పోలీసు కస్టడీనుంచి దొంగలు తప్పించుకోవడం చాలా అరుదు. అందులోనూ చేతికి సంకెళ్లు వేసి ఉండి, చుట్టూ నలుగురైదుగురు పోలీసులు కాపలా ఉండి, అందులోనూ వారంతా వాహనంలో వెళ్లే సమయంలో తప్పించుకున్నాడంటే ఆ దొంగ మామూలోడు కాదు. అలాంది నక్కజిత్తుల దొంగ నెల్లూరు పోలీసులకు హడలెత్తించాడు. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు ఇప్పుడు హడావిడి పడుతున్నారు. వాడిని ఎలా పట్టుకోవాలా అని టెన్షన్ పడుతున్నారు.


పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ వాగులో దూకి పరారవగా.. 24గంటలు దాటినా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారు. వాగులో గల్లంతయ్యాడా.. లేక పారిపోయాడా తెలియక హైరానా పడుతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగంలో జరిగింది.


ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలోనుంచి బంగారు ఆభరణాలను దోచుకునే గ్యాంగ్ ఒకటి ఇటీవల నెల్లూరులో బరితెగించింది. ఈ కేసు విచారణలో భాగంగా గొలుసు దొంగలిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రూరల్ మండలంలోని ఉప్పుటూరుకు చెందిన ఎ.గిరితోపాటు మరో వ్యక్తిని నెల్లూరు సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వీరిని ఏఎస్‌ పేటకు తీసుకొచ్చారు. అక్కడ వారు చేసిన దొంగతనాలపై ఆరా తీశారు. తిరిగి నెల్లూరు వస్తుండగా నిందితుడు గిరి పారిపోయేందుకు పథకం వేశాడు.


అద్భుతమైన స్కెచ్..


తనతో పాటు దొంగతనాలు చేసే మరో వ్యక్తి సంగంలోని కొండ ప్రాంతంలో దాక్కుని ఉంటాడని, తానిచ్చే సమాచారంతో వాడిని పట్టుకోవచ్చని పోలీసులను నమ్మించాడు గిరి. ఒకరితోపాటు, ఇంకొకరిని కూడా పట్టుకోవచ్చనే ఉద్దేశంతో పోలీసులు వాడి మాట నమ్మారు. వాడు ఎక్కడికి వెళ్లమంటే, అక్కడికి కారుతో సహా బయలుదేరారు.


కారు ఏఎస్ పేట మార్గం నుంచి సంగం కొండవైపు బయలుదేరింది. అయితే ఆ కారు సంగం కొండకు ముందు వరకు రాగానే గిరి తన ప్లాన్ అమలులో పెట్టాడు. బీరాపేరు వాగు పెన్నా నదిలో కలిసే ప్రాంతానికి వెళ్లగానే పోలీసులను మాటల్లో పెట్టి వాహనం నెమ్మదిగా వెళ్లేలా చేశాడు. ఈలోగా తోటి నిందితుడితో తనకు కలిపి వేసిన సంకెళ్లను కూడా చాకచక్యంగా తొలగించుకున్నాడు. కారు నమ్మెదిగా వెళ్లే సమయంలో ఒక్కసారిగా డోర్ తీసుకుని కారు దూకేశాడు. అంతే క్షణంలో మాయమయ్యాడు.


కారు బీరాపేరు వాగు బ్రిడ్జ్ పైకి రాగానే గిరి తెలివిగా కారు దూకేశాడు. అంతే, అక్కడినుంచి ఒక్క ఉదుటున బీరాపేరు వాగులో దూకేశాడు. ఆ వాగు ప్రవాహంతో కలసి మాయమయ్యాడు. గతేడాది ఇదే బీరాపేరు వాగులో ఓ ఆటో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ వాగు ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. అది నేరుగా వెళ్లి పెన్నాలో కలుస్తుంది. దొంగ గిరి కూడా ఆ ప్రవాహంతో కొట్టుకుపోయి పెన్నా నుంచి తప్పించుకున్నాడా, లేక ప్రవాహానికి బలైపోయాడా అనేది తేలడంలేదు. పోలీసులు వెంటపడే సరికి వాగులో లోతుకు వెళ్లి కనిపించలేదు. స్థానికుల సాయంతో గాలించినా జాడ దొరకలేదు. గజ ఈతగాళ్లతోనూ పోలీసులు వెదికించారు, ఫలితం లేదు. పరారయ్యాడా లేక నదిలో గల్లంతయ్యాడా అనేది పోలీసులకు అంతుపట్టడం లేదు.