటే సుందరానికీ', 'కృష్ణ వ్రింద విహారి'... రెండు సినిమాల్లో హీరో కుటుంబ నేపథ్యం ఒక్కటే. హీరోయిన్‌ది మోడ్రన్ క్యారెక్టర్. మేజర్ ట్విస్ట్ కూడా ఒక్కటే! మరి, ఈ సినిమాలో కొత్తగా ఏముంది? అని చూస్తే... దర్శకుడు అనీష్ కృష్ణ కథను నడిపించిన విధానం, పాటలు, ప్రొడక్షన్ వేల్యూస్!
'కృష్ణ వ్రింద విహారి'లో హీరో క్యారెక్టరైజేషన్, సన్నివేశాలు ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా కామెడీతో కథ నడిచింది. కానీ, ఎక్కువ నవ్వులు లేవు. 'స్వామి రారా' సత్య, రాహుల్ రామకృష్ణ, నాగశౌర్య మధ్య కామెడీ సీన్స్ వర్కవుట్ కాలేదు. కథ కొత్తగా లేనప్పటికీ ఆ కామెడీ సీన్స్ కొత్తగా ఉండి నవ్వించినట్లు అయితే సినిమా రిజల్ట్ మరో రేంజ్ లో ఉండేది. ఇంటర్వెల్ తర్వాత నుంచి కథ ఆసక్తిగా ముందుకు సాగింది. హీరో హీరోయిన్లకు పెళ్ళైన తర్వాత వచ్చే సన్నివేశాలు వినోదం పండించాయి. తల్లి, పెళ్ళాం మధ్య హీరో నలిగే సన్నివేశాలు భర్తలకు కనెక్ట్ కావచ్చు. పాటలు బావున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా! నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. కథలో మార్పులు, రీషూట్ చేయడం వల్ల అనుకుంట... కొన్ని సన్నివేశాల్లో పూర్ గ్రాఫిక్స్ ప్రేక్షకులు సైతం గమనించేలా ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌కు తాను పర్ఫెక్ట్ ఛాయస్ అని నాగశౌర్య మరోసారి నిరూపించుకున్నారు. యాక్షన్ సన్నివేశాలకు అవసరం వచ్చినప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ కూడా చూపించారు. బ్రాహ్మణ యువకుడిగా చాలా వరకు వేషభాషల విషయంలో ఆ ఫీల్ తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అమ్మాయిగా షిర్లే సేతియా పర్వాలేదు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు. ఈ క్యారెక్టర్ వరకు ఆ డబ్బింగ్ ఓకే. ఇతర పాత్రలకు కష్టం అవుతుంది. ఇతర నటీనటులు పాత్రల పరిధి మేరకు చేశారు. 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ మరోసారి తమదైన శైలి నటన, డైలాగ్ డెలివరీతో నవ్వులు పూయించారు.
Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'కృష్ణ వ్రింద విహారి' క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కథ, స్క్రీన్ ప్లే పరంగా ఎక్కువ ఆశించవద్దు. కొన్ని కామెడీ సీన్స్ బావున్నాయి. ముఖ్యంగా బ్రహ్మాజీ, 'వెన్నెల' కిశోర్ సీన్స్! నాగశౌర్య బాగా చేశారు. కానీ, కథ పరిమితుల వల్ల థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో వినోదం అందించడం, వాళ్ళను శాటిస్‌ఫై చేయడం కష్టమే.
Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?