జేఈఈ మెయిన్‌ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 15తో పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్ష ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఫలితాలు ఏప్రిల్‌ 29న విడుదల కానున్నాయి. జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షల్లో సాధించిన ఉత్తమ స్కోర్‌ను (రెండు సెషన్ పరీక్షలు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ర్యాంకులు ప్రకటించనుంది. 


జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 30న ప్రారంభంకానుంది. 


ప్రతి సంవత్సరం మెయిన్‌ ర్యాంకులు వచ్చిన మరుసటి రోజు నుంచే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఈసారి ఏప్రిల్‌ 29న జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ర్యాంకులు వెల్లడికానున్నాయి. జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా వారిలో 8.24 లక్షల మంది హాజరయ్యారు. చివరి విడతకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్‌-1, 2) వారిలో 9 లక్షల మంది వరకు పరీక్ష రాస్తారని అంచనా.


Also Read:


నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.  ఈ పరీక్షకు గడువు సమీపిస్తున్న వేళ తాజాగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఏప్రిల్‌ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్‌ కార్డులు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్‌ విధానం: యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేంవర్‌ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్‌ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇదే కోవలో తాము నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేంవర్క్‌ను విడుదల చేశామని తెలిపారు. నేషనల్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌, నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌, నేషనల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌లను ఏకీకృతం చేశామని వివరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


సిల్వర్ సెట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..