Science fiction thriller Aarambham movie 2024 Review in Telugu: ఇలాగే సినిమా తీయాలని రూల్ ఏదీ లేదు. సినిమాకు ఓ ఫార్ములా అంటూ ఏమీ లేదు. కమర్షియల్ సినిమా లెక్కలను చెరిపిస్తూ కొత్త కథలను తెలుగు నెలకు తెస్తూ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ వైవిధ్యమైన సినిమాలను తీస్తున్నారు. ఆ కోవలోకి వచ్చే సినిమా 'ఆరంభం'. ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇందులో 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ మోహన్ భగత్ హీరో. సుప్రిత సత్యనారాయణ్ హీరోయిన్. భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, మీసాల లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషించారు.


కథ (Aarambham 2024 Telugu Movie): మర్డర్ కేసులో జైలుకు వచ్చిన ఖైదీ మిగేల్ (మోహన్ భగత్). ఉరి శిక్షకు ముందు రోజు రాత్రి జైలు నుంచి మాయం అవుతాడు. గోడలు బద్దలుకొట్టలేదు, తాళం తీయలేదు, ఎవరూ తప్పించలేదు. మిగేల్ ఏమయ్యాడో, ఎలా మాయం అయ్యాడో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ప్రయివేట్ డిటెక్టివ్ చేతన్ (రవీంద్ర విజయ్) వస్తాడు. అతడికి మిగేల్ డైరీ దొరుకుతుంది. అందులో సమాచారాన్ని బట్టి జైల్లో మరో ఖైదీ గణేష్ (మీసాల లక్ష్మణ్)ను విచారణ చేయడం మొదలు పెడతారు. 


మిగేల్ డైరీలో ఏముంది? ఫిజిక్స్ ప్రొఫెసర్ సుబ్రమణ్య రావు (భూషణ్ కళ్యాణ్) సైన్స్ ప్రయోగం వల్ల మిగేల్ జీవితంలో ఏం జరిగింది? ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ప్రయోగం ఏమిటి? దాని వల్ల రావు ఏం కోల్పోయాడు? మిగేల్ జీవితంలో తల్లి లీలమ్మ (సురభి ప్రభావతి), శారద (సుప్రిత సత్యనారాయణ్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Aarambam Telugu Movie Review): ఆరంభం... తెలుగు వరకు ఓ కొత్త ప్రయోగం. టైమ్ లూప్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ. వాటిలో మెజారిటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవీ తక్కువే. అందరికీ అర్థం అయ్యేలా సైన్స్ ఫిక్షన్ కథల్ని చెప్పడంలో కొందరు దర్శక నిర్మాతలు ఫెయిల్ అయ్యారు. అయితే... 'ఆరంభం' దర్శకుడు అజయ్ నాగ్ ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు.


ఓ మనిషి కాలంలో వెనక్కి లేదా ముందుకు వెళ్లగలితే... టైమ్ ట్రావెల్! ఓ మనిషి కాలంలో వెనక్కి వెళ్లి... ఎక్కడి నుంచి అయితే వెళ్లాడో అక్కడికి చేరుకొని మళ్లీ వెనక్కి వెళ్లి వస్తే... డెజా వు! ఈ టైమ్ లూప్ కాన్సెప్టును ఫిజిక్స్ సూత్రాలు, లాజిక్స్ వంటి విషయాలతో కన్ఫ్యూజ్ చేయకుండా... ఎటువంటి చిక్కులు లేకుండా సింపుల్‌గా చెప్పారు అజయ్ నాగ్. సైన్స్ గురించి డీప్ & డెప్త్ డిస్కషన్ పెట్టలేదు.


'డెజా వు'ను అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే కాదు... టైమ్ లూప్ నేపథ్యంలో అనంత్ నాగ్ హ్యూమన్ ఎమోషన్స్ చూపించిన తీరుకు క్లాప్స్ కొట్టాలి. హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు 'ఇన్సెప్షన్' గుర్తుకు వస్తుంది. తెలుగు కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు కాన్సెప్ట్ అర్థం కాకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం... దర్శకుడు అజయ్ నాగ్ (Ajay Nag Director)లో విషయం ఉంది.


సైన్స్ ఫిక్షన్ అంశాల కంటే 'ఆరంభం'లో ఎమోషనల్ జర్నీ ఎక్కువ. రేడియోకి యాంటీనా పెడితే టీవీ అవుతుందనుకునే అమాయకపు కుర్రాడిగా హీరో బాల్యాన్ని చూపించారు అజయ్ నాగ్. అందువల్ల, ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా 'డెజా వు'లోకి అతడు వెళుతుంటే మనకు ఎటువంటి సందేహాలు రావు. టైమ్ లూప్ కాన్సెప్టుతో ప్రాబ్లమ్ ఏమిటంటే... రిపీటెడ్ సీన్స్ ఉంటాయి. అందువల్ల, చూసిన సన్నివేశం మళ్లీ తెరపైకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ హోల్డ్ చెయ్యడం కాస్త కష్టం. సైన్స్, లాజిక్స్ వంటివి ఉన్నప్పుడు థ్రిల్ ఉంటుంది. 'ఆరంభం'లో హ్యూమన్ ఎమోషన్స్ ఉండటంతో కొంత గ్రిప్ మిస్ అయ్యింది. ఒక్కసారి లూప్ స్టార్ట్ అయ్యాక స్క్రీన్ ప్లే పరుగులు పెడితే బావుండేది. లూప్ నుంచి సినిమా డౌన్ అయ్యింది.


అజయ్ నాగ్ ఊహకు దేవ్ దీప్ గాంధీ సినిమాటోగ్రఫీ రెక్కలు తొడిగింది. సినిమాకు ప్రాణం పోసింది. సినిమా చూస్తున్నంత సేపూ బ్రీజీ, ప్లజెంట్ ఫీల్ తెచ్చింది. ఈ సినిమాకు ఆయన కెమెరా వర్క్ టోన్ సెట్ చేసింది. రెగ్యులర్ సినిమాల మధ్యలో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ తెచ్చింది. రిపీటెడ్ సీన్స్ వచ్చినప్పుడు ఆయన వేరే యాంగిల్ నుంచి క్యాప్చర్ చేసిన విధానం కొత్తదనే భావన తెచ్చింది. సాధారణ సన్నివేశాల్లో దేవ్ దీప్ గాంధీ, అజయ్ నాగ్ మెస్మరైజ్ చేశారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో బడ్జెట్ పరిమితులు కనిపించాయి.


'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' హీరోయిన్ శివానీ నాగారం పాడిన 'అమాయకంగా...' పాట బావుంది. మళ్లీ మళ్లీ వినేలా ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆ పాటను అందంగా పిక్చరైజ్ చేశారు. 'ఆరంభం'తో సంగీత దర్శకుడిగా పరిచయమైన సింజిత్... వినసొంపైన బాణీలు అందించారు. సాహిత్యం వినబడేలా పాటలు కంపోజ్ చేశారు. 'అనగా అనగా...'ను ఎస్పీ చరణ్ పాడిన తీరు ఆయన తండ్రి, దిగ్గజ గాయకుడు ఎస్పీబీని గుర్తు చేసింది. నేపథ్య సంగీతం కూడా బావుంది. మనికా ప్రభు సౌండ్ డిజైన్ కూడా!


Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?



'ఆరంభం'లో నటీనటులు అందరూ సహజంగా చేశారు. ఆరిస్టులు యాక్ట్ చేసినట్టు అనిపించదు. మోహన్ భగత్ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇన్ఫినిటీలోకి వెళ్లినప్పుడు, టైమ్ లూప్ సన్నివేశాల్లో అతడి నటన తెరపై జరుగుతున్నది నమ్మేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది. సురభి ప్రభావతి, భూషణ్ కళ్యాణ్, సుప్రీతా సత్యనారాయణ్ తమ పాత్రలో చక్కగా చేశారు. రవీంద్ర విజయ్, మీసాల లక్ష్మణ్ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. 


'ఆరంభం'... కమర్షియల్ సినిమాల మధ్య కొత్త ప్రయోగం. సైన్స్ ఫిక్షన్ కథల్ని ఇంత సింపుల్‌గా చెప్పవచ్చా? అని ఆశ్చర్యపరిచే చిత్రం. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు కొన్నాళ్లు గుర్తుండే సంగీతం. సహజత్వంతో కూడిన నటన, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే దర్శకుడి తపన... ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమాలో మైనస్ పాయింట్స్ లేవని కాదు. ఉన్నాయి కానీ వాటిని దాటి మంచి అనుభూతి ఇచ్చే చిత్రమిది.


Also Read: ప్రతినిధి 2 రివ్యూ: నారా రోహిత్ పొలిటికల్ కాంట్రవర్సీనా? లేదంటే ఇది థ్రిల్లర్ సినిమానా?