సినిమా రివ్యూ : బ్లాక్ ఆడమ్ (ఇంగ్లిష్)
రేటింగ్ : 2.75/5
నటీనటులు : డ్వేన్ జాన్సన్, సారా షాహి, పియర్స్ బ్రాస్నన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : లారెన్స్ షేర్
సంగీతం: లార్న్ బాల్ఫీ
నిర్మాతలు : డీసీ ఫిల్మ్స్
దర్శకత్వం : జావుమే కొల్లెట్-సెర్రా
విడుదల తేదీ: అక్టోబర్ 20, 2022


డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో లేటెస్ట్ సినిమా బ్లాక్ ఆడమ్ గురువారం థియేటర్లలో విడుదల అయింది. ఈ ఫ్రాంచైజీలోనే ఎక్కువ హైప్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ఇది రిలీజ్ అవుతుంది. సినిమాల్లో డీసీ భవిష్యత్తును నిర్ణయించే ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏకంగా 200 మిలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1,620 కోట్లు పైనే) బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించారు. మోస్ట్ వయొలెంట్ సూపర్ హీరో సినిమాగా దీన్ని రూపొందించినట్లు ట్రైలర్లు, టీజర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ సినిమా డీసీకి కొత్త ఊపిరులు పోసిందా? హిట్ కొట్టి తీరాలన్న ఫ్యాన్స్ కోరికను బ్లాక్ ఆడమ్ తీర్చిందా?


కథ: ఐదు వేల సంవత్సరాల క్రితం భూమి మీద కాందాక్ అనే నగరం అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతతో ఉండేది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజు ఆన్హ్ కోట్ (మర్వాన్ కెన్‌జారీ) ఎటర్నియం అనే లోహం కోసం ప్రజలను బానిసలుగా చేసి తవ్విస్తుంటాడు. ఆ లోహంతో చేసిన కిరీటం ధరిస్తే శక్తులు వచ్చి ప్రపంచాన్ని ఏలవచ్చనేది తన కోరిక. కానీ కొందరు ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. వారిని రాజు క్రూరంగా చంపేస్తాడు. అయితే వారిలో ఒకడైన టెత్ ఆడమ్‌కు (డ్వేన్ జాన్సన్) షాజామ్ శక్తులు వస్తాయి. తనకు, రాజుకు జరిగిన యుద్ధంలో రాజు చనిపోతాడు. కోట నాశనం అవుతుంది. ఐదు వేల సంవత్సరాల తర్వాత ఆ కిరీటం కోసం కొందరు తిరిగి వెతకడం ప్రారంభిస్తారు. అలాగే టెత్ ఆడమ్ కూడా తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? టెత్ ఆడమ్, బ్లాక్ ఆడంగా ఎలా మారాడు? జస్టిస్ సొసైటీ ఎవరు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


విశ్లేషణ: మార్వెల్, డీసీ వంటి కామిక్ బుక్స్ ఆధారంగా వచ్చే సూపర్ హీరో సినిమాల్లో కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉండే కథలు, పాత్రలు ఆల్రెడీ సూపర్ హిట్. వాటిని మనం ఎంత ప్రభావవంతంగా చూపించామనే దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జావుమే కొల్లెట్-సెర్రా సక్సెస్ అయ్యారు. సినిమాను యాక్షన్, మ్యూజిక్ నిలబెట్టేశాయి. ప్రారంభంలో కాందాక్ నగరం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మనకు కేజీయఫ్‌ను గుర్తు చేస్తాయి.


సినిమా అంతా చాలా ఫాస్ట్‌గా రేసీ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా కనిపించదు. ముఖ్యంగా బ్లాక్ ఆడమ్ తిరిగొచ్చాక యాక్షన్ సన్నివేశాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకుడికి ఆలోచించుకునే గ్యాప్ కూడా ఉండదు. కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలకు, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోడయింది. దీంతోపాటు బ్లాక్ ఆడమ్‌లో కామెడీ కూడా బాగా పండింది. తనకు రాసుకున్న వన్ లైనర్ పంచెస్ బాగా పేలాయి.


అయితే బ్లాక్ ఆడమ్‌తో వచ్చిన చిక్కేంటంటే... ఇది మొదటి సీన్ నుంచే ‘నేను ప్రజలను కాపాడటానికే పుట్టాను. నా పనే అది.’ అనే సాధారణ సూపర్ హీరో సినిమా కాదు. ‘ప్రజలను కాపాడటం నా పని కాదు. అది హీరోల పని.’ అనేది బ్లాక్ ఆడమ్ అజెండా. తను విలన్లతో పోరాడేటప్పుడు ప్రజలు చనిపోయినా పెద్దగా పట్టించుకోడు. రెగ్యులర్ టెంప్లేట్ సూపర్ హీరో సినిమాలు ఇష్టపడేవారికి ఈ కొత్త ప్రయత్నం అంతగా నచ్చకపోవచ్చు. కానీ యాక్షన్ సీక్వెన్స్‌లు, మ్యూజిక్ కోసం అయితే ఈ సినిమాను ఒకసారి కచ్చితంగా చూడవచ్చు. సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది. సినిమా అయిపోగానే బయటకు వచ్చేయకుండా పోస్ట్ క్రెడిట్ సీన్ వరకు వెయిట్ చేస్తే అదేంటో తెలుస్తుంది.


దర్శకుడు, హీరో తర్వాత ఈ సినిమాలో గుర్తుండిపోయేది సంగీతం అందించిన లార్న్ బాల్ఫీ. తను అందించిన నేపథ్య సంగీతాన్ని సినిమా అయిపోయాక కూడా మర్చిపోలేం. జాన్ లీ, మైకేల్ సేల్‌ల ఎడిటింగ్ చాలా క్రిస్ప్‌గా ఉంది. సినిమాలో అనవసర సన్నివేశాలు అసలు కనిపించవు. విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరుస్తాయి.



Also Read : 'కాంతార' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?



ఇక నటీనటుల విషయానికి వస్తే... ‘బ్లాక్ ఆడమ్ పాత్ర చేయడానికే నేను పుట్టాను.’ ఈ సినిమా ఒప్పుకున్నాక డ్వేన్ జాన్సన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇది. చెప్పినట్లే ఆ పాత్రలో తను జీవించేశాడు. బ్లాక్ ఆడమ్ పాత్రలో ఉన్న రఫ్‌నెస్, కేర్ ఫ్రీ యాటిట్యూడ్, డెప్త్ అన్నిటినీ స్క్రీన్ మీద చక్కగా ప్రెజెంట్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది డ్వేన్ జాన్సన్ వన్ మ్యాన్ షో. డాక్టర్ ఫేట్ మాత్రలో కనిపించిన పియర్స్ బ్రాస్నన్ ఆకట్టుకుంటాడు. ఈ పాత్ర మార్వెల్ క్యారెక్టర్ డాక్టర్ స్ట్రేంజ్‌ను తలపిస్తుంది. కానీ కామిక్స్ పరంగా చూసుకుంటే డాక్టర్ ఫేట్‌నే ముందుగా ఇంట్రడ్యూస్ అయింది. మిగతా పాత్రల్లో నటించిన వారందరూ ఆకట్టుకుంటారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... యాక్షన్ మూవీ లవర్స్‌కు బ్లాక్ ఆడమ్ కచ్చితంగా నచ్చుతుంది. అయితే రెగ్యులర్ ఫార్మాట్ తరహా సూపర్ హీరో సినిమాలు చూసేవారికి ఈ యాంటీ హీరో నచ్చుతాడో లేదో చూడాలి.


Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?