సినిమా రివ్యూ : ఎల్‌జిఎమ్
రేటింగ్ : 2.25/5
నటీనటులు : హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్, వీటీవీ గణేష్, వెంకట్ ప్రభు, శ్రీనాథ్, మోహన్ వైద్య తదితరులు
ఛాయాగ్రహణం : విశ్వజిత్ ఒదుక్కత్తిల్
నిర్మాణ సంస్థ : ధోని ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : సాక్షి సింగ్ ధోని, వికాస్ హస్జా
సంగీతం, దర్శకత్వం : రమేష్ తమిళ్ మణి
విడుదల తేదీ : ఆగస్టు 04, 2023


భారతీయులు వినోదం కోసం ఎక్కువగా చూసేది రెండు! అందులో ఒకటి క్రికెట్ అయితే... మరొకటి సినిమా! క్రికెట్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఇప్పుడు చిత్రసీమలో అడుగు పట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఆ సంస్థలో ధోని సతీమణి సాక్షీ సింగ్ ధోని నిర్మించిన మొదటి సినిమా 'ఎల్‌జిఎమ్' (LGM Movie). హరీష్ కళ్యాణ్, 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా జంటగా నటించారు. నదియా, యోగిబాబు ఇతర తారాగణం. ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ (LGM Movie Story) : గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా (ఇవానా) ప్రేమికులు. రెండేళ్ళ నుంచి డేటింగులో ఉన్నారు. పైగా, ఇద్దరూ పని చేసేది ఒక్కటే కంపెనీ. ఈ డేటింగ్ & లవ్ కహాని గౌతమ్ తల్లి లీలా (నదియా)కు తెలుస్తుంది. వాళ్ళ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు... పెళ్ళికి ఓకే చెబుతుంది. అయితే... మీరా ఓ కండిషన్ పెడుతుంది. పెళ్ళి తర్వాత వేరు కాపురం పెట్టాలని కోరుతుంది. దానికి గౌతమ్ ఒప్పుకోడు. ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అప్పుడు మీరా ఓ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కాబోయే అత్తగారి గురించి తెలుసుకోవడం కోసం ప్రేమికుడితో కలిసి కూర్గ్ వెళుతుంది. అక్కడ ఏమైంది? తల్లి, ప్రేయసి మధ్య గౌతమ్ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అతడి చెప్పకుండా మీరా, లీలా గోవా ఎందుకు వెళ్లారు? ఆ తర్వాత ఏమైంది? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (LGM Movie Review) : అత్తా కోడళ్ళ కాన్సెప్ట్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ ఫార్ములా! పైగా, ట్రావెలింగ్ బేస్ అంటే ఈతరం ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉన్నట్టే! ఇక, ధోని నిర్మాత కావడంతో యువతరం కన్ను సినిమాపై పడింది. మంచి అంచనాలు ఏర్పడ్డాయి. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు... తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు సినిమాలో ఉన్నాయి. మరి, అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? అంటే... 'లేదు' అని మరో సందేహం లేకుండా చెప్పవచ్చు. 


రొమాంటిక్ కామెడీ సినిమాలు వర్కవుట్ అవ్వాలంటే... హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు క్యూట్, లిటిల్ మూమెంట్స్ & కామెడీ వర్కవుట్ కావాలి. వాళ్ళ మధ్య సన్నివేశాల్లో ప్రేక్షకులు తమను తాము ఊహించుకోవాలి. చిలిపి గిల్లికజ్జాలు చూసి నవ్వుకోవాలి. 'లెట్స్ గెట్ మ్యారీడ్'లో ఆ విధంగా ఫీలయ్యే సీన్లు చాలా తక్కువ ఉన్నాయి. యోగిబాబు కామెడీ బావున్నప్పటికీ... కథ అతడిది కాదుగా! ఫస్టాఫ్‌లో కామెడీ కొంచెం వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్ కామెడీ డోస్ తగ్గి కాబోయే అత్తా కోడళ్ళ మీదకు వెళ్ళడంతో బోర్ మూమెంట్స్ పెరిగాయి. వాళ్ళ మధ్య డ్రామా బాగా తీసి ఉంటే బావుండేది. ఆ సన్నివేశాల్లో స్టఫ్ లేదు.  


నిజం చెప్పాలంటే... 'లెట్స్ గెట్ మ్యారీడ్'లో చెప్పాలనుకున్న పాయింట్ చాలా మంచిది. ఈ తరం యువతకు అవసరమైనది కూడా! ఉమ్మడి కుటుంబాలు చాలా తగ్గాయి. కొత్త కోడళ్ళు అత్తగారితో కలిసి ఉండాలని కోరుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి కనుక... పెళ్లికి ముందు బ్యాచిలర్ ట్రిప్స్ కు బదులు కాబోయే అత్తా కోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రిప్ వేయాలని అనుకోవడం మంచి ఆలోచన.


దర్శకుడు రమేష్ తమిళ్ మణి ఆ కథను ఆసక్తికరంగా తీయడంలో ఫెయిల్ అయ్యారు. సీరియల్ సాగదీసినట్లు సాగదీశారు. హీరో హీరోయిన్స్ మధ్య  కెమిస్ట్రీ కూడా వర్కవుట్ కాలేదు. ఒక దశలో తెరపై దర్శకుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో క్లారిటీ ఉండదు. సరైన ముగింపు ఇవ్వడంలోనూ ఫెయిల్ అయ్యారు. పాటలు, నేపథ్య సంగీతం సోసోగా ఉన్నాయి. ధోని సంస్థ ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.   


నటీనటులు ఎలా చేశారు? : సినిమాలో హరీష్ కళ్యాణ్ పేరుకు మాత్రమే హీరో. వై? ఎందుకు? అంటే... అసలు హీరోలు ఇవానా, నదియా. ఇంటర్వెల్ తర్వాత వాళ్ళు తప్ప హీరో కనిపించిన సన్నివేశాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఆయన నటన కూడా అలాగే ఉంది. అతిథి పాత్ర తరహాలో! 'లవ్ టుడే'తో తెలుగు ప్రేక్షకులకూ ఇవానా పరిచయమైంది. ఆ సినిమాలో పాత్రకు, ఇందులో మీరా పాత్రకు కొన్ని పోలికలు కనపడతాయి. నటన కూడా ఇంచు మించు ఆ విధంగా ఉంది. తెలుగులో నదియా కొన్ని అత్త, తల్లి పాత్రలు చేశారు. ఆ కారణం వల్లో, మరొకటో గానీ ఆమె నటన కొత్తగా కనిపించదు. అయితే... కొన్ని సన్నివేశాల్లో నదియా, ఇవానా మధ్య కెమిస్ట్రీ సోసోగా ఉంది. యోగిబాబు, ఆర్జే విజయ్ కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. దర్శకుడు వెంకట్ ప్రభు హీరో బాస్ పాత్రలో కనిపించారు.   


Also Read : 'దయా' రివ్యూ : జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్ సిరీస్... సత్యను గుర్తు చేసిన జేడీ!


చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఎల్‌జీఎమ్'లో చెప్పాలనుకున్న విషయం మంచిదే. మంచి కథను ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు రమేష్ తమిళ్ మణి ఫెయిల్ అయ్యాడు. కొంతలో కొంత కామెడీ పర్వాలేదు. ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు. లేదంటే ధోనీ కోసం అభిమానులు ఓసారి ట్రై చేయవచ్చు. 


Also Read మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial