వైజాగ్ కు పాలనా రాజధాని మారుతుందా లేదా అనే ఊహాగానాలకు సీఎం జగన్ చెక్ పెట్టేశారు. త్వరలోనే విశాఖ వెళ్ళిపోతున్నానంటూ ఢిల్లీ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. వైజాగ్‌లో మార్చి నెలలో జరిగే ఇన్వెస్టర్స్ మీట్ కు పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్... రాజధాని విశాఖ అని తాను కూడా త్వరలోనే షిఫ్ట్ అవుతున్నానంటూ చేప్పారు. వైజాగ్ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌కు పిలుపిచ్చారు.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా నెంబర్ వన్‌గా ఉందని సీఎం తెలిపారు . 


ఉగాది నుంచి వైజాగ్‌లో సీఎం జగన్  


ప్రస్తుతానికి లీగల్‌గా ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే.  కేంద్రం కూడా అదే విషయాన్నీ తెలిపింది. దానితో ఒకవేళ వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించాలి అంటే అసెంబ్లీలో మళ్ళీ బిల్ పెట్టాలి. దానికి గవర్నర్ ఆమోద ముద్ర పడాలి.  దానికి చాలాసమయం పట్టే అవకాశం ఉండడంతో ముందుగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్‌లో ఏర్పాటు చెయ్యనున్నారు.  ఉగాది నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖ తరలించి వారంలో రెండు లేదా మూడు రోజులు అక్కడి నుండే పాలన సాగించనున్నారు ముఖ్యమంత్రి జగన్. మిగిలిన రోజుల్లో అమరావతి నుంచి పాలన సాగిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం . 


రిషికొండ సహా నగరంలో సిద్దమవుతున్న వివిధ భవనాలు 


సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయన కార్యాలయం ఏర్పాటు కోసం భవనాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. రిషికొండపై రెడీ అవుతున్న భవనం సహా .. ఏయూలోని పలు భవనాలు .. కలెక్టర్ కార్యాలయం.. సర్క్యూట్ హౌస్.. టౌన్ హాల్ ఇలా అనేక భవనాలు రెడీగా ఉన్నాయి. వీటిలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు ఏది అనువుగా ఉంటుందో తేల్చే పనిలో పడ్డారు అఫీషియల్స్. 


ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిలు ?


విశాఖకు రాజధానిని తరలించే ప్రయత్నం వేగవంతం అవుతున్నవేళ రానున్న సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు మరోసారి అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం అంటున్నారు విశ్లేషకులు . తాజాగా సీఎం చేసిన ప్రకటనతో ఆ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఏదేమైనా సీఎం జగన్ తాను అతి త్వరలోనే హలొ వైజాగ్ అనడం ఖాయం అని తేల్చేసారు.