విటమిన్ ది శరీరానికి చాలా ముఖ్యం. సూర్యరశ్మి ద్వారా తగినంత విటమిన్ ది పొందవచ్చు. ఎండ వేడి శరీరానికి తగిలినప్పుడు కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి వస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకమైనది. అందుకే పొద్దున్నే కాసేపు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా ఉండాలని నిపుణులు సూచిస్తారు. లేదంటే విటమిన్ డి లోపం తలెత్తుతుంది. ఇంట్లోనే ఉండే వాళ్ళు, ఊబకాయం, వృద్ధాప్యం ఉన్న వాళ్ళు తగినంత విటమిన్ డి లేకపోవడం వల్ల బలహీనమైన ఎముకలు, కండరాల తిమ్మిరి, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరానికి సరిపడా విటమిన్ డి లేదని చెప్పేందుకు కొన్ని సంకేతాలు చూపిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ కి దారితీస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.


ఈ వ్యాధి చాలా బాధాకరం. నోటిలో మంట, జలదరింపుగా అనిపిస్తుంది. ఇది కొన్ని రోజులు లేదా నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉండే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సాధారణ పోషకాహార లోపాల్లో విటమిన్ డి ఒకటి. దాదాపు 70 శాతం మందికి పైగా భారతీయులు విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మంది ప్రజలు విటమిన్ లోపాల కారణంగా తక్కువ రక్త స్థాయిలను కలిగి ఉన్నారు.


విటమిన్ డి లోపం సంకేతాలు


⦿తరచూ అనారోగ్యం లేదా అంటువ్యాధులు


⦿అలసట


⦿ఎముకలు, వెన్ను నొప్పి


⦿డిప్రెషన్


⦿జుట్టు ఊడటం


⦿కండరాల నొప్పులు


⦿బరువు పెరగడం


⦿ఆందోళన


విటమిన్ డి లోపానికి చికిత్స ఎలా?


⦿విటమిన్ డి లోపం నుంచి బయట పడేందుకు ఓరల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.


⦿కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, పెరుగు వంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా దొరుకుంటుంది.


⦿సూర్యరశ్మి విటమిన్ డి ఇచ్చే సహజ మూలం. అందుకే వైద్యులు పొద్దునే కనీసం ఒక అరగంట పాటు ఆరుబయట నిలబడితే మంచిదని సూచిస్తున్నారు.


విటమిన్ డి లోపిస్తే వచ్చే రోగాలు


⦿రికెట్స్


⦿మధుమేహం


⦿డిప్రెషన్


⦿కీళ్ల వాతం


⦿ప్రొస్టేట్ క్యాన్సర్


విటమిన్ డి శరీరానికి కాల్షియాన్ని గ్రహించి ఎముకలు బలంగా మారేలా దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రోక్, ఊబకాయం నివారిస్తుంది. డాక్టర్ సూచనల మేరకు మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటిని అతిగా వాడితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వైద్యుల సలహా మేరకు వారానికి ఒకటి వేసుకుంటే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: మీ పిల్లలు చాక్లెట్లు, ఇతర తీపి పదార్థాలు అతిగా తింటున్నారా? ఈ ముప్పు తప్పదు!