Zombie deer disease: గత మూడు సంవత్సరాలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారి తర్వాత ఇప్పుడు మరో వ్యాధి కలకలం రేపుతోంది. అమెరికాలో వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడి మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులోని జంతువుల్లో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారు. అప్పటి నుంచి వందలాది  జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లో లేళ్లు, జింక, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలుతున్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్దకం, ఉన్నట్టుండి కిందపడిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.


మానవులకూ ప్రమాదమే


ఈ వ్యాధి జంతువులకే సంక్రమించినప్పటికీ.. మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ జోంబీ డీర్ డిసీజ్‌ను వైద్య పరిభాషలో ‘క్రానిక్ వేస్టింగ్ డిసిజ్’ అంటారు. అంటే ప్రొటీన్ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి ఇది. ఇది చాలా నెమ్మదిగా ప్రబలే వ్యాధిగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు మానవులకు సోకిన దాఖాలాలు లేనప్పటికీ భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో 1980, 1990లో సోకిన మ్యాడ్ కౌ వ్యాధిని ఉదాహరణగా చెబుతున్నారు. వందలకొద్ది ఆవులను వధించడం వల్ల వచ్చిన మ్యాడ్ కౌ వ్యాధి ఎలా మానవులకు సంక్రమించిందో ఉదహరిస్తూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ వైరస్ కారణంగా అప్పట్లో 4.4 మిలియన్ల పశువులను వధించారు. 


మనుషులకు ఈ వ్యాధి సోకుతుందా లేదా అని కరెక్టుగా చెప్పలేకపోయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక్కసారి వ్యాప్తి చెందడం మొదలైతే.. పూర్తి స్థాయిలో నిర్మూలించడం సాధ్యం కాదన్నారు. ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి వ్యాప్తి ఉంటుందన్నారు. ఇదొక రకమైన ప్రొటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రొటీన్ల వ్యాధి అని తెలిపారు. దీని కారణంగా 1995 నుంచి 178 మంది మనుషులు చనిపోయారు.


బయోటెక్ కంపెనీ జింగో బయోవర్క్స్ భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల విస్తృత ముప్పు గురించి హెచ్చరించింది. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన కారణంగా పెరుగుతున్న అంటువ్యాధుల వల్ల కలిగే మరణాలు 2020లో కంటే 2050లో 12 రెట్లు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. గత దశాబ్దాలుగా అంటువ్యాధులు పెరుగుతున్నందున, CWD వంటి వ్యాధుల సంభావ్య పరిణామాలను పరిష్కరించేందుకు చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు. సంక్షోభాన్ని నివారించడానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించారు.


Also Read : పనీర్ బేసిన్ దోశ.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.