మగవారితో పోలిస్తే ఆడవాళ్లే మల్టీటాస్కింగ్ పనులు చేస్తారు. ఉద్యోగం చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ, పిల్లల్ని చూస్తూ వారు చేసే పనులు ఇన్నీ అన్నీ కావు. కానీ వారు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం ఎక్కువ సమయం మిగలదు. ఒక స్త్రీ మెదడు రోజువారీ కార్యకలాపాల అలసట నుంచి తేరుకోవడానికి ఎక్కువ సమయం నిద్రపోవడం అవసరమని చెబుతోంది ఒక అధ్యయనం. స్త్రీలు నిద్రలేమికి గురైనప్పుడు వారిలో మానసిక బాధలు ఎక్కువైపోతాయి. అధికంగా కోపానికి కూడా గురవుతారు. అందుకే వారు తమ పనులకు తగ్గట్టే అధిక సమయం నిద్రపోవాలి.  వారికి ఎందుకు నిద్ర అధికంగా అవసరమో తెలిపే కారణాలు ఇవిగో...


వారు భిన్నం..
పురుషులతో పోల్చినప్పుడు మహిళలు కాస్త భిన్నం. వారి ఆలోచనలు విశ్లేషణాత్మకంగా, చురుగ్గా ఉంటాయి. అందుకే మెదడు నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. మల్టీటాస్కింగ్ వల్ల మరింత అలసిపోతుంది. వారు నిద్రపోతేనే మెదడుకు విశ్రాంతి దొరికేది. అందుకే వారు మగవారి కన్నా అధిక సమయం నిద్రపోవాలి. 


బిజీ షెడ్యూల్ వల్ల..
చాలా మంది మహిళలు రోజులో బిజీ షెడ్యూల్ ను కలిగి ఉంటారు. తినడానికి కూడా వారికి ఎక్కువ సమయం మిగలదు. ఉదయం లేచినప్పటి నుంచి పనులు చేస్తూనే ఉంటారు. రాత్రి భోజనం వరకు పనిచేస్తూనే ఉంటారు. అందుకే వారు త్వరగా అలసిపోతారు. అందుకే రాత్రి తొమ్మిది కల్లా నిద్రపోయి ఉదయం ఆరు వరకు లేవకూడదు. అప్పుడే వారి మెదడుకు తగినంత విశ్రాంతి దక్కుతుంది. 


స్థూలకాయం
పురుషులతో పోలిస్తే మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం. ఒక్కసారి పెరిగారా వారి బరువు అలాగే ఉంటుంది. స్త్రీలు నిద్రలేమి వల్ల బరువు పెరిగిపోతారు. ఇలా రోజుల తరబడి కొనసాగితే త్వరగానే ఊబకాయం బారిన పడతారు. నిద్రలేమికి, ఊబకాయానికి మధ్య అనుబంధాన్ని ఇప్పటికే అనేక అధ్యయనాలు తేల్చాయి. నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల కోపం, ఆకలి అధికంగా వేయడం, ఊబకాయం వంటివి కలుగుతాయి. 


హార్మోన్లలో మార్పులు
మహిళల్లో తీవ్రమైన హార్మోన్ల మార్పులు కలుగే అవకాశం ఎక్కువ. ఈ మార్పులు అధికంగా యుక్తవయసుకు రాగానే, గర్భం, రుతుస్రావం సమయంలో ఉంటాయి. ఇవి కాకుండా శారీరక అసౌకర్యం, నొప్పి వంటివి స్త్రీ మెదడును చంచలంగా చేస్తుంది. దాని వల్ల ఎక్కువ నిద్ర అవసరం పడుతుంది. నిద్ర సరిపోకపోతే మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి బారిన త్వరగా పడతారు. 


అధిక రక్తపోటుకు కారణం
మహిళల్లో నిద్రలేమి అధికమైతే అది అధిక రక్తపోటుకు, గుండెజబ్బులకు కారణమవుతుంది. రాత్రిపూట కూడా సరిగా నిద్రపోకుండా మెలకువతో ఉండడం వల్ల సి - రియాక్టివ్ ప్రొటీన్ స్థాయిలను పెంచుతుంది. ఇది అనేక రోగాలకు కారణం అవుతుంది. 


Also read: ఈ ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా పెట్టుకుని మరీ తినేస్తున్నాం



Also read: బొంగులో చికెన్‌లాగే ఇది బొంగులో ఉప్పు, కొనాలంటే ఒక నెల జీతం వదులుకోవాల్సిందే


Also read: మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది, ఇలా చేస్తే ఆ వ్యాధి వ్యాపించదు



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.