ప్రతి ఇంట్లో ఆహారం మిగిలిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే దాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేశాకే తినాలి. లేకుంటే బ్యాక్టీరియా, వైరస్‌లు వంటివి చేరి ఆరోగ్యానికి ముప్పు తెస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహారాన్ని నిల్వ చేయడంపై కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పోషకాలు నిండిన సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు ఈ సూచనలు చేస్తున్నట్టు వివరించింది. 


ఆహారం ఎంత పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని, వండే విధానంలో కూడా పరిశుభ్రత ఉండాలని వివరిస్తోంది. ఆహారాన్ని తినడానికి లేదా ముట్టుకోవడానికి ముందు ప్రజలు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది. చేతులకు కంటికి కనిపించని సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉందని, అవి ఆహారంపై చేరి ఆహారం ద్వారా పొట్టలోకి వెళితే అనేక సమస్యలు వస్తాయని వివరిస్తుంది.


సముద్రపు ఆహారం, పచ్చి మాంసం వంటివి మిగతా ఆహారాలతో వేరుగా ఉంచాలని హెచ్చరిస్తోంది. ఫ్రిజ్లో రెండింటిని ఒకే చోట ఉంచడం మంచి పద్ధతి కాదని చెబుతోంది. పచ్చి మాంసం, సముద్రపు ఆహారంపై అనేక బ్యాక్టీరియాలు ఉంటాయని అవన్నీ కూడా కూరగాయలపై చేరే అవకాశం ఉందని, అందుకే వాటిని కలిపి  ఉంచకూడదు అని హెచ్చరిస్తోంది. మాంసాహారాన్ని వేరుగా శాఖాహారాన్ని వేరుగా నిలువ చేయాల్సిన అవసరం ఉందని చెబుతోంది.


సముద్రపు ఆహారం, చికెన్, మటన్ వంటివి బ్యాక్టీరియాలతో నిండి ఉంటాయి. అవి పూర్తిగా నాశనం కావాలంటే వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉడికించాలి. అప్పుడే బ్యాక్టీరియా నశించి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. కాబట్టి ఇలాంటి ఆహారాలను బాగా ఉడికించాకే తినాలి, కానీ ఉడికి ఉడకని ఆహారాన్ని తినకూడదని చెబుతోంది. మాంసాహారాన్ని నిల్వచేసుకుని తినడం మానేయాలని, తాజా మాంసాన్నే వండుకొని తినాలని సూచిస్తుంది.


మిగిలిపోయిన ఆహారాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉంచితే త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియా చేరి త్వరగా పాచి వాసన వస్తుంది, కాబట్టి రిఫ్రిజిరేటర్ లో పెట్టి ఉంచడం వల్ల అది సురక్షితంగా ఉంటుంది. బ్యాక్టీరియా త్వరగా చేరదు. ఆహారం త్వరగా పాడవదు.


వంటకు, తాగడానికి కేవలం స్వచ్ఛమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీటిలో ఎన్నో సూక్ష్మజీవులు నివసించే అవకాశం ఉంది. కాబట్టి వీలైతే నీటిని అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించి, చల్లార్చక తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లను పావుగంటసేపు నీళ్లల్లో నానబెట్టి ఆ తర్వాతే తినడం లేదా వండడం చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచనలన్నీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇస్తుంది. కాబట్టి వీటిని పాటించి ఆరోగ్యంగా జీవించండి. 



Also read: ఈ పండు తింటే బ్రెడ్ తిన్నట్టే ఉంటుంది, ఇది ఒక వెరైటీ పండు


Also read: ఉదయం టీతో పాటు రస్కులు కూడా తింటున్నారా? అదెంత అనారోగ్యకరమో తెలుసా



























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.