శరీరం పని చేసే విధానాన్ని నియంత్రించే బాధ్యత ఎక్కువగా థైరాయిడ్ మీదే ఉంటుంది. దిగువ మెడ మధ్య భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈ గ్రంథి ఉంటుంది. ఈ థైరాయిడ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రాణాంతకమైన ప్రమాదకర పరిస్థితి థైరాయిడ్ స్టోర్మ్. హైపర్ థైరాయిడిజం తర్వాత ఇది వస్తుంది. ఈ సమస్య వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత అధిక స్థాయికి చేరుకుంటుంది. అటువంటి సమయంలో వెంటనే గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు. పట్టించుకోకుండా వదిలేస్తే ఇది మానసిక స్థితిలో మార్పులకు కారణమవుతుంది. ఏకాగ్రత లోపించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.


థైరాయిడ్ స్టోర్మ్ కి కారణమేంటి?


శరీరం చాలా హార్మోన్లను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ట్రైఅయోడోథైరోనిన్ లేదా థైరాక్సిన్ నియంత్రణలోకి రాకపోతే అది థైరాయిడ్ స్టోర్మ్ పరిస్థితికి కారణమవుతుంది. ఇది చాలా అరుదైన పరిస్థితి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి అనేక కారణాలు ఉన్నాయి.


⦿ థైరాయిడ్ సమస్యను విస్మరిస్తూ మందులు సరిగ్గా తీసుకోకపోతే ఈ పరిస్థితికి దారి తీస్తుంది.


⦿ పిల్లల్ని కనడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతుంది


⦿ ఏదైనా ప్రమాదం లేదా గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల కూడా హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోతుంది


⦿ గొంతులో కణితి(గాయిటర్) వల్ల శరీరానికి అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు.


⦿ ఏదైనా ఇతర అనారోగ్యానికి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పుడు హార్మోన్ ఉత్పత్తిలో పెరుగుదల కనిపిస్తుంది.


థైరాయిడ్ అడెనోమా లేదా నోడ్యూల్ కణజాలం పెరుగుదల ఉంటే అది క్యాన్సర్ కాకపోవచ్చు. అది థైరాయిడ్ స్టోర్మ్ కి దారి తీస్తుంది. ఈ పరిస్థితి ఉన్న వారిలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం తో బాధపడుతున్న వ్యక్తులు అది ముదిరితే థైరాయిడ్ స్టోర్మ్ కి అభివృద్ధి చేస్తుంది. అందుకు ప్రభావితం చేసే పరిస్థితులు ఇవే.


⦿ గాయాలు


⦿ ఏదైనా శస్త్ర చికిత్స


⦿ తీవ్రమైన మానసిక క్షోభ


⦿ స్ట్రోక్


⦿ మధుమేహం


⦿ గుండె పోటు


థైరాయిడ్ స్టోర్మ్ లక్షణాలు


ఈ వ్యాధి లక్షణాలు హైపర్ థైరాయిడిజంతో సమానంగా ఉన్నప్పటికీ వాటిలో ఎక్కువ భాగం అకస్మాత్తుగా వస్తాయి. మిమ్మల్ని త్వరగా మంచాన పడేలా చేస్తాయి.


⦿ వేగవంతమైన హృదయ స్పందన రేటు


⦿ తీవ్ర జ్వరం


⦿ అధికంగా చెమటలు పట్టడం


⦿ యాంగ్జయిటీ


⦿ దీర్ఘకాలిక అతిసారం


⦿ అపస్మారక స్థితిలోకి వెళ్ళడం


చికిత్స ఎలా?


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వైద్యుల సూచన మేరకు యాంటీ థైరాయిడ్ మందులు, పొటాషియం అయోడైడ్, బీటా బ్లాకర్స్, స్టెరాయిడ్లతో చికిత్స చేస్తారు. దీని లక్ష్యం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి విడుదల తగ్గించడం. సరైన విధంగా చికిత్స తీసుకుంటే 1-3 రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. అది తగ్గిన తర్వాత చికిత్స కొనసాగించాలా వద్దా అనేది వైద్యులు నిర్ధారిస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: జుట్టు రాలే సమస్యకి బై బై చెప్పాలంటే ఈ పవర్ ఫుల్ స్మూతీ తాగేయండి