రాజధాని మాటెలా ఉన్నా సీఎం క్యాంపు కార్యాలయం వైజాగ్ కు షిఫ్ట్ చేయడం ఖాయం అని తేలిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఇన్వెస్టర్స్ సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేసారు. ఆయనైతే ఏకంగా రాజధాని కూడా వైజాగే అన్న క్లారిటీ ఇచ్చేసారు. దీనిపై విపక్షాలు విమర్శలు మొదలెట్టాయి. రాజధాని కేసుల వ్యవహారం ఇంకా కోర్టుల పరిధిలోనే ఉండగానే ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేయడం సరికాదని వారన్నారు. అయితే వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ నెల నాటికి అన్ని న్యాయపరమైన అడ్డంకులూ దాటుకుని రాజధానిని వైజాగ్ కు మారుస్తామని అన్నారు. దానితో వైజాగ్ నుంచి పాలన మొదలెట్టడానికి సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారన్న క్లారిటీ వచ్చేసినట్లయింది .
వారానికి మూడు రోజులు వైజాగ్ నుంచే పాలన
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం బట్టి సీఎం ముందుగా వారానికి మూడు రోజులు వైజాగ్ నుంచి మిగిలిన రోజులు అమరావతి నుంచి పాలన చేయనున్నట్టు సమాచారం. తరువాత వీలుచూసుకొని నెమ్మదిగా మొత్తం పరిపాలన విశాఖ కేంద్రంగానే జరుపనున్నారు .
సీఎంతోపాటుగా ముందుగా తరలి వెళ్లే కార్యాలయాలు ఇవే
సీఎం జగన్ తో పాటు రానున్న మూడు నెలల్లో సమాచార శాఖ , ఐటీ మినిస్ట్రీ, పరిశ్రమల శాఖ , ఎడ్యుకేషన్ , స్కిల్ డెవలప్‌మెంట్, సీఐడీ, విజిలెన్స్, హెల్త్ మినిస్ట్రీ, టూరిజం శాఖ వంటి శాఖలను విశాఖకు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉంది సీఎంవో అని వార్తలు వినిపిస్తున్నాయి.
వైజాగ్ లో సీఎం నివాసం , క్యాంప్ కార్యాలయం రాబోయేది ఇక్కడే
విశాఖకు సీఎం షిఫ్ట్ అవుతారనే సమాచారం దాదాపు ఏడాది పైగానే అధికారుల వద్ద ఉంది. అలాంటి పరిస్థితి వస్తే సీఎం ఎక్కడి నుంచి పాలన చెయ్యాలనే దానిపై వారు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసారు. దానికి అనుగుణంగా సిటీలో అయితే కలెక్టర్ భవనం , ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలోని బిల్డింగ్స్ పై ఒక కన్నేసి ఉంచారు. ఏయూ గ్రౌండ్స్ లో ఇటీవల ప్రధాని పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన హెలి పాడ్ వంటి సౌకర్యాలను ఇప్పుడు పెర్మనెంట్ ఫెసిలిటీ గా మార్చారు. ఒకవేళ సీఎం రాకపోకలకు ఆ ప్రదేశాలు ట్రాఫిక్ కారణంగా కరెక్ట్ కాదనుకుంటే భీమిలి రోడ్డులోనూ.. మధురవాడ సమీపం లోనూ ఐటీ పరిశ్రమల కోసం నిర్మించిన వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక రిషికొండ పై అనేక వివాదాల నడుమ రెడీ అవుతున్న భవనం ఉండనే ఉంది . ఓవరాల్ గా చెప్పాలంటే రిషికొండ , భీమిలి , ఆనందపురం ఏరియాల్లో సీఎం నివాసం , తాత్కాలిక సెక్రటేరియట్ లాంటివి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి
ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో మాట్లాడుతూ స్వయంగా చెప్పారు. ఇన్వెస్టర్లను ఉద్దేశించి ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. కాబట్టి, పెట్టుబడిదారులు విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు. మార్చి 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ల సదస్సు విశాఖపట్నంలోనే జరగనుందని జగన్ చెప్పారు.
దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం జగన్.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని అన్నారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి.. ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారన్న అంశం ఇప్పుడు కీలకంగా మారిందని, ఆ కాల్ డేటా వివరాలు బయటకు రాకుండా.. ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్.. విశాఖ రాజధాని అంటూ ప్రకటన చేశారని అన్నారు.