Artificial Pancreas Successfully Treats Type 1 Diabetes : మధుమేహ సమస్యలున్నవారు నిరంతరం వారి గ్లూకోజ్ స్థాయిలను చెక్​ చేసుకుని.. దానికి అనుగుణంగా తినడం, తాగడం, జీవనశైలిలో మార్పులు చేయాల్సి వస్తుంది. కానీ ప్రతిసారి ఈ గ్లూకోజ్ స్థాయిలు చెక్​ చేసుకోవడం కష్టతరం అవుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. 'నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్' ఓ శుభవార్త తీసుకువచ్చింది. టైప్ 1 డయాబెటిస్​తో బాధపడుతున్న వారికి కృత్రిమ సాంకేతికత ద్వారా ప్రయోజనం అందించే పరికరాన్ని రూపొందించింది. 


కేవలం గ్లూకోజ్ స్థాయిలు తెలుపడమే కాదు..


రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించేందుకు హైబ్రిడ్ క్లోజ్డ్ లూప్​ సిస్టమ్​ని తయారు చేసింది. దీనినే  'ఆర్టిఫీషియల్ ప్యాంక్రియాస్' లేదా 'కృత్రిమ ప్యాంక్రియాస్' అంటారు. ఈ అత్యాధునిక పరికరం మధుమేహం సంరక్షణలో నమూనా మార్పును తీసుకువస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా అవసరమైన సమయంలో నేరుగా రక్తప్రవాహంలోకి పంపు ద్వారా ఇన్సులిన్​ను పంపి.. గ్లూకోజ్ స్థాయిలను స్వయంగా సర్దుబాటు చేస్తుంది. 


ఇంజెక్షన్లకు గుడ్ బై..


టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సర్దుబాటు చేసుకోవడానికి మాన్యువల్​గా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్ అందుబాటులో లేకపోయినా.. లేదా ఇంజెక్ట్ చేసుకోవడం కష్టమైన పరిస్థితి విషమిస్తుంది. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్​ను ఉత్పత్తి చేయడంలో విఫలమైతే.. టైప్ 1 డయాబెటిస్ రోగులకు అది సవాలుతో కూడుకున్న విషయం. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడంలో కృత్రిమ ప్యాంక్రియాస్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇంజెక్షన్​కు మంచి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. 


ప్రపంచంలోనే మొదటిసారిగా


నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ఎక్సలెన్స్ (NICE) డిసెంబర్ 2023లో NHS సాంకేతికత రోల్​ అవుట్​ను ఆమోదించింది. దానిని విస్తృతమై అమలుకు కూడా మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2వ తేదీన.. ప్రపంచంలోనే మొదటిసారిగా ఇంగ్లాండ్​లో టైప్​ 1 డయాబెటిస్​తో ఉన్న పెద్దలు, పిల్లలకు కృత్రిమ ప్యాంక్రియాస్​ను అందించారు. ఈ పరికరం మధుమేహ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఇంగ్లాండ్ నివేదించింది. 


ప్రాణాంతక ప్రమాదాలు దూరం


కృత్రిమ ప్యాంక్రియాస్ వల్ల మాన్యువల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరం తగ్గడమే కాకుండా.. ప్రాణాంతకమైన హైపోగ్లైసీమిక్, హైపర్ గ్లైసీమిక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా టైప్ 1 డయాబెటిస్ వ్యక్తులు ఇన్సులిన్​ అందక మూర్ఛపోవడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటి ప్రాణాంతక ప్రమాదాలను కూడా ఇది దూరం చేస్తుంది. దీని ద్వారా రోగుల రక్తం పదే పదే తీసుకోవడం లేదా నిరంతరం గ్లూకోజ్ మానిటర్ ధరించే అవసరం లేకుండా వారి పరిస్థితిని సుగుమం చేస్తుంది. 


ఎలా పని చేస్తుందంటే..


కృత్రిమ ప్యాంక్రియాస్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కొలిచే ఓ సెన్సార్​ను చర్మం కింద అమర్చుతారు. అప్పుడు రీడింగ్​లు, అవసరమైన ఇన్సులిన్ మొత్తాన్ని లెక్కించే పంపునకు వైర్​లెస్​గా సందేశం చేరుతుంది. సందేశాలు అందుకున్నప్పుడు అవసరమైన స్థాయిలో ఇన్సులిన్ పంపిణీ చేస్తుంది. సిస్టమ్ గ్లూకోజ్ మానిటర్, ఇన్సులిన్​ పంప్, స్మార్ట్​ఫోన్​ యాప్​ను అనుసంధానిస్తుంది. సమయానుగుణంగా ఇన్సులిన్ మోతాదుల సర్దుబాటు చేస్తుంది. 


Also Read : మధుమేహమున్నవారు కాస్త బరువు పెరిగితే ఆయుష్షు కూడా పెరుగుతుందట.. కానీ కండీషన్స్ అప్లై..