జుట్టు రాలే సమస్యను ఎదుర్కొనేందుకు ఎన్ని మార్గాలు ఉంటే అన్నింటినీ అమ్మాయిలు ట్రై చేస్తారు. అవి ఒక్కోసారి మంచి చేయవచ్చు లేదంటే హాని చేసి జుట్టుకి నష్టం కలిగిస్తాయి. అటువంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి ట్రెండింగ్ గా ఉంది. అదే జుట్టుకి పోషకాలు అందించే పవర్ స్మూతీ. వివిధ రకాల విత్తనాల మిశ్రమంతో ఈ స్మూతీ తయారు చేస్తారు. చియా విత్తనాలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, తామర గింజలతో పాటు బాదం, ఖర్జూరం వేసి చేస్తారు. జుట్టు ఆరోగ్యానికి ఇవి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని డైటీషియన్స్ చెబుతున్నారు.


స్మూతీకి కావాల్సిన పదార్థాలు


చియా విత్తనాలు- 2 టేబుల్ స్పూన్లు


అవిసె గింజలు- 2 టేబుల్ స్పూన్లు


పొద్దు తిరుగుడు విత్తనాలు- 2 టేబుల్ స్పూన్లు


గుమ్మడికాయ గింజలు- 2 టేబుల్ స్పూన్లు


తామర గింజలు లేదా మఖానా- 2 టేబుల్ స్పూన్లు


ఖర్జూరాలు- 2


నానబెట్టిన బాదం పప్పు- ఒక గుప్పెడు


తయారీ విధానం


స్మూతీ చేయడం కోసం ఈ విత్తనాలన్నీ ఒక పాన్ లో వేసుకుని మంచి సువాసన వచ్చే వరకు తక్కువ మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఫ్రిజ్ లో గాలి చొరబడని కంటైనర్ లో పొడి స్టోర్ చేసుకోవచ్చు. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. బ్లెండర్ లోకి కొద్దిగా నీటిని తీసుకుని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకుం పొడి రెండు స్కూప్స్ వేసుకోవాలి. దానిలో మెత్తగా నలిపిన ఖర్జూరాలు, బాదం పప్పు పేస్ట్ జోడించుకోవాలి. చిక్కగా అనిపిస్తే కొంచెం నీటిని జోడించుకోవచ్చు. క్రీముగా వచ్చేవరకు దీన్ని కలుపుకోవాలి. ఈ హెయిర్ స్మూతీ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే రుచికరమైన పోషకాలు నిండినది.


స్మూతీలో ఉపయోగించిన విత్తనాల ప్రయోజనాలు


చియా విత్తనాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు విరిగిపోవడాన్ని తగ్గిస్తాయి. ఇందులోని జింక్ జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. ఇక అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్స్ ఉంటాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలు ఇవి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ ఫోలికల్స్ ను కాపాడి జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇక గుమ్మడి గింజల్లో జింక్ అధికం. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకి ఇది చాలా అవసరం.


ఫాక్స్ సీడ్స్ లేదా మఖానాలో ప్రోటీన్, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడతాయి. విటమిన్ బి కాంప్లెక్స్ కూడా అందిస్తుంది. జుట్టు, తల, చర్మం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే వీటన్నింటితో చేసుకున్న స్మూతీ జుట్టుకి పోషణ ఇస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పుట్టుమచ్చలే కాదు ఈ లక్షణాలు కూడా చర్మ క్యాన్సర్ సంకేతాలే