కరోనా ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి మూడేళ్లు దాటిపోతోంది. ఇప్పటికీ దాని అంతు తేల్చలేకపోయారు శాస్త్రవేత్తలు. ప్రతి దేశంలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పరిస్థితులకు తగ్గట్టు కరోనా కూడా కొత్త వేరియంట్లను సృష్టించుకుని తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటివరకు ఒక మనిషికి కరోనా సోకిందో లేదో తెలుసుకోవడం కోసం ముక్కు లేదా నోటి ద్వారా శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తారు. ఇప్పుడు అది మరింత సులభతరం చేశాడు ఒక భారత శాస్త్రవేత్త. చెమట చుక్క నుంచి కూడా కోవిడ్ ఉందో లేదో గుర్తించే బయో సెన్సార్‌ను అభివృద్ధి చేశాడు.
గ్రేటర్ నోయిడా లోని క్వాంటమ్ క్యాలిక్యులర్స్ సంస్థలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నాడు అమిత్ దుబే. ఇతను అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. తన పరిశోధనల్లో భాగంగా మరింత సులువుగా కరోనాను నిర్ధారించే పరీక్షను కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నాడు. అతని పరిశోధనల ఫలితమే చెమట ద్వారా కరోనా వైరస్‌ను కనిపెట్టే బయోసెన్సార్. చెమట నమూనాల ద్వారా కోవిడ్ 19ను కనిపెట్టే బయో సెన్సార్‌ను సృష్టించేందుకు ఎన్నో నెలలుగా కష్టపడ్డాడు. అది ఇప్పటికీ పూర్తయింది. ప్రపంచంలోనే చెమట ద్వారా కోవిడ్ వైరస్‌ను కనిపెట్టే మొదటి బయోసెన్సింగ్ పరికరం ఇదే అని చెబుతున్నాడు అమిత్.
ముక్కు లేదా గొంతు ద్వారా శాంపిళ్లను సేకరించడం కన్నా, ఈ చెమట ద్వారా పరీక్షించే టెస్టింగ్ కిట్ చాలా చౌకైనదని అంటున్నాడు అమిత్. ఈ బయో సెన్సార్ వివరాలు అమెరికా జర్నల్ లో ప్రచురించారు. రెండు నానో మీటర్ల కన్నా తక్కువ వ్యాసం కలిగిన అల్ట్రా స్మాల్ గోల్డ్ నానో క్లస్టర్ల ద్వారా చెమటలో కోవిడ్ వైరస్ ఉనికిని నిర్ధారించడమే ఈ సెన్సింగ్ టెక్నిక్. ఈ పరిశోధన వల్ల తక్కువ ధర బయోసెన్సర్ల సృష్టికి దారితీస్తుందని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు అమిత్.
భారత్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కేసులు కూడా మూడు బయటపడ్డాయి. ఇప్పుడు చైనాలో పెరుగుతున్న కేసులు ఇవే. మనదేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు గుజారత్, ఒడిషా రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అయితే భయపడినంతగా అవి వ్యాప్తి చెందలేదు. దీంతో ఆరోగ్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని వేరియంట్లో ఒమిక్రాన్ ప్రమాదకరమైనదిగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వేరియంట్‌కు సంబంధించిన ఉపవేరియంట్లే ఇప్పుడు ప్రపంచంలో ఇంకా వ్యాప్తి చెందుతున్నాయి. చైనాలో అలజడికి కారణం కూడా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంటే.
Also read: లైంగిక జీవితంపై ఆసక్తి తగ్గిపోయిందా? అయితే మీ పొట్టలో ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.