World Hypertension Day: హైబీపీ, దీన్నే అధిక రక్తపోటు అంటారు. హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. దీని బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. దీని వల్ల ఎప్పుడు ఏ ప్రాణాంతక సమస్య వస్తుందో చెప్పడం కష్టం.  ఎందుకంటే ప్రపంచంలోనే అకాల మరణాలకు హైపర్ టెన్షన్ ప్రధాన కారణం. బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండ సమస్యలు వంటివన్నీ హైబీపీ వల్ల వస్తాయి. దీనివల్ల ముందస్తు మరణాలు తప్పవని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అధిక రక్తపోటు వచ్చాక అదుపులో ఉంచుకోవడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే చాలా ఉత్తమం.


అధిక రక్తపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వారసత్వంగా కూడా ఇది వస్తుంది. అలాగే చెడు జీవనశైలి కారణంగా కూడా హైబీపీ వచ్చే అవకాశం ఉంది. వయసు మీరుతున్న కొద్ది కూడా కొందరిలో హై బీపీ వస్తుంది. సరైన ఆహారం తినకుండా తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె కొట్టుకున్నప్పుడు ధమనుల్లోని ఒత్తిడిని సిస్టోలిక్ రక్తపోటు అని అంటారు. గుండె విశ్రాంతిగా ఉన్నప్పుడు ధమనుల్లోని ఒత్తిడిని డయాస్టోలిక్ రక్తపోటు అంటారు. సాధారణ హైబీపీ స్థాయిలు 120/80 mm Hg కంటే తక్కువగా ఉండాలి. సిస్టోలిక్ రక్తపోటు 120 నుంచి 139 మధ్య ఉండి, డియాస్టోలిక్ రక్తపోటు 80 నుంచి 89 మధ్య ఉంటే  ప్రీహైపర్ టెన్షన్ అని పిలుస్తారు.  అంటే అధిక రక్తపోటుకు ముందస్తు దశలో ఉన్నట్టు లెక్క.  ఎవరిలో అయితే సిస్టోలిక్ 140  mm Hg కంటే ఎక్కువ ఉండి, డయాస్టోలిక్ 90 కంటే ఎక్కువ ఉంటుందో వారికి హైబీపీ వచ్చినట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. 


మన దేశంలోనే 220 మిలియన్ల కంటే ఎక్కువ మంది హైబీపీ బారిన పడినట్టు అంచనా. ప్రతి ఏడాది మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే గా నిర్వహిస్తారు. అధిక రక్తపోటు బారిన పడకుండా ఎలా ఉండాలి? అధిక రక్తపోటు వచ్చాక ప్రాణాంతక పరిస్థితులు రాకుండా ఎలా చూసుకోవాలి? అనే అవగాహనను వ్యాప్తి చెందించడం కోసం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అధిక రక్తపోటుపై అవగాహన పెంచడం కోసమే ఈ ప్రచారమంతా. ప్రజలు రక్తపోటు లక్షణాలను తెలుసుకోవడంతో పాటు చికిత్సలపై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తరచూ హెల్త్ చెకప్‌లు తీసుకుంటే రక్తపోటు ముందస్తు దశలోనే గుర్తించవచ్చు. దీనివల్ల మందులు అవసరం లేకుండా ఆహారము, వ్యాయామం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. 


ఇలాంటి పనులు చేస్తే...
హైపర్ టెన్షన్ రావడానికి కొన్ని రకాల పరిస్థితులే కారణం. తీవ్ర ఒత్తిడి గురవడం, విపరీతమైన ధూమపానం చేయడం, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, ఆరోగ్యానికి మేలు చేసే తాజా కూరగాయలు వంటివి తినకపోవడం, ఎక్కువగా స్క్రీన్ టైం పెరిగిపోవడం వంటివన్నీ కూడా అధిక రక్తపోటుకు కారణాలే. సకాలంలో చికిత్స అందించకపోతే గుండెపోటుకు కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికొకసారి రక్తపోటును చెక్ చేసుకోవడం చాలా అవసరం. 





Also read: ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా? ఇది రోజుకు వంద సిగరెట్లు తాగడంతో సమానం


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.