ప్రపంచంలోని ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని రకాల క్యాన్సర్లు చాలా దూకుడుగా శరీరం అంతా వ్యాపిస్తాయి. ప్రాణాన్ని హరించేలా చేస్తాయి. శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను చంపేసి క్యాన్సర్ కణాలుగా మారుస్తాయి.  అయితే క్యాన్సర్ కణాల పెరుగుదలలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తే, కొన్ని రకాల ఆహారాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. అలాంటి ఆహారాలను దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ది లాన్సెట్ పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం చీజ్, సాల్ట్ వేసిన వేరుశెనగలు, పాస్తా సాస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో చాలా కృత్రిమ రంగులు, రుచులు, స్వీటెనర్లు, ప్రిరెజర్వేటివ్‌లు ఉంటాయి.  వినియోగదారుల కంటికి, నాలుకకు వచ్చే విధంగా చేయడం కోసం ...అనేక ప్రాసెసింగ్ పద్ధతులను వీటి తయారీలో ఉపయోగిస్తారు. అందుకే వీటిని తీసుకోవడం వల్ల అండాశయం, మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. 


జన్యుపరంగా అంటే వారసత్వంగా వచ్చే క్యాన్సర్లను నివారించడం కష్టమే, కానీ జీవనశైలి ఆహారం వంటి బాహ్య కారకాల వల్ల వచ్చే క్యాన్సర్లను అడ్డుకోవచ్చు. అన్ని రకాల క్యాన్సర్లకు కారణమయ్యే మూడు రకాల ఆహారాలు ఇదిగో...


శీతల పానీయాలు 
యువత అధికంగా ఇష్టపడే పానీయాలు కూల్ డ్రింకులు. ఇవి చక్కెరతో లోడ్ చేసి ఉంటాయి. ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులు అధికంగా తాగే వారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ డ్రింకులు నేరుగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవు, కానీ అధిక బరువు పెరగడానికి, ఊబకాయం బారిన పడడానికి దోహదం చేస్తాయి. దీనివల్ల పేగు, రొమ్ము,ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. అలాగే శీతల పానీయాలలో రసాయనాలు ఉంటాయి. అవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఆ పానీయాలలో బెంజిన్, 4 మిథైలిమిడాజల్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెబుతారు వైద్యులు. 


జంక్ ఫుడ్ 
ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ అనగానే నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవే అనుకుంటారు, కానీ వేయించిన చికెన్ వంటకాలు పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తాయి. వీటిలో కూడా ప్రాసెసింగ్ అధికంగానే ఉంటుంది. ఈ ఆహారాల్లో కొవ్వు చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి అనారోగ్యకరంగా బరువులు పెంచుతాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే వ్యక్తులు కొలొరెక్టాల్, పొట్ట క్యాన్సర్, పెదవులు, నోరు, నాలుక, ముక్కు, గొంతు, అన్నవాహిక, శ్వాసనాళం వంటి చోట్ల  క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.  పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని అధికంగా పెంచుతుంది. అలాగే స్త్రీలలో కాలేయం, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు తినేందుకే ప్రయత్నించాలి. 


మద్యం
ఆల్కహాల్ తాగడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందులో క్యాన్సర్ ఒకటి. ఆల్కహాల్ అధికంగా తీసుకునే వారిలో పొట్ట, రొమ్ము, కాలేయం, నోరు, గొంతు వంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.  వైద్యులు చెబుతున్న ప్రకారం ఆల్కహాల్ తాగినప్పుడు అది శరీరంలో చేరి కాలేయంలో ఎసిటాల్డి‌హైడ్ అనే రసాయంగా విచ్ఛిన్నం అవుతుంది. ఇది శరీరంలోని DNAను దెబ్బతీస్తుంది. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. 


Also read: డయాబెటిస్ రోగులు ఈ టీని రోజూ తాగితే మందుల అవసరం ఉండదు


















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.