మధుమేహం బారిన పడిన వారు కచ్చితంగా గ్లూకోజ్ లెవెల్స్ అంటే చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవలసిన అవసరం చాలా ఉంది. వారు తినే ఆహారాల్లో చక్కెర లేని పదార్థాలనే ఎంచుకోవాలి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే ఆహారాలను కూడా ప్రత్యేకంగా తినాలి. మధుమేహలకు బ్లూ టీ అనేది ఒక వరం అని చెప్పొచ్చు. రోజూ రెండుసార్లు బ్లూ టీ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ బ్లూ టీ చేయడం కూడా చాలా సులువు. ఇంట్లో శంఖ పూల మొక్కను పెంచుకుంటే చాలు. ఆ పువ్వులతోనే టీ చేసుకోవచ్చు. వీటిని ‘అపరాజిత పువ్వులు’ అని కూడా పిలుస్తారు. ఖర్చు కూడా తక్కువే. ఆ మొక్కను ఇంట్లో పెంచుకొని, వాటిని ఎండబెట్టుకొని, పొడి చేసుకుని ఇంట్లో దాచుకోవచ్చు. లేదా తాజా పువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి వియత్నాం, మలేషియా వంటి దేశాల్లో ఈ మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఆహారంలో  వీటిని అధికంగా వాడుతారు. బ్లూ టీ తాగే వాళ్ళు ఆయా దేశాల్లో అధికంగా ఉన్నారు. మనదేశంలో ఈ పూలతో టీ చేసుకుని తాగే వారి సంఖ్య చాలా తక్కువ నే చెప్పాలి. కానీ రోజుకి ఒకసారి లేదా రెండుసార్లు ఈ టీ ని తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి.


ఈ బ్లూ టీని క్రమం తప్పకుండా రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు  ఉంటాయి. అధ్యయనం ప్రకారం శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే శక్తి కూడా ఈ పూలలోని పోషకాలకు ఉంది. 


1. జ్ఞాపక శక్తిని పెంచడంలో ముందుండేది బాదంపప్పు. అదొక్కటే జ్ఞాపకశక్తిని పెంచుతుంది అనుకుంటాం కానీ, ఈ శంకం పూలతో చేసిన బ్లూ టీ కూడా మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.  అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. మతిమరుపు వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది. రోజు తాగే వాళ్ళు చాలా రిలాక్స్‌గా ఉంటారు. అతిగా ఆవేశపడరు. ప్రశాంతంగా జీవించగలుగుతారు. 


2. ముందుగా చెప్పుకున్నట్టు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ బ్లూ టీ చాలా మేలు చేస్తుంది. మధుమేహం రాని వాళ్ళు ఈ టీ ని రోజూ తాగడం వల్ల ఆ రోగం వచ్చే అవకాశం తగ్గిపోతుంది. డయాబెటిస్ బారిన పడిన వాళ్ళు ఈ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


3. ఈ బ్లూ టీ ఎంతో మేలు చేస్తుంది. కంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. కళ్ళు మసకబారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.


4. ఇది తయారు చేయడం చాలా సులువు. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే నాలుగు పువ్వులు కోసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ మీద టీ కాచే గిన్నెను పెట్టి ఒక కప్పు నీరు వేయాలి. ఆ నీరు వేడెక్కాక ఈ శంఖు పుష్పాలు వేసి మరిగించాలి. ఆ శంఖు పుష్పాల్లోని రంగువల్ల టీ నీలం రంగులోకి మారుతుంది. తర్వాత వడకట్టుకొని ఆ టీని తాగేయాలి. అవసరమైతే చెంచా తేనె వేసి తాగొచ్చు. వేడివేడిగా కన్నా గోరువెచ్చగా ఒక చెంచా తేనె వేసి తాగితే ఇది టేస్టీగా ఉంటుంది. 


Also read: ఏడు కిలోలకు పైగా బరువుతో పుట్టిన బిడ్డ - ఇలా భారీ బిడ్డలు పుట్టేందుకు కారణాలు ఏమిటి?

















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.