World Food Day Theme : ఆకలి, పోషకాహారలోపం లేని ప్రపంచాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంక్షోభ సమయంలో ఎలా ఉండాలి.. హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి.. ఆహారాన్ని వ్యర్థం చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆహార సంస్థలతో జీవనోపాధికి ఎలా కల్పించవచ్చు.. వంటి అంశాలను చర్చకు తీసుకువస్తారు. 


1945లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపన జ్ఞాపకార్థం ఏటా అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని(World Food Day 2024) జరుపుతున్నారు. దీనిని 150కి పైగా దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రత గురించిన అవగాహనను ప్రపంచవ్యాప్తంగా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా దీనిని చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చూసుకోవడం.. ఆహారం అందేలా చేయడమే లక్ష్యంగా దీనిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 


ఈ ఏడాది థీమ్ (World Food Day 2024 Theme)


ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్​తో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మంచి జీవితం, మంచి భవిష్యత్తు కోసం.. ఆహారం అందించడమనే లక్ష్యంగా ఈ ఏడాది థీమ్ తీసుకువచ్చారు. గాలి, నీరు తర్వాత ప్రాథమిక అవసరమైనది ఆహారం. ఇది ప్రతి ఒక్కరికి దక్కి తీరాలి. ఆహారం అంటే వైవిధ్యం, పోషణ, స్థోమత, అందుబాటులో ఉండడం, భద్రత ప్రధానంగా ఉంటుంది. పోషక విలువలున్న ఫుడ్స్​ని వైవిధ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడమే దీని లక్ష్యం. 


లక్ష్యాలివే..


ఆకలి, పోషకాహారం లోపం, ఆహార భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ డేని నిర్వహిస్తున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు, చిన్న తరహా రైతులు, గ్రామీణ సంఘాలకు మద్ధతు, హెల్తీ ఫుడ్, పోషకాహార వ్యవస్థలను ప్రోత్సాహించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. 


అవగాహన కూడా ఉండట్లేదట


దాదాపు 2.8 బిలియన్లకు పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని ఓ సర్వే తెలిపింది. అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. పోషకాహార లోపం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా పలు దేశాల్లో ఈ అంశాలు సామాజిక, ఆర్థిక పరిస్థితులపై.. పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికీ చాలామంది ఆకలితో బాధపడుతున్నారు. హెల్తీ ఫుడ్​ని కొనుక్కోలేకపోతున్నారు. మరికొందరికి ఏది ఆరోగ్యకరమైన ఆహారమో కూడా తెలుసుకోలేని స్థితిలో.. దొరికింది తినేస్తూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని తెలిపింది. 



ప్రభావితం చేస్తోన్న అంశాలు


రైతులు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తోన్నా.. ఈ కొరత మాత్రం అలాగే కొనసాగుతోంది. చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. వాతావరణాల్లో మార్పులు, ఆర్థికమాంద్యం, కొవిడ్ వంటి మహమ్మారుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆకలి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇవి పేదలు, బలహీన వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 


దీర్ఘకాలిక సంక్షోభాల వల్ల ఆకలి, పోషకాహార లోపం ఎక్కు అవుతుంది. ప్రకృతి విపత్తులు, సంక్షోభాలు వాతావరణంలో మార్పులు కూడా అగ్రికల్చర్​పై ప్రభావం చూపిస్తున్నాయి. ఇవే కాకుండా పెరుగుతున్న కాలుష్యం.. గాలి, నేల, నీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆహార దినోత్సవం రోజు.. మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆకలిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. 


Also Read : గ్లోయింగ్ స్కిన్​ కోసం ఈ ఫేస్​ ప్యాక్​లు ట్రై చేయవచ్చు.. మొటిమలు ఉంటే మాత్రం వాటిని వేసుకోండి