Tasty Dosa Recipe : దేశీ అల్పాహారం అంటే మనకి గుర్తొచ్చేది దోశ. దాదాపు చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పైగా దోశల్లో చాలా రకాలు ఉంటాయి. పైగా చలికాలంలో ఇలాంటి టేస్టీ ఫుడ్ తినాలని మనసు కూడా బాగా కోరుకుంటుంది. ఫుడ్ టేస్టీగానే ఉంటుంది కానీ దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. పిండి ఎప్పుడో నానబెట్టాలి. రుబ్బుకోవాలి. దానికోసం అన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవేమి లేకుండా ఇంట్లోనే.. తక్కువ సమయంలో చేసుకోగలిగే దోశ రెసిపీ ఇక్కడుంది.
మీకు దోశ తినాలనిపించినప్పుడు మీరు పనీర్ బేసిన్ దోశ ట్రై చేయవచ్చు. దీనిని చాలా సింపుల్‌గా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని చేయడం చాలా తేలిక. తక్కువ సమయంలోనే దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? దానిని ఏ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
శనగపిండి - 1 కప్పు
ఉప్పు - తగినంత
ఉల్లిపాయ - 1
పనీర్ - అరకప్పు
టమాట - 1
పచ్చిమిర్చి - 2
వాము - అర టీస్పూన్
కొత్తిమీర - అరకప్పు
నీళ్లు - కప్పు,
తయారీ విధానం
ముందుగా కూరగాయలను బాగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో శనగపిండి, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయాలి. పనీర్‌ను తురుముకుని దానిలో వేయాలి. టొమాటో, కొత్తిమీర, వాము వేసి పిండిని మిక్స్ చేయాలి. దానిలో కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ.. ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని కాస్త జారుగా.. దోశలాంటి తత్వాన్ని తీసుకువచ్చేందుకు మరిన్ని నీరు వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై ఓ పాన్ ఉంచండి. అది వేడి అయ్యాక దానిపై కాస్త నూనె వేయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని.. దీనిపై దోశలుగా వేసుకోవాలి. ఒకవైపు గోధుమ రంగులో వచ్చిన తర్వాత మరోవైపు తిప్పాలి. దానిపై తురిమిన పనీర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మడవాలి. దీనిని వేడి వేడిగా తింటే చట్నీ కూడా అవసరం లేదు. లేదంటే మీరు రెడ్ చిల్లీ చట్నీతో దీనిని తినొచ్చు.
పనీర్ బేసిన్ దోశ ప్రోటీన్ ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పవచ్చు. ఇది మీకు టేస్ట్‌ని ఇవ్వడంతో పాటు.. మీ ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. మీకు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయంలేనప్పుడు ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు ఇంట్లోనే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. దీనిని కేవలం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు.. సాయంత్ర స్నాక్‌గా కూడా కలిపి తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దానిని ట్రై చేయండి.
Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.