Alcohol Benefits : మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట ప్రతి చోటా వినేదే. అంతా హానికరం అంటారే గానీ.. దాన్ని మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరూ చెప్పరు. ఒక వేళ చెప్పినా.. మందుబాబులు పట్టించుకోరు. వారి ఆనందాన్ని లాగేసుకుంటున్నట్లు తెగ ఫీలైపోతారు. అలాంటి మందుబాబులు మీ ఇంట్లో కూడా ఉంటే తప్పకుండా ఈ విషయాలు చెప్పండి. ఒక వేళ మీరే మద్యానికి అలవాటు పడినట్లయితే.. ఆల్కహాల్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుని.. 2024 నుంచి మంచి నిర్ణయం తీసుకోండి. 


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సర్వే ప్రకారం.. అమెరికాలో మూడింట రెండు వంతుల మంది గతేడాది మద్యం తీసుకున్నట్లు తేలింది. ఒక నెల పాటు మద్యం తాగడం మానేస్తే గుండె, కాలేయం, శరీరం అన్నీ ఆరోగ్యంగా ఉంటాయని పేర్కొంది. నెల తర్వాత మళ్లీ మద్యం తాగడం మొదలు పెట్టినట్లయితే మళ్లీ అవన్నీ పాడవుతాయని తెలిపింది. అమెరికాలో చలి వల్ల అక్కడి ప్రజలు మద్యం తాగుతుంటారు. అందువల్ల వైద్యులు మందు తాగాలని చెబుతుంటారు. కానీ కొందరు అదే పనిగా తాగేస్తూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారి బారిన పడుతుంటారు. గుండె, కాలేయం, ప్యాంక్రియాస్‌తో ఆరోగ్యం క్షీణిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతోపాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. 


కానీ.. మీరు ఆల్కహాల్ మానేసినప్పుడు మీ శరీరానికి ఏమి జరుగుతుంది? మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? దీనిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆల్కహాల్ మానేస్తే శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. ఆల్కహాల్ మానేసిన వ్యసనపరుల్లో కాలేయ పనితీరు మెరుగుపడటాన్ని గమనించారు. అలాగే, చర్మంలో మెరుపు, మానసిక ఆరోగ్యం, మంచి నిద్ర.. ఇంకా ఎన్నో అంశాలు మెరుగైనట్లు తెలుసుకున్నారు.


1. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:


ఆల్కహాల్ తాగడం మానేస్తే.. రక్తపోటు తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు నుంచి బయటపడతారు. 2016 అధ్యయనం ప్రకారం మద్యపానానికి దూరంగా ఉన్నవారు లేదా మద్యాన్ని తాగడం మానేసినవారిలో గుండె పనితీరు మెరుగ్గా ఉందని తేలింది. ఆల్కహాల్ తీసుకుంటే అధిక రక్తపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఇతర గుండె సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చని డైటిషియన్లు చెబుతున్నారు. మద్యం మితంగా తాగేవారు మాత్రమే కాస్త సేఫ్ అని తెలిపారు.


2. లివర్ కూడా సేఫ్:


మద్యం తాగితే లివర్ పాడవ్వడం గ్యారెంటీ. కానీ మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. అది పాడైనట్లయితే దాదాపు అన్ని అవయవాలు పనిచేయవు. అదే మద్యం తాగడం మానేస్తే లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దానిలో లోపాల్ని అదే సరిచేసుకుంటుంది. శారీరంలో విష వ్యర్థాలను బయటకు పంపుతుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. హార్మోన్లను తగ్గిస్తుంది. ఎలా ఎన్నో మంచి పనులను చేసే లివర్ బాగుండాలంటే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. 


3. బరువు అదుపులో ఉంటుంది:


మద్యం తాగేవారిలో ఎలాంటి కంట్రోల్ ఉండదు. తాగుతూనే ఉంటారు. పైగా మంచింగ్ పేరుతో కొవ్వు ఉండే స్నాక్స్ తింటుంటారు. ఇవన్నీ కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. పొట్ట ఇతరత్రా శరీర భాగాల్లో పేరుకుపోతుంది. దీంతో బరువు పెరుగుతారు. ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే బరువు తగ్గుతారు. 


4. మంచి నిద్ర :


ఆల్కహాల్ మత్తును కలిగిస్తుంది. ఇది మంచి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే మీరు ఆరోగ్యకరమైన నిద్రను పొందవచ్చు. దీంతో ఆరోగ్యం మొత్తం బాగుంటుంది. మెరుగైన నిద్ర వల్ల అభిజ్ఞా పనితీరు, మానసిక స్థితి నియంత్రణ బాగుంటుంది. 


5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:


ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థను పాడు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతో మీరు అనారోగ్యంతోపాటు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగడం మానేస్తే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే రోగనిరోధక శక్తిపై ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాదు న్యుమోనియా, సెప్సిస్, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 


6. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది:


ఆల్కహాల్ కు మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మద్యం తాగడం మానేస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆల్కహాల్ మానేస్తే ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గుతాయి. మానసిక పరిస్ధితి మెరుగుపడుతుంది.


7. శక్తివంతంగా ఉంటారు:


మద్యపానం నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది మరుసటి రోజు మీ మానసిక స్థితి, శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. జర్నల్ స్లీప్ అండ్ విజిలెన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అధిక ఆల్కహాల్ వినియోగం మరుసటి రోజు పగటి నిద్రను గణనీయంగా పెంచుతుంది. 35% మంది ముందు రోజు రాత్రి తాగిన తర్వాత మేల్కొని ఉండడం లేదా మెలకువగా ఉండాలనే ఆసక్తిని కోల్పోయినట్లు నివేదించారు. 5% కంటే తక్కువ మంది సాధారణ రోజుల్లో అదేభావాలను కలిగి ఉన్నారని పేర్కొంది. 


8. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:


భోజనం చేసిన తర్వాత గ్లాసు మద్యం తాగితే పొత్తికడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాన్ని విడుదల చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీర్ణ ఎంజైమ్ ల పనితీరు, ఆహారాన్ని విచ్చిన్నం చేసే సామార్థ్యాన్ని దెబ్బతీస్తుంది. 


Also Read : మీరు ఎంత తిన్నా ఆకలిగానే ఉంటుందా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.