సినిమా రివ్యూ : మిషన్ ఇంపాజిబుల్ 
రేటింగ్ : 3.5/5
నటీనటులు : టామ్ క్రూజ్, హైలీ యాట్‌వెల్, వింగ్ రైమ్జ్, సైమన్ పెగ్, రెబెక్కా, హెన్రీ చెర్నీ, వనేసా కొర్బీ, పోమ్, ఇసై మోరల్స్ తదితరులు
రచన : క్రిస్టోఫర్ మెక్ క్వారీ, ఎరిక్ జెండ్రెస్సెన్
ఛాయాగ్రహణం : ఫ్రెజర్ టాగ్గర్ట్
సంగీతం : లోర్న్ బెల్ఫ్
నిర్మాతలు : టామ్ క్రూజ్,  క్రిస్టోఫర్ మెక్ క్వారీ
దర్శకత్వం : క్రిస్టోఫర్ మెక్ క్వారీ
విడుదల తేదీ: జూలై 12, 2023


హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise) అండ్ 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియాలోనూ 'మిషన్ ఇంపాజిబుల్'కు ఫ్యాన్స్ ఉన్నారు. అందులోనూ విడుదలకు ముందు టామ్ క్రూజ్ చేసిన స్టంట్ మేకింగ్ వీడియోలు అంచనాలు పెంచేశాయి. ప్రీమియర్ షోస్ నుంచి సూపర్బ్ రివ్యూస్ వచ్చాయి. మరి, సినిమా ఎలా ఉంది (Mission Impossible 7 Review)? 


కథ (Mission Impossible 7 Movie Story) : సముద్రంలో ఓ సబ్ మెరైన్ అనూహ్య రీతిలో మునిగిపోతుంది. అందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) 'ది ఎంటిటీ' సోర్స్ కోడ్ ఉంటుంది. దానిని కంట్రోల్ చేయాలంటే 'కీ' కావాలి. ఆ 'కీ' తమ చేతికి చిక్కితే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చని కొందరు ప్రయత్నిస్తారు. ఆ 'కీ' వాళ్ళ చేతికి చిక్కకుండా ప్రపంచాన్ని కాపాడే బాధ్యత ఈథన్ హంట్ (టామ్ క్రూజ్)కు వస్తుంది. అప్పుడు ఎటువంటి యుద్ధం చేశాడు? కంటికి కనిపించని శత్రువుతో ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు? అతని ప్రయాణంలో గ్రేస్ (హైలీ యాట్‌వెల్), మాజీ ఏజెంట్ ఎల్సా (రెబెక్కా) పాత్రలు ఏమిటి? వైట్ విడో (వనేసా కొర్బీ), గాబ్రియేల్ (ఇసై మోరల్స్) ఎవరు? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Mission Impossible 7 Review) : 'మిషన్ ఇంపాజిబుల్' అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సులు, టామ్ క్రూజ్ చేసే స్టంట్స్! 'ఈ మిషన్ ఇంపాజిబుల్ 7'లోనూ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి. ముఖ్యంగా అభిమానులను అలరిస్తాయి. అందులో నో డౌట్. కథకు వస్తే... ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ఏమీ లేదు. ట్విస్టులు ఊహించడం కష్టం ఏమీ కాదు.


కాలంలో పాటు మనిషికి ఎదురయ్యే ప్రమాదాలు కొత్త రూపం తీసుకుంటున్నాయి. ఈ కథలోనూ ఆ మార్పు కనిపించింది. ఇప్పుడు టెక్నాలజీలో ఎక్కువ వినిపిస్తున్న పదం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్. దాంతో ప్రపంచాన్ని ఎవరైనా నాశనం చేస్తే? ఈ ఊహ భయంకరంగా ఉంది కదూ! మరి, ఏఐను హీరో ఎదుర్కొంటే? హీరోయిజానికి ఎక్కువ స్కోప్ ఉన్న పాయింట్. దర్శకుడు క్రిస్టోఫర్ దీన్ని తీసుకున్నాడు. కథలో కొత్త పాయింట్ ఉంది. హీరోయిజం బావుంది. యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. కానీ, కథను నడిపించిన తీరులో థ్రిల్ ఏమీ లేదు. మనకు థ్రిల్ ఇచ్చేవి యాక్షన్ సీన్లే. 


'మిషన్ ఇంపాజిబుల్'లో కొత్త కథ ప్రారంభానికి మాత్రమే దర్శక రచయితలు 'ఎంఐ 7'ను వాడుకున్నారు. అయితే, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ 'ది ఎంటిటీ' కెపాసిటీ ఏమిటి? దాన్ని ఎవరు, ఎందుకు డెవలప్ చేశారు? వంటి అంశాలను ఈ సినిమాలో డిస్కస్ చేయలేదు. ఐఏ గురించి ప్రారంభంలో చెప్పడంతో తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందని ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి తగ్గట్టు కథ ముందుకు వెళ్ళలేదు. ఏఐ నేపథ్యంలో సీన్లు తక్కువ. 'మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికానింగ్' నెక్స్ట్ పార్ట్ (MI 8) కోసం వెయిట్ చేయాలన్నట్టు వదిలేశారు. 


'ఎంఐ 7'లో యాక్షన్ / స్టంట్ కొరియోగ్రఫర్లను ప్రత్యేకంగా అభినందించాలి. అసలు ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ అన్నట్టు ఉన్నాయి. రోమ్ రోడ్స్ మీద తీసిన కార్ ఛేజ్ గానీ, ఆస్ట్రియన్ ఆల్ఫ్స్ నడుమ తెరకెక్కించిన బైక్ జంప్, పారాగ్లైడింగ్, ట్రైన్ సీన్ గానీ ఉత్కంఠ పెంచాయి. కళ్లప్పగించి అలా చూసేలా తెరకెక్కించారు. సీరియస్ యాక్షన్ సీక్వెన్సుల్లో ఎంటర్టైన్మెంట్ మేళవించిన తీరు బావుంది. నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్సుల్లో థ్రిల్ మరింత పెంచింది. విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి.


నటీనటులు ఎలా చేశారు? : ఈథన్ హంట్ అంటే టామ్ క్రూజ్. ఆ పాత్రలో మరొక హీరోను ఊహించుకోలేం. 'మిషన్ ఇంపాజిబుల్ 7' చూసిన తర్వాత టామ్ క్రూజ్ తప్ప ఇంకెవరూ ఆ తరహాలో నటించలేరని, స్టంట్స్ చేయలేరని అనిపిస్తుంది. వన్స్ ఎగైన్... టామ్ క్రూజ్ ఇరగదీశారు. గ్రేస్ పాత్రలో హైలీ యాట్‌వెల్ సెటిల్డ్ ఎమోషన్స్ చూపించారు. సైమన్ పెగ్ డైలాగ్స్ నవ్విస్తాయి. పారిస్ పాత్రలో పోమ్ యాక్షన్ సీన్లు చేశారు. ఆమె నటన కూడా ఆకట్టుకుంటుంది. రెబెక్కా పాత్రను ముగించడం ఆమె అభిమానులను డిజప్పాయింట్ చేయవచ్చు.


Also Read : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?


చివరగా చెప్పేది ఏంటంటే? : టామ్ క్రూజ్ అభిమానులకు, యాక్షన్ సినిమా ప్రేమికులకు విపరీతంగా నచ్చే సినిమా 'మిషన్ ఇంపాజిబుల్ 7'. ప్రేక్షకులు ఎవరైనా సరే ఉత్కంఠ భరితంగా సాగే ఆ యాక్షన్ సీక్వెన్సులను ఊపిరి బిగబట్టి చూడటం ఖాయం. టామ్ క్రూజ్ టాప్ లేపేశాడు. వెండితెరపై అసలు మిస్ కావద్దు. 


Also Read : '7:11 పీఎం' సినిమా రివ్యూ : టైమ్ ట్రావెల్ చేసి మరీ ఓ ఊరిని హీరో కాపాడితే?