సినిమా రివ్యూ : భోళా శంకర్
రేటింగ్ : 2/5
నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రఘు బాబు, మురళీ శర్మ, 'వెన్నెల' కిశోర్, తులసి, బ్రహ్మాజీ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా తదితరులు
కథా పర్యవేక్షణ : సత్యానంద్
మాటలు : మామిడాల తిరుపతి
ఛాయాగ్రహణం : డడ్లీ
సంగీతం : మహతి స్వరసాగర్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
కథనం, మాటలు, కథా విస్తరణ, దర్శకత్వం : మెహర్ రమేష్
విడుదల తేదీ: ఆగస్టు 11, 2023
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన 'భోళా శంకర్' (Bhola Shankar) సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. తమిళ హిట్, అజిత్ 'వేదాళం' స్ఫూర్తితో తీసిన చిత్రమిది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ నటించారు. తమన్నా కథానాయికగా కనిపించారు. సుశాంత్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా (Bhola Shankar Review) ఎలా ఉందంటే?
కథ (Bhola Shankar Story) : మహాలక్ష్మి (కీర్తీ సురేష్) అద్భుతమైన పెయింటింగ్స్ గీస్తుంది. కలకత్తాలో మంచి ఆర్ట్స్ కాలేజ్ ఉందని, ఆమెను అందులో జాయిన్ చేయడానికి అన్నయ్య శంకర్ (చిరంజీవి) కలకత్తా షిఫ్ట్ అవుతాడు. క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరతాడు. అప్పటికి కలకత్తాలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్ అవుతూ ఉంటారు. అనుమానితుల ఫోటోలను ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన పోలీసులు... వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వమని చెబుతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో కొంత మంది అమ్మాయిలను పోలీసులు రక్షిస్తారు. విమెన్ ట్రాఫికింగ్ (మహిళల అక్రమ రవాణా) చేసే అలెక్స్ (తరుణ్ అరోరా) మనుషులకు శంకర్ సమాచారం ఇచ్చాడని తెలుస్తుంది. దాంతో శంకర్, మహాలక్ష్మిని టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? హైదరాబాద్ సిటీలో భోళా భాయ్ అని అందరూ పిలిచే వ్యక్తి, ఓ రౌడీ కలకత్తాలో శంకర్ అవతారం ఎందుకు ఎత్తారు? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ (Bhola Shankar Review) : రీమేక్ అంటే ఓ గోడకు ఉన్న మేకు తీసి మరో గోడకు కొట్టడం కాదు. ఓ భాషలో విజయవంతమైన సినిమాను మరో భాషలో రీమేక్ చేసేటప్పుడు... ఆ సినిమా విజయం సాధించడానికి కారణాలు ఏమిటి? మన దగ్గర విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలు లెక్కలు వేసుకోవాలి. ఆ లెక్క వేసుకోవడంలో 'భోళా శంకర్' బృందం తప్పటడుగు వేసింది.
తమిళంలో 'వేదాళం' విజయం సాధించడానికి కారణాలు (అనిరుధ్ పాటలు, అజిత్ నటన & వగైరా వగైరా) ఏమైనా కావచ్చు. ఆ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తదా? కదా? అని చూస్తే... కొత్తది ఏమీ కాదు. తెలుగులో ఈ తరహా కథలు వచ్చాయి. 'వాల్తేరు వీరయ్య'లో కూడా 'వేదాళం' ఛాయలు చాలా కనపడతాయి. అక్కడ తమ్ముడి కోసం అయితే... ఇక్కడ చెల్లెలి కోసం! మెయిన్ ట్విస్ట్ ఒకటి ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'లో పాయింట్ గుర్తు చేస్తుంది. కథ కొత్తది కాదు. పోనీ, కొత్తగా తీశారా? అంటే అదీ లేదు.
సినిమాపై అంచనాలు పెట్టుకున్న అభిమానులను, ప్రేక్షకులను మెహర్ రమేష్ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేశారు. సినిమా ప్రారంభమైన కాసేపటికి కామెడీ సీన్లు తీయడంలో దర్శకుడికి పట్టు లేదని తెలుస్తూ ఉంటుంది. చిరంజీవిని 'వెన్నెల' కిశోర్ తమ్ముడు అని పిలవడం... అతడిని మెగాస్టార్ అన్నయ్య అనడం... ఆ ట్రాక్ ఏదీ నవ్వించలేదు. కోర్టులో చిరంజీవి, తమన్నా సీన్లు కూడా వర్కవుట్ కాలేదు. తెరపై ఓ సన్నివేశం తర్వాత మరో సన్నివేశం వచ్చి వెళుతూ ఉంటుంది. ఏదీ ఓ ఫీల్ ఇవ్వదు. మధ్యలో యాక్షన్ సీన్లు కాస్త బెటర్. 'లక్ష్మీ' సినిమాలో వేణుమాధవ్, 'తెలంగాణ' శకుంతల మధ్య కామెడీ సీన్ రిపీట్ చేశారంటే ఏమనుకోవాలి? అంత కంటే మంచి కామెడీ సీన్లు రాసే రచయితలు కరువయ్యారా?
ఫస్టాఫ్ చూసిన తర్వాత ప్రేక్షకులకు నీరసం వస్తుంది. దాంతో పోలిస్తే సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది. 'బిల్లా' గురించి ఇప్పటికీ మాట్లాడటానికి కారణం... స్టైలిష్‌గా మెహర్ రమేష్ యాక్షన్ సీన్లు తీయడం! ఈ సినిమాలోనూ ఆయన యాక్షన్ సీన్లు ఉన్నంతలో చక్కగా తీశారు. ఇంటర్వెల్ తర్వాత సీన్లలో ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. ముగింపుకు వచ్చే కొలదీ ప్రేక్షకుడు కొంచెం కొంచెం సినిమాలో లీనం అవుతూ ఉంటాడు. అంతలో క్లైమాక్స్ వస్తుంది. పాటలు కథకు అడ్డు తగిలాయి. చిరంజీవి స్థాయికి తగ్గ పాటలు కాదు. నేపథ్య సంగీతం యాక్షన్ సీన్లలో మాత్రమే బావుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాతలు ఖర్చుకు రాజీ పడలేదని తెరపై భారీ తారాగణాన్ని చూస్తే అర్థం అవుతుంది.
నటీనటులు ఎలా చేశారు : కామెడీ, డ్యాన్స్, యాక్షన్, రొమాన్స్, యాక్టింగ్... చిరు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుంది. అటువంటి యాక్టర్ కూడా మెహర్ రమేష్ & కో రాసిన సీన్స్ ముందు తెలియపోయారంటే... 'భోళా శంకర్'లో సీన్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తరహాలో చిరు చేసిన ఇమిటేషన్ అభిమానులను మెప్పించవచ్చు. 'ఖుషి' సాంగ్, సీన్ స్పూఫ్ వచ్చినప్పుడు థియేటర్లలో అరుపులు వినిపిస్తాయి.
దర్శకుడిగా మెహర్ రమేష్ మెప్పించిన విషయం, అభిమానులు మెచ్చే అంశం ఏదైనా 'భోళా శంకర్'లో ఉందంటే... యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవిని చూపించిన తీరు! రొటీన్ యాక్షన్ సీన్లు అయినా సరే...హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో చిరంజీవి మరోసారి అనుభవం చూపించారు. కీర్తీ సురేష్ సైతం తన పాత్రకు న్యాయం చేశారు.
'భోళా శంకర్'లో కమర్షియల్ కథానాయికగా మాత్రమే తమన్నా మిగిలారు. పాటల్లో అందంగా కనిపించారు. చిరంజీవి సినిమాలో మరోసారి విలన్ రోల్ తరుణ్ అరోరా (హీరోయిన్ అంజలా ఝవేరి) భర్తకు లభించింది. ఎప్పటిలా రొటీన్ యాక్టింగ్ చేశారాయన. మురళీ శర్మ, రఘుబాబు, బ్రహ్మాజీ... చెబుతూ వెళితే ఆర్టిస్టుల లిస్ట్ పెద్దగా ఉంటుంది. అందరివీ రొటీన్ రోల్స్. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు.
'వెన్నెల' కిశోర్, 'హైపర్' ఆది, 'గెటప్' శ్రీను, 'స్వామి రారా' సత్య, 'తాగుబోతు' రమేష్... తెరపై కమెడియన్లు చాలా మంది కనిపించారు. ఒక్కరికీ నవ్వించే అవకాశం లభించలేదు. 'ఖుషి' నడుము సీన్, చిరుతో చేసిన సీన్స్ వల్ల శ్రీముఖి రిజిస్టర్ అవుతారు. రష్మీ గౌతమ్ ఓ పాట, సన్నివేశంలో తళుక్కున మెరిశారు.
Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
చివరగా చెప్పేది ఏంటంటే : 'వేదాళం' రీమేక్ చేయాల్సిన కథ కాదు. చిరంజీవి చేయాల్సిన కథ అంత కంటే కాదు. కాలం చెల్లిన కథతో తెరకెక్కించిన రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్'. భోళా భాయ్ డిజప్పాయింట్ చేశాడు. మంచి పాటలు, కామెడీ ఉంటే... చిరంజీవి సినిమాలను అభిమానులు చూస్తారు. అటువంటివి ఈ సినిమాలో చాలా తక్కువ.
Also Read : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial