డయాబెటిస్.. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్న వయస్సులోనే దాడి చేస్తోంది. బిజీ లైఫ్, ఆహారపు అలవాట్లలో మార్పు వల్ల డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. డయాబెటిస్ లక్షణాలను ముందుగానే గుర్తుపట్టకపోవడం వల్ల వ్యాధి ముదిరిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి.. శరీరంలో ఏ చిన్న మార్పు కలిగినా తప్పకుండా వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనలతో ఆహార నియమాలు పాటించాలి. ఇప్పటివరకు మనం డయాబెటిస్ అంటే.. అతిగా మూత్రం రావడం, కాళ్లు తిమ్మిరెక్కడం వంటివి మాత్రమే ప్రధాన లక్షణాలని భావిస్తున్నాం. అయితే, కొంతమందిలో ఈ లక్షణాలు కూడా కనిపించవు. డయాబెటిస్ వల్ల చర్మంలో కూడా మార్పులు ఏర్పడతాయి. వాటిని వెంటనే గుర్తించడం ద్వారా డయాబెటిస్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. 


చర్మం మీ దద్దుర్లు, నల్ల మచ్చలు: డయాబెటిస్ వల్ల చర్మం మీద దద్దుర్లు కూడా ఏర్పడతాయి. వాటిని స్కిన్ అలర్జీ అనుకొని నిర్లక్ష్యం చేస్తే.. అవి మరింత ముదురుతాయి. చాలామంది డయాబెటిస్ బాధితుల్లో చర్మం మీద నల్ల మచ్చలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ, చంకల్లో చర్మం నల్లగా మారుతుంది. వాటిని తాకితే మెత్తగా అనిపిస్తుంది. ఇది కూడా డయాబెటిస్ సంకేతమే. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘అకాంతోసిస్ నిగ్రికాన్స్’ అని అంటారు. ఇన్సులిన్ లోపం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. 


ఎరుపు, పసుపు లేదా గోదుమ రంగు మచ్చులు: చర్మం దురద పెట్టడం లేదా మంట పుట్టడం కూడా ప్రి-డయాబెటిక్ లక్షణాల్లో ఒకటి. చాలామందిలో చర్మంపై పసుపు, ఎరుపు, గోదుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘నెక్రోబయోసిస్ లిపోయిడికా’ అని కూడా అని అంటారు. డయాబెటీస్‌కు ముందు ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


గాయాలు త్వరగా మానవు: డయాబెటిస్‌తో బాధపడేవారికి గాయాలైతే అంత త్వరగా మానవు. రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల చర్మంలోని నరాలు దెబ్బతింటాయి. రక్త ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నరాలు దెబ్బతినడం వల్ల గాయాలు త్వరగా మానవు. ఈ పరిస్థితిని డయాబెటిక్ అల్సర్ అని కూడా అంటారు. మీలో ఈ సమస్య కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


ఈ కింది లక్షణాలు కనిపించినా జాగ్రత్తగా ఉండాలి: 
⦿ మధుమేహం బాధితుల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన సమస్య ‘అతి మూత్రం’. 
⦿ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే మూత్ర పిండాలు సక్రమంగా వడపోయలేవు. 
⦿ మూత్ర ద్వారం వద్ద చక్కెర పేరుకుపోవడం వల్ల తరచుగా మూత్రం వస్తుంది. 
⦿ మూత్రంలో నిలువ ఉండే చక్కెర వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా సమస్యలు ఏర్పడవచ్చు. 
⦿ మర్మాంగాల వద్ద దురద లేదా నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. 
⦿ తీవ్రమైన అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. 
⦿ మరికొందరు మాత్రం అధిక బరువుతో మధుమేహానికి గురవ్వుతారు. 
⦿ కంటి చూపు మందగించినా సరే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. 
⦿ గొంతు పొడిగా ఉన్నా, అతిగా దాహం, ఆకలి వేస్తున్నా డయాబెటిస్‌గా అనుమానించాలి. 


డయాబెటీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి: డయాబెటిస్.. ఎందుకు ఏర్పడుతుంది? నివారణ ఎలా?


Also Read: ముంచుకొస్తున్న ‘మార్బర్గ్ వైరస్’.. కరోనా కంటే ప్రాణాంతకం, లక్షణాలివే!


Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!