ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉంటోంది. ఫ్రిజ్ ఉందంటే చాలు మిగిలిన ఆహారాలన్నీ అందులో పెట్టేస్తారు. అంతేనా కూరగాయలు, పండ్లు లాంటివి కూడా అవసరం లేకపోయినా అన్నీ ఫ్రిజ్ లో పెట్టేస్తారు. ఏవి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలో, ఏవి ఉంచకూడదో కూడా చాలా మందికి అవగాహన లేదు. కొన్ని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల తాజాగా ఉంటాయి, మరికొన్ని పోషకాలను కోల్పోతాయి. అవగాహన లేక మనం ఫ్రిజ్ లో పెడుతున్న కొన్ని పదార్థాలు ఇవిగో...
గుడ్లు
కోడిగుడ్లు ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. గుడ్లును ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పెంకులపై సూక్ష్మ జీవులు అభివృద్ధి చెందుతాయి. ఇవి మెల్లగా గుడ్ల లోపలికి కూడా ప్రవేశిస్తాయి. దీనివల్ల అవి హానికరంగా మారుతాయి. ఆహారనిపుణుల అభిప్రాయం ప్రకారం గుడ్లను గది ఉష్ణోగ్రత్త వద్ద ఉంచడమే ఉత్తమం.
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటివి పుల్లటి పండ్లను ఫ్రిజ్లో ఉంచాల్సిన అవసరం లేదు. బయట ఉంచడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోవు. వీటిని బయట ఉంచితే మాత్రం రెండు మూడు రోజుల్లో తినేయాలి. సగం కోసిన పండ్లను మాత్రం ఫ్రిజ్ లోనే ఉంచాలి.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలు కూడా ఫ్రిజ్ లో పెట్టే వాళ్లు ఉన్నారు. నిజానికి ఉల్లిపాయలు గాలి తగిలే ప్రదేశంలో ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సగం కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్ల్ పెట్టొచ్చు కానీ, కట్ చేయనివి మాత్రం ఫ్రిజ్ లో పెట్టకూడదు.
తేనె
తేనె వేడి ప్రదేశంలో ఉంచకూడదు నిజమే అలా అని ఫ్రిజ్ లో పెట్టమని కాదు. ఇంట్లో చల్లగా ఉండే ప్రదేశంలో తేనెను ఉంచితే చాలు. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల గడ్డ కట్టేస్తుంది. రుచి కూడా మారిపోతుంది.
టమాటోలు
టమాటోలలో విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ వంటి చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వాటిని రోజూ వాడే వారైతే గాలి తగిలే ప్రదేశంలో పెడితే చాలు. ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ కాలం టమాటోలు ఫ్రిజ్ లో ఉంచితే రుచి కూడా మారిపోతుంది.
బంగాళాదుంపలు
బంగాళాదుంపలు గది ఉష్ణోగ్రత వద్ద వారం రోజులైనా తాజాగా ఉంటాయి. వీటిని ఫ్రిజ్ లో నిల్వ చేస్తే బంగాళాదుంపలో ఉండే పిండి పదార్థాలు వేగంగా చక్కెరగా మారిపోతుంది. అంతేకాదు ఫ్రిజ్ లో ఉంచిన బంగాళాదుంపలను వండినా, వేయించినా అందులోని చక్కెరలు క్యాన్సర్ కారక రసాయనంగా మారిపోతుందని అధ్యయనం చెబుతోంది. కాబట్టి వాటిని వేడి తగలని చోట, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే సరిపోతుంది.
అరటిపండ్లు
అరటిపండ్లను కూడా ఫ్రిజ్ లో పెడుతున్నారా? వెంటనే తీసేయండి. వాటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే చాలు. అలాగే అరటిపండ్లను వేరే పండ్లతో కలిపి నిల్వ చేయకూడదు.
Also read: బొంగులో చికెన్‌లాగే ఇది బొంగులో ఉప్పు, కొనాలంటే ఒక నెల జీతం వదులుకోవాల్సిందే
Also read: మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది, ఇలా చేస్తే ఆ వ్యాధి వ్యాపించదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.