వెబ్‌ సిరీస్‌ రివ్యూ: దూత
రేటింగ్: 3/5
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు
మాటలు: వెంకటేష్ దొండపాటి
ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల
సంగీతం: ఇషాన్ చబ్రా
నిర్మాత: శరత్ మరార్ 
రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023  
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్‌: 8


Naga Chaitanya Akkineni's Dhootha Web Series Review In Telugu: దర్శకుడు విక్రమ్ కె కుమార్ శైలి వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్ ఇచ్చారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం మరో స్పెషాలిటీ. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది?


కథ (Dhootha Web Series Story): సాగర్ వర్మ (నాగ చైతన్య అక్కినేని) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రిక చీఫ్ ఎడిటర్. ఓ రోజు ఇంటికి వెళుతూ ఉండగా... ధూమ్ ధామ్ ధాబా దగ్గర కారు ఆగుతుంది. ధాబాలోకి వెళ్లిన సాగర్ కంట పడుతుంది ఓ పేపర్ కటింగ్! అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి... పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏమిటి?


జరగబోయే ప్రమాదాన్ని ముందుగా పేపర్లలో రాస్తున్నది ఎవరు? సాగర్ వర్మ చేసిన పాపం ఏమిటి? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), పోలీస్ అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్) పాత్రలు ఏమిటి? సాగర్ వర్మ కథకు... కొన్నేళ్లుగా జరుగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలకు... స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్యాజ్యం వచ్చిన తర్వాత 'దూత' పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి)కి సంబంధం ఏమిటి? ఈ కేసును ఎస్పీ క్రాంతి షినోయ్ (పార్వతి తిరువొతు) ఎలా సాల్వ్ చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Dhootha Web Series Review): విక్రమ్ కె కుమార్ సినిమాలు చూస్తే... ఓ చిన్న పాయింట్ తీసుకుని 'ఇష్క్' తీసి ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టారు. ప్రేమకథను ఫీలయ్యేలా చేశారు. 'మనం' వంటి సంక్లిష్టమైన స్క్రీన్ ప్లేను చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు. రెండూ భిన్నమైన కథలు. కానీ, వాటిని తీసిన దర్శకుడు ఒక్కరే. ఆ అనుభవం 'దూత' దర్శకత్వంలో కనిపించింది.


'దూత' కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్ తర్వాత గానీ క్లారిటీ రాదు. అసలు, అప్పటి వరకు కథ గురించి ఆలోచించే అవకాశాన్ని వీక్షకులకు విక్రమ్ కె కుమార్ ఇవ్వలేదు. ఏదో ఒక మేజిక్ చేస్తూ ముందుకు వెళ్లారు. మొదటి ఎపిసోడ్ మొదలైన కాసేపటికి కథలోకి వెళ్లారు. కళ్ళ ముందు కనిపించే పాత్రలతో ప్రయాణం చేసేలా చేశారు. ఫ్లాష్ బ్యాక్ వచ్చే వరకు ఉత్కంఠ కంటిన్యూ చేశారు. 'దూత'లో దెయ్యం లేదు. కానీ, కంటికి కనిపించని అతీంద్రియ శక్తి ఉందని చెప్పారు. రెగ్యులర్ హారర్ నేపథ్య సంగీతంతో భయపెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ, కంటికి కనిపించని పాత్రను ఫీలయ్యేలా చేశారు. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. కొన్ని సీన్లలో విక్రమ్ డీటెయిలింగ్ సామాన్య ప్రేక్షకులు సైతం గమనించేలా ఉంటుంది.


పరుగు మొదలైన తర్వాత ఏదో ఒక సమయానికి మనకు అలసట వస్తుంది. నడక సైతం నెమ్మదిస్తుంది. ప్రతి కథలోనూ, ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలలో ఆ నెమ్మది ఉంటుంది. 'దూత'కు అటువంటి అలసట ఫ్లాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. అది కొత్తగా లేదు. అప్పటి వరకు కొత్తగా ముందుకు వెళ్లిన కథను సగటు రివేంజ్ ఫార్ములా రూటులోకి తీసుకు వెళ్ళింది. కానీ, కథను ముందుకు తీసుకు వెళ్ళడానికి దర్శకుడికి ఫ్లాష్ బ్యాక్ తీయక తప్పలేదు. పీఏతో ఎడిటర్ ఎఫైర్ ఎపిసోడ్, ఎండింగ్ కాస్త సాగదీత వ్యవహారమే. కాలంతో పాటు వారసులను కర్మ వెంటాడుతోందని అంతర్లీనంగా చిన్న లేయర్ కూడా ఉంది. 'మురారి' తరహాలో! విక్రమ్ తీసిన '13బి' ఛాయలు 'దూత'లో కనిపిస్తాయి. 


ఐదారు ఎపిసోడ్స్ వరకు సస్పెన్స్ మైంటైన్ చేసిన విక్రమ్ కె కుమార్... ఆ తర్వాత కథను ముగింపు దశకు తీసుకు రావడానికి చాలా స్వేచ్ఛ తీసుకున్నారు. క్యారెక్టర్లను కనెక్ట్ చేసిన విధానం కాస్త సినిమాటిక్ టైపులో ఉంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 50 నిమిషాల మధ్య ఉండటం కూడా కాస్త మైనస్ అని చెప్పాలి. ఓటీటీ అంటే రెండు మూడు బూతులు ఉండాలన్నట్లు... అవసరం లేకపోయినా స్పేస్ తీసుకుని మరీ కొన్ని చోట్ల చైతూ నోటితో 'లం...', 'ఫ...' వర్డ్స్ పలికించారు.  


మీడియాలో అవినీతి కొత్త కాదు. దానిని ప్రధానాంశంగా తీసుకున్న విక్రమ్ కె కుమార్... క్లాస్ పీకలేదు. కానీ, అంతర్లీనంగా అవినీతి తగదని సందేశం ఇచ్చారు. మీడియాను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకుంటున్న వైనాన్ని, జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును చక్కగా చూపించారు. ప్రస్తుత సమాజంలో కొన్ని పత్రికలు, ఛానళ్లపై చిన్నపాటి సెటైర్ వేశారు. జర్నలిజం, రాజకీయం, పోలీస్ వ్యవస్థ... మూడు రంగాల్లో మంచి, చెడులను విక్రమ్ కె కుమార్ చూపించారు.


సాంకేతికంగా 'దూత' ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. వర్షంలో సన్నివేశాలు బాగా తీశారు. నేపథ్య సంగీతంలో చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు బావున్నాయి.


నటీనటులు ఎలా చేశారంటే: నాగ చైతన్యది పాజిటివ్ రోల్ అని చెప్పలేం. అలా అని విలన్ కూడా కాదు. అవసరాన్ని బట్టి మారుతూ ముందుకు వెళుతుంది. గ్రే షేడ్స్ ఉన్నాయి. యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంది. లుక్స్ నుంచి ఎక్స్‌ప్రెషన్స్ వరకు చైతన్య ఇంప్రెస్ చేస్తారు.


చైతన్య తర్వాత ఎక్కువగా ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య గరికపాటి, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు సిరీస్ లో కనిపిస్తారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply


ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ నటించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది.


Also Read: ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?


చివరగా చెప్పేది ఏంటంటే: 'దూత' మొదలైన 15 నిమిషాల్లో ఆ ప్రపంచంలోకి వీక్షకులు వెళతారు. సిరీస్ కథ కొత్తది కాదు. కానీ, సస్పెన్స్ అండ్ క్యూరియాసిటీ కంటిన్యూ అవుతూ ముందుకు వెళుతుంది. నాగ చైతన్య నటన, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం ఆకట్టుకుంటాయి. నిడివి కాస్త ఎక్కువే. కానీ, థ్రిల్లర్ జానర్ ఫిలిమ్స్ & సిరీస్ చూసే జనాలకు వీకెండ్ ఇదొక ఆప్షన్! డీసెంట్ సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది!


Also Readకోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?