పాము అనగానే.. మన మెదడులో ఓ ఆలోచన వస్తుంది. చూడ్డానికి పొడవుగా, లావుగా ఉంటుంది. కోరల్లో విషం నింపుకుని ఉంటుంది. కాటేస్తే అంతే సంగతులు అని బలంగా ఫిక్సై ఉంటాము. కానీ, ప్రపంచంలో ఎన్నో వేల రకాల పాములు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం విషరహితంగానే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి చిన్న పాము గురించి తెలుసుకుందాం. ఈ పాము చూడ్డానికి వానపాము మాదిరిగానే కనిపించినా పట్టుకుంటే ముప్పుతప్పదు.


ప్రపంచంలోనే అతి చిన్న పాము పేరు ‘బార్బడోస్ థ్రెడ్‌ స్నేక్’. ఈ పాము అచ్చం వానపాము మాదిరిగా ఉంటుంది. దీని పొడవు కేవలం 10 సెంటీ మీటర్లు. తొలిసారి ఈ పాములను చూసిన వారిలో నూటికి 99 శాతం మంది వానపాముగానే పొరపాటు పడ్డారు. ఈ జాతిలో ఇప్పటి వరకు కనుగొన్న అతి పెద్ద పాము పొడవు 10.4 సెంటీ మీటర్లు మాత్రమే. దీని బరువు ఒక గ్రాము కంటే తక్కువగానే ఉంటుంది. ఈ పాములు గుడ్డివి. స్పర్శ  ఉంటుంది తప్ప చూపు ఉండదు. వీటిని తొలిసారి అమెరికాలోని బార్బాడియన్ ఫారెస్ట్ లో కనుగొన్నారు. ఎవల్యూషనరీ బయాలజిస్ట్ S. బ్లెయిర్ హెడ్జెస్ 2008లో గుర్తించారు. ఒక రాతి క్రింద ఉన్న దీన్ని ఆయన పట్టుకుని పరిశీలించారు. చివరకు ప్రపంచంలోనే అతి చిన్న పాముగా నిర్ధారించారు. ఈ పాముకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. 


బార్బడోస్ థ్రెడ్‌ స్నేక్ కరేబియన్ ద్వీపానికి చెందిన జీవిగా గుర్తించారు. చార్లెస్ డార్విన్ కాలం నుంచి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిన్న పాము గురించి అధ్యయనం చేయడం కష్టంగా ఉన్నా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ వానపాము మాదిరిగానే ఉండటంతో పాటు, వాటిలాగే రాళ్ళు, మొద్దుల కింద మట్టిలో నివసిస్తుంది. వీటి గురించి జనాలకు సైతం ఎక్కువ విషయాలు తెలియవు. ఈ పాములు ఎక్కువగా చెద పురుగులు, చీమల లార్వాలను  ఆహారం తీసుకుంటాయి. 


పరిశోధకులు ఈ థ్రెడ్‌ స్నేక్స్ కు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ పాములు ఎక్కువగా అడవులపై ఆధారపడటం వలన సమీప భవిష్యత్తులో అంతరించిపోనున్నట్ల తెలిపారు.  బార్బడోస్ అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఈ పాములు ఉన్నట్లు గుర్తించారు. ఈ  జాతి మనుగడ కొనసాగింపు అనేది అనిశ్చితంగా ఉందని వెల్లడించారు. అయితే, ఈ పాముల్లో కొన్ని విషరహితంగా ఉంటాయని, ప్రస్తుతం ఈ పాములు కరవడం వల్ల ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదని నిపుణులు తెలిపారు. చూశారుగా, మీకు ఎప్పుడైనా ఇలాంటి పాములు కనిపిస్తే.. వానపాములని మాత్రం అనుకోవద్దు. సేఫ్‌గా ఉండండి. 






Also Read: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం


Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు