తను అందరిలాంటి ఆడపిల్ల కాదు. తన పరిస్థితి చూసి సిగ్గుపడలేదు, నలుగురిలో తిరగడానికి భయపడలేదు. ఎంతో ధైర్యంగా ప్రపంచం ముందుకు వచ్చింది. తనెంతో నిరూపించుకుంటూ తన లాంటి ఎంతో మంది పిల్లలకి ఆదర్శంగా నిలుస్తుంది. తను ఎవరో కాదు నోయెల్లా మెక్ మహెర్. తన వయసు కేవలం 10 సంవత్సరాలు. ఆ పాప ప్రత్యేకత ఏమిటో తెలుసా.. తను ఒక ట్రాన్స్ మోడల్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు ఉన్న ట్రాన్స్ మోడల్ గా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.


పెద్ద వయసు మోడల్స్ తో సమానంగా నోయేలా కూడ ర్యాంప్ వాక్ చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫిబ్రవరి, సెప్టెంబర్ లో జరిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి తనెంటో నిరూపించుకుంటుంది. ట్రాన్స్ క్లాతింగ్ కంపెనీ తరపున నోయేలా ఫిబ్రవరిలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేసింది. సాధారణంగా లింగమార్పిడి చేయించుకున్న వాళ్ళు అంటే సమాజంలో చిన్న చూపు ఉంటుంది. వాళ్ళ పట్ల ఇతరులు ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. లోకం అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని వయస్సులో నోయేలా మాత్రం చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తిస్తుంది. తమ కూతురు పట్ల ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.


నోయేలా తల్లిదండ్రులు డీ, రె మెక్ మెహెర్ మాట్లాడుతూ తమ కూతురు తన కలలని నెరవేర్చుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. ట్రాన్స్ పిల్లలకి ఒక వాలంటీర్ గా ఉండాలని అనుకుంటుంది. అంతే కాదు తన లాంటి ఎంతో మంది పిల్లలకి బాసటగా నిలవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కష్టం అయినప్పటికీ దాన్ని సాధించడమే తన జీవిత లక్ష్యం అని ఆమె తల్లి దండ్రులు చెప్పుకొచ్చారు. సమాజంలో తనకి వ్యతికరేకంగా చాలా విషయాలు ఉన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి నోయేలా సిద్ధంగా ఉందని వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేశారు. తన 2వ ఏట నోయేలాకి తను అబ్బాయి కాదు అమ్మాయి అని అర్థం అయ్యింది. దీంతో లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిపోయింది. ఆమె సరికొత్త ప్రయాణానికి తన తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇచ్చారు.


చాలా అందంగా కనిపించే నోయేలా ఎంతో ఆత్మ విశ్వాసంతో ర్యాంప్ వాక్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పారిస్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చెయ్యడం కోసం ప్రస్తుతం తను సిద్ధమవుతోంది. ఇలాంటి మరెన్నో విజయాలు తను సొంతం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.     


Also Read: డయాబెటిస్ ఉందా? ఈ పండు తింటే మీకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా!


Also Read: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు