Harsha Chemudu's Sundaram Master movie review in Telugu: హర్ష చెముడు... వైవా హర్షగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తనదైన నటనతో పలు సినిమాలలో నవ్వించాడు. తనకు అవకాశం వచ్చినప్పుడు, భావోద్వేగభరిత పాత్ర లభించినప్పుడు కంటతడి కూడా పెట్టించారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా సుందరం మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దివ్యశ్రీ పాద కథానాయక. మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.


కథ: పాడేరుకు 90 కిలోమీటర్ల దూరంలో మిరియాల మిట్ట అనే గూడెం ఉంది. జనజీవన స్రవంతికి, దూరంగా బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా... అక్కడి ప్రజలందరూ ఓ కుటుంబంలా జీవిస్తూ ఉంటారు. తమ ఊరికి మరొకరిని రానివ్వరు. అటువంటి మిరియాల మిట్ట నుంచి తమకు ఒక ఇంగ్లీష్ టీచర్ కావాలని ప్రభుత్వానికి లేఖ రావడంతో సుందర్ రావు (హర్ష చెముడు)ను పంపిస్తారు.


సుందర్ రావును మిరియాల మిట్ట పంపించే ముందు ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) తనకోసం అక్కడ ఓ పని చేసి పెట్టమని అడుగుతాడు. ఆ ఊరిలో విలువైనది ఒకటి ఉందని, అదేమిటో తెలుసుకుని తనకు చెప్పమంటాడు. మూడు రోజుల్లో పని ముగించుకుని తిరిగి వద్దామనుకున్న సుందర్ రావుకు మిరియాల మిట్టలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతడికి ఇంగ్లీష్ రాదని తెలుసుకున్న అక్కడి ప్రజలు ఏం చేశారు? విలువైనది సుందర్ రావుకు దొరికిందా? లేదా? చివరికి అతడు ఏం తెలుసుకున్నాడు? అనేది సినిమా.


విశ్లేషణ: బాగా ఏడ్చిన వ్యక్తి నవ్వించగలడు - ఓ రచయిత చెప్పిన మాట! నవ్వించే వ్యక్తి ఏడిపించగలడు కూడా! రాజబాబు, రేలంగి నుంచి బ్రహ్మానందం వరకు అనేక మంది కమెడియన్లు అవకాశం దొరికినప్పుడు తమ నటనతో కంటతడి పెట్టించారు. హర్ష చెముడుకు కొన్ని సినిమాల్లో అటువంటి సన్నివేశాలు వచ్చాయి. హీరోగా తన తొలి సినిమాకు కామెడీతో పాటు ఎమోషన్ ఉండేలా చూసుకున్నారు హర్ష. మరి, ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...


సంపాదన, సుఖం, స్వార్థం - మనిషి కోరికకు, ఆలోచనలకు ఏ పేరు పెట్టినా, వాటి వేటలో జీవించడం మానేస్తున్నాడని చెప్పడమే 'సుందరం మాస్టర్' కథలో మెయిన్ పాయింట్. మనసులో ఆలోచనల బరువు దింపేస్తే ప్రశాంతంగా జీవించవచ్చని ఓ చక్కటి సందేశం కూడా ఇచ్చారు. సందేశం అనే గుళికకు వినోదం పూత పూశారు. వినోదం


హర్ష చెముడు నుంచి ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఆ సంగతి గ్రహించారు. అందుకని, హర్ష నుంచి ఆశించే కామెడీని ఫస్టాఫ్‌లో ఉండేలా చూసుకున్నారు. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ, కమామీషు, సందేశం చెప్పారు. ఇంగ్లీష్ టీచింగ్, స్పెల్లింగ్స్ నేపథ్యంలో సన్నివేశాలు నవ్వించాయి. ఇంటర్వెల్ వరకు కథ లేకున్నా ఆ కామెడీతో బాగానే నడిచింది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. కథలోకి వెళ్లడంతో కామెడీ తగ్గింది. ఎమోషన్స్ అంతగా వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా సోసోగా ఉంటుంది.


హర్ష చెముడు క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నారు. అయితే... ఇంటర్వెల్ తర్వాత ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలు పడలేదు. నేతన్న మరణించే సన్నివేశం సరిగ్గా తీస్తే ప్రేక్షకుల మనసులలో బలమైన ముద్ర వేసేది. ఎమోషన్స్ అన్నీ పైపైన తీసుకుంటూ వెళ్లారు. హీరోయిన్ దివ్య శ్రీపాద పాత్రకు, హీరోతో ప్రేమ కథకు సరైన ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఆ ప్రేమకథనూ పైపైన టచ్ చేసుకుంటూ వెళ్లారు తప్ప సరిగా తీయలేదు. కథలో పెద్దగా ట్విస్టులు ఏమీ లేవు. క్లైమాక్స్ కూడా ఊహించడం పెద్ద కష్టం కాదు.


'సుందరం మాస్టర్' సినిమాకు శ్రీచరణ్ పాకాల డిఫరెంట్ మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేశారు. అయితే... అటవీ నేపథ్యంలో సాగిన సినిమాకు ఆ వెస్ట్రన్ మ్యూజిక్ ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అనేది సందేహమే. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. చంద్రమౌళి ఆర్ట్ వర్క్ బావుంది. కలపతో నిర్మించిన ఇళ్లు, ఆ అటవీ నేపథ్యాన్ని చక్కగా చూపించారు.


Also Read: సిద్ధార్థ రాయ్ రివ్యూ: అర్జున్ రెడ్డి, యానిమల్ టైపులో ఉందా? దర్శకుడు అలా తీశాడా? లేదా? బోల్డ్ సీన్లు ఎలా ఉన్నాయ్?


సుందర్ రావు పాత్రకు హర్ష న్యాయం చేశారు. తనదైన శైలిలో నవ్వించారు. రైటింగ్ లోపల వల్ల ఎమోషనల్ సీన్లు అంతగా వర్కవుట్ కాలేదు. దివ్య శ్రీపాద తన పాత్ర పరిధి మేరకు ఉన్నంతలో చక్కగా చేశారు. 'కెజియఫ్'లో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించిన బాలకృష్ణ... గూడెం పెద్దగా వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. ప్రతి పాత్రకు పర్ఫెక్ట్ ఆర్టిస్ట్‌ను సెలెక్ట్ చేశారు.


'సుందరం మాస్టర్' దర్శకుడు కళ్యాణ్ సంతోష్ రాసుకున్న కథ బావుంది. మనిషి ప్రశాంతంగా జీవించడానికి సంతోషం ముఖ్యమని, డబ్బు కాదని చెప్పాలని ట్రై చేశారు. ఆ ఐడియాను స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. కామెడీ వర్కవుట్ అయినట్లు ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. ఇటువంటి సినిమాలు ఓటీటీల్లో చూడటానికి బావుంటాయి. ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది కనుక!థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో డిజప్పాయింట్ చేస్తాయి. అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే హర్ష చెముడు కామెడీ ఎంజాయ్ చేయవచ్చు.


Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్ - లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?