సినిమా రివ్యూ : బ్రో 
రేటింగ్ : 3/5
నటీనటులు : పవన్ కళ్యాణ్, సాయి తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, సుబ్బరాజు, రాజా, 'వెన్నెల' కిషోర్, తనికెళ్ల భరణి, పృథ్వీ రాజ్, యువలక్ష్మి, అలీ రెజా తదితరులు
మాటలు, కథనం : త్రివిక్రమ్ శ్రీనివాస్
ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్
సంగీతం : ఎస్.ఎస్. థమన్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల 
నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్
కథ, దర్శకత్వం : సముద్రఖని 
విడుదల తేదీ: జూలై 28, 2023


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'. తమిళంలో సముద్రఖని తీసిన 'వినోదయ సీతం' దీనికి మూలం. తెలుగులో త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమా ఎలా ఉంది?    


కథ (Bro Movie Story) : మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయి తేజ్) ఇంటికి పెద్ద కొడుకు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు అన్నీ నెత్తిన వేసుకున్నాడు. తనకు అసలు టైమ్ లేదంటూ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఆఫీసు పని మీద విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా... కారుకు యాక్సిడెంట్ అవుతుంది. మార్క్ ఆత్మకు టైటాన్ అలియాస్ టైమ్ (పవన్ కళ్యాణ్) మరో ఛాన్స్ ఇవ్వడంతో భూమి మీదకు వస్తాడు. అప్పుడు ఏం జరిగింది? మార్క్ చెల్లెలు వీణ (ప్రియా ప్రకాష్ వారియర్) కథ ఏమిటి? మరో చెల్లెలు, తమ్ముడు ఏం చేశారు? మార్క్ ప్రేమించిన రమ్య (కేతికా శర్మ) ఏమైంది? అమ్మ (రోహిణి) పాత్ర ఏమిటి? చివరకు, మార్క్ ఏం తెలుసుకున్నాడు? అనేది తెరపై చూడాలి.    


విశ్లేషణ (Bro Review In Telugu) : పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా అభిమానుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని 'బ్రో' చిత్రాన్ని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. స్టార్టింగ్ టు ఎండింగ్... పవన్ కళ్యాణ్ కనిపించే ప్రతి సన్నివేశాన్ని ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసినట్లు ఉంటుంది. 


పవన్ లుక్స్, పవన్ డ్రస్, పవన్ షూస్, పవన్ డైలాగ్స్, పవన్ సాంగ్స్... స్క్రీన్ మీద పవన్ వచ్చిన ప్రతిసారీ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. వింటేజ్ పవర్ స్టార్ కనిపించారు. సినిమాను భుజాలపై మోశారు. ఆయనను పక్కన పెడితే... సాయి తేజ్ ఎంట్రీ కానీ, కొన్ని సన్నివేశాలు కానీ కాస్త కృతకంగా అనిపిస్తాయి. సమయం తక్కువ అయినప్పటికీ... పవన్ కళ్యాణ్ ఎంట్రీ ముందు వచ్చే సాయి ధరమ్ తేజ్ సన్నివేశాలు మరింత ప్రభావవంతంగా తీస్తే బావుండేది. 


'బ్రో'లో వినోదం ఉంది. ఆ సీన్లు అభిమానులను ఆకట్టుకుంటుంది. భావోద్వేగాల పరంగా సోసోగా ఉంది. ప్రీ క్లైమాక్స్ సాంగ్ టు క్లైమాక్స్ వరకు వర్కవుట్ అయిన ఎమోషన్ అంతకు ముందు కూడా వర్కవుట్ అయితే బావుండేది. సాయి తేజ్ పాత్రలో బలమైన సంఘర్షణ ఉంది. దాన్ని సరిగా ఆవిష్కరించలేదు. కుటుంబం కోసం తాను చాలా చేశానని, ఆ కుటుంబం తనకు చెప్పకుండా కొన్ని విషయాలు దాచిందని మథనపడే సీన్లు గానీ, ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని ఫీలయ్యే సీన్ గానీ, ప్రేయసిని దూరం పెట్టాలని అనుకుంటే తన దగ్గరకు వచ్చే సన్నివేశాల్లో కానీ డెప్త్ మిస్ అయ్యింది. 


బలమైన సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరువయ్యేలా తీయడంలో సముద్రఖని పూర్తిగా విజయం సాధించలేదు. బహుశా... హడావిడిగా తీయడం వల్ల ఏమో!? కొందరి ఫస్టాఫ్ కామెడీ నచ్చితే, మరికొందరికి సెకండాఫ్ ఎమోషన్స్ నచ్చుతాయి. కథలో, కథనంలో కన్సిస్టెన్సీ మిస్ అయిన ఫీలింగ్, ఏదో వెలితి ఉంటాయి. పూర్తిగా బావుందని చెప్పలేం. అలాగని, బాలేదనీ చెప్పలేం.  


తమన్ పాటలు ఓకే. అయితే, ఆయన ఇంత కంటే అద్భుతమైన బాణీలు గతంలో అందించారు. అందువల్ల, ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. వాటిని ఈ పాటలు అందుకోవడం కష్టమే. అయితే... ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సాయి తేజ్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ బావుంది. ఆ సన్నివేశంలో కంటతడి పెట్టిస్తుంది. నేపథ్య సంగీతంలో తన మార్క్ చూపించారు తమన్. 'బ్రో' థీమ్ సాంగ్ నేపథ్యంలో వినిపించిన ప్రతిసారీ ఓ హై వస్తుంది. ఇక, పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లో పాటలు అభిమానులకు హై వస్తుంది. అయితే... కొత్త పాటలు చేస్తే బావుంటుందని అనిపిస్తుంది. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బావుంది. మాటల్లో, స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది. కొన్ని మాటలే ఆకట్టుకుంటాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఓకే. 


నటీనటులు ఎలా చేశారు? : 'బ్రో' కథలో అసలు హీరో సాయి తేజ్ అయినప్పటికీ... ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చిందంటే కారణం పవన్ కళ్యాణ్! పవర్ స్టార్ కోసం థియేటర్లకు వెళ్ళిన అభిమానులకు 'బ్రో' ఫుల్ మీల్స్ పెడుతుంది. పవన్ ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్లినట్లు ఉంటుంది... స్క్రీన్ మీద వింటేజ్ సాంగ్స్ వస్తుంటే! ఇక, నటనలో ఎనర్జీ చూపించారు. తెరపై చాలా హుషారుగా కనిపించారు. తన క్యారెక్టర్ వరకు పవన్ కళ్యాణ్ న్యాయం చేశారు. 


మార్క్ పాత్రలో సాయి తేజ్ ఓకే. యాక్సిడెంట్ తర్వాత ఆయన కాస్త లావెక్కారు. స్క్రీన్ మీద ఆ మార్పు కనబడుతుంది. డ్యాన్సులు కూడా సోసోగా చేశారు. నటుడిగా ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. కేతికా శర్మ పాటలో, కొన్ని సీన్లలో కనిపించారు. సాయి తేజ్ ప్రేయసిగా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ చేశారు. ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లెలి పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. తల్లిగా రోహిణి మరోసారి భావోద్వేగభరిత సన్నివేశాలు చేయడంలో తన అనుభవం చూపించారు. 


'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, అలీ రెజా తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. బ్రహ్మానందం అతిథి పాత్రలో మెరిశారు. ఆయన ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కనపడతారు. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ముందు మిగతా ఆర్టిస్టులకు పెద్ద స్కోప్ దక్కలేదు. 


Also Read : 'ఓపెన్ హైమర్' రివ్యూ : ఇది నోలన్ సినిమా, అణుబాంబు సృష్టికర్త బయోపిక్!


చివరగా చెప్పేది ఏంటంటే? : పవన్ కళ్యాణ్ అభిమానుల కోసమే 'బ్రో'. సినిమాలో ఓ సందేశం ఉంటుంది. ఆ సందేశాన్ని చెప్పిన తీరు బావుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ సందేశం ఆలోచింపజేస్తుంది. పవన్ ఎనర్జీ ఫుల్ పటాస్ అన్నట్లు ఉంటుంది. పవన్ కోసం థియేటర్లకు వెళ్ళవచ్చు. పవన్ అభిమానులను శాటిస్‌ఫై చేసే సినిమా. యువతకు కామెడీ నచ్చితే... వయసు పైబడిన వాళ్ళకు సందేశం, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.


Also Read : 'హిడింబ' రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial