Neeraj Chopra Wins Silver Medal: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా. దేశం తనపై పెట్టుకున్న ఆశల్ని సజీవంగా నిలుపుతూ సిల్వర్ మెడల్‌ను అందించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది కేవలం రెండో పతకం మాత్రమే. డిఫెండింగ్ ఛాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మరో ఏడాది స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరం బల్లెం (Javelin) విసరి స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరిన అథ్లెట్, వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు.
నాలుగో ప్రయత్నంలో..
ఇండియన్ స్టార్ నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరి, రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. అయితేనేం విశ్వ వేదికపై సత్తా చాటుతూ రజత పతకం సాధించాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. రెండో ప్రయత్నంలో 82.39 మీటర్లు దూరం బల్లెం విసిరిన నీరజ్ చోప్రా మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు జావెలిన్ విసిరాడు. అయితే ఇవేవీ పతకాన్ని తెచ్చేవి కాదని భావించిన భారత స్టార్ అథ్లెట్ తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు జావెలిన్ విసిరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. చివరి రెండు ప్రయత్నాలలో అత్యధిక దూరం విసరాలని ప్రయత్నించిన నీరజ్ చోప్రా ఫౌల్ అయ్యాడు. దాంతో రెండో స్థానానికి పరిమితమై దేశానికి రజత పతకాన్ని అందించాడు.
భారత్‌కు రెండో పతకం..
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. గతంలో మహిళా అథ్లెట్ పతకం నెగ్గగా, పురుషులలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రానే. 2003లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళా అథ్లెట్ అంజు బాబి జార్జ్ లాంగ్ జంప్ విభాగంలో కాంస్యం గెల్చుకున్నారు. అయితే అంతకుమించిన ప్రదర్శన చేసి నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ (రజత పతకం) అందుకున్నాడు.