సినిమా రివ్యూ :  జైలర్ 
రేటింగ్ : 2.75/5
నటీనటులు : రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా భాటియా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు తదితరులు
ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్ 
సంగీతం : అనిరుధ్ 
సమర్పణ : కళానిధి మారన్  
నిర్మాణం : సన్ పిక్చర్స్
రచన, దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
విడుదల తేదీ: ఆగస్టు 10, 2023


సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జైలర్'. తమన్నా పాట 'నువ్ కావాలయ్యా'తో సినిమాకు క్రేజ్ వచ్చింది. ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. మరి, సినిమా (Jailer Review) ఎలా ఉంది? విజయ్ 'బీస్ట్'తో అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్... ఈ సినిమాను ఎలా తీశారు?


కథ (Jailer Movie Story) : ముత్తు... ముత్తు వేల్ పాండియన్ (రజనీకాంత్) రిటైర్డ్ జైలర్. భార్య విజయ (రమ్యకృష్ణ), కుమారుడు, కోడలు, మనవడితో శేష జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ముత్తు కుమారుడు అర్జున్ (వసంత్ రవి) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. పురాతన దేవాలయాల్లో విగ్రహాలను చోరీ చేసే ముఠాను పట్టుకోవాలని నాలుగున్నరేళ్లుగా దర్యాప్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఆధారం సంపాదిస్తాడు. ఆ కేసును వదిలేయమని కొందరు హెచ్చరించినా వదిలిపెట్టడు. ఓ రోజు అతను కనిపించకుండా పోతాడు. అర్జున్ మరణించాడని పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. కుమారుడి మరణించాడనే విషయం ముత్తు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. విగ్రహాలను చోరీ చేసే ముఠా అంతు చూడాలని ముందడుగు వేస్తాడు. దాంతో ముత్తు కుటుంబ సభ్యులు అందరినీ చంపేయాలని వర్మ (వినాయకన్) ఎటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ వర్మ ఎవరు? కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ముత్తు ఏం చేశాడు? చివరకు, ముత్తు తెలుసుకున్న నిజం ఏమిటి? అప్పుడు ఏం చేశాడు? అనేది వెండితెరపై చూడాలి. మధ్యలో బ్లాస్ట్ మోహన్ (సునీల్), కామ్నా (తమన్నా) పాత్రలు ఏమిటి? అనేది ఆసక్తికరం!


విశ్లేషణ (Jailer Movie Review) : రజనీకాంత్ ఇమేజ్, స్టార్ స్టేటస్ హిమాలయాల అంత ఎత్తుకు ఎప్పుడో చేరుకున్నాయి. ఆ ఇమేజ్ హ్యాండిల్ చేయగల కథలు, దర్శకులు అరుదుగా ప్రేక్షకులకు కనిపిస్తున్నారు. యువ హీరోలకు విజయాలు అందించిన, మంచి పేరు తెచ్చుకున్న దర్శకులకు ఆయన వరుస అవకాశాలు ఇస్తున్నారు. అయితే... రజనీ నుంచి ఆశించిన సినిమాలు మాత్రం రావడం లేదు. 'జైలర్' పాటలు & ప్రచార చిత్రాలు చూసినప్పుడు... ఈసారి హిట్ గ్యారెంటీ అని అభిమానుల్లో నమ్మకం వచ్చింది.


థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులను విశ్రాంతి వరకు బాగా ఎంగేజ్ చేస్తుందీ 'జైలర్'. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఎటు పోతుందీ ప్రయాణం? అని సందేహాలు వస్తాయి. మళ్ళీ పతాక సన్నివేశాల్లో గానీ సినిమా గాడిలో పడలేదు.


విశ్రాంతి వరకు అటు రజనీకాంత్ ఇమేజ్, ఇటు కథను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బాగా హ్యాండిల్ చేశారు. డార్క్ హ్యూమర్ తీయడంలో ఆయన స్పెషలిస్ట్. రజని, యోగి బాబు కాంబినేషన్ సన్నివేశాల్లో మరోసారి కామెడీ పండించడంలో టాలెంట్ చూపించారు. స్క్రీన్ మీద ఆర్టిస్టులు సీరియస్ యాక్టింగ్ చేస్తుంటారు. కానీ, స్క్రీన్ ముందు ఉన్న ప్రేక్షకులకు నవ్వు ఆగదు. 


రజనీకాంత్ హీరోయిజాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతంగా చూపించారు. అందుకు మెయిన్ క్రెడిట్ సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh Ravichander BGM Jailer)కు ఇవ్వాలి. ఆయన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను విపరీతంగా ఎలివేట్ చేశాయి. కొత్త సంగీతం వినిపించింది. సినిమాటోగ్రఫీ, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు. విశ్రాంతి తర్వాత కథపై నెల్సన్ దిలీప్ కుమార్ కాన్సంట్రేట్ చేసుంటే ఫలితం కూడా రజనీకాంత్ ఇమేజ్ స్థాయిలో ఉండేది. అది జరగలేదు. కథలో ట్విస్టులు ఊహించడం కష్టం ఏమీ కాదు. అసలే కథలో రజనీకాంత్ హీరోయిజం తప్ప కొత్తదనం లేదు.


నటీనటులు ఎలా చేశారు? : రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. నటన ఆయనకు కొత్త కాదుగా! మాస్ - క్లాస్, యూత్ - ఫ్యామిలీ అని తేడా లేదు... అన్ని వర్గాల ప్రేక్షకులు విజిల్స్ వేసేలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన మార్క్ మేనరిజమ్స్ సైతం ఆకట్టుకుంటాయి. డైనింగ్ టేబుల్ సీన్, ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్... రజనీ హీరోయిజం పీక్స్‌లో ఉంటుంది. ఆయనకు జోడీగా రమ్యకృష్ణ హుందాగా ఉంది. వసంత్ రవి మరోసారి ఆకట్టుకుంటారు. ప్రతినాయకుడిగా వినాయకన్ నటన, ఆహార్యంలో తమిళ నేటివిటీ ఎక్కువైంది.


మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్... కథలో ముగ్గురి పాత్రల నిడివి చాలా తక్కువ. ఉన్నంత సేపు వాళ్ళకు మంచి ఎలివేషన్లు ఇచ్చారు నెల్సన్ దిలీప్ కుమార్. తమన్నా పాత్ర నిడివి కూడా తక్కువే. ఓ పాట, రెండు మూడు సీన్లకు మాత్రమే పరిమితం అయ్యారు. 'నువ్ కావాలయ్యా...' సాంగ్ పిక్చరైజేషన్ స్క్రీన్ మీద కూడా బాగుంటుంది. ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఆయనను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. నాగబాబు అతిథి పాత్రలో తళుక్కుమన్నారు.


నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాల్లో యోగిబాబు, వీటీవీ గణేష్ సన్నివేశాలు ఎప్పుడూ బావుంటాయి. 'జైలర్'లోనూ అంతే! రజనీకాంత్, యోగిబాబు బాగా నవ్వించారు. ఆ కామెడీ సీన్లలో వాళ్ళిద్దరి టైమింగ్ ఫెంటాస్టిక్. వీటీవీ గణేష్ కూడా నవ్వించారు. ఇంకా కొంత మంది తెలిసిన నటీనటులు తెరపై కనిపిస్తారు. అయితే, రిజిస్టర్ కావడం కష్టం.


Also Read : 'దయా' రివ్యూ : జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'జైలర్' థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకు విశ్రాంతి వచ్చే సరికి కడుపు నిండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చారు రజనీకాంత్. ఆయన స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. సూపర్ స్టార్ ఇమేజ్, హీరోయిజం మీద అతిగా ఆధార పడిన నెల్సన్ దిలీప్ కుమార్ సెకండాఫ్‌లో షాక్స్ మీద షాక్స్ ఇచ్చారు. మినిమమ్ ఎంగేజ్ చేసే సీన్లు లేకుండా చివరి వరకు కథను నడిపించి... పతాక సన్నివేశాల్లో చిన్న హై ఇచ్చి పంపించారు. అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... రజనీకాంత్ హీరోయిజం చూడటం కోసం అయితే సిల్వర్ స్క్రీన్లకు వెళ్ళండి.   


Also Read : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial