AP Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎండలు దంచికొడుతుంటే... తెలంగాణలో వాతావరణం కాస్త కూల్ అయింది. హైదరాబాద్ లో సహా పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో మాత్రం వడగాల్పులు కాకరేపుతున్నాయి. శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ అంచనాల ప్రకారం రేపు(శనివారం) 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 115 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి(ఆదివారం) 65 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (12)
- అనకాపల్లి జిల్లా :- కె. కోటపాడు, మాకవరపాలెం,నర్సీపట్న, నాతవరం
- కాకినాడ జిల్లా :- కోటనందూరు
- మన్యం జిల్లా :- గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జీయమ్మవలస,కొమరాడ, కురుపాం, పార్వతీపురం, సీతానగరం
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(115)
- అల్లూరిసీతారామరాజు జిల్లా- 7 మండలాలు
- అనకాపల్లి- 13 మండలాలు
- తూర్పుగోదావరి- 10 మండలాలు
- ఏలూరు - ఒక మండలం
- గుంటూరు - 6 మండలాలు
- కాకినాడ- 16 మండలాలు
- కోనసీమ- 6 మండలాలు
- కృష్ణా - 2 మండలాలు
- ఎన్టీఆర్ జిల్లా - 4 మండలాలు
- పల్నాడు- 3 మండలాలు
- పార్వతీపురం మన్యం - 7 మండలాలు
- శ్రీకాకుళం - 13 మండలాలు
- విశాఖపట్నం - 3 మండలాలు
- విజయనగరం - 24 మండలాలు
ఈ మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శుక్రవారం అనకాపల్లి 10, కాకినాడ 2, ఎన్టీఆర్ 1 మండలంలో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్ర అధికారులు సూచిస్తున్నారు. ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తగినంత స్థాయిలో నీరు తాగాలని సూచించారు. బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా ముఖ్యమైన పనులుంటే సాయంత్రం వేళలు మాత్రమే బయటకు వెళ్లాలని పేర్కొన్నారు.
తెలంగాణలో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే శుక్రవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత కాస్త తగ్గముఖం పట్టింది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగర ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కల్పించింది. నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకు వానలు పడుతాయని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని ప్రకటించింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడకక్కడ కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.