సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచూర్యం పొందిన తర్వాత రకరకాల డైటింగ్ పద్ధతులు, రకరకాల ఆహార విధానాలు కొన్ని ఆరోగ్యం కోసమని, కొన్ని బరువు తగ్గడం కోసమని, మరికొన్ని బరువు పెరగడం కోసమని ప్రచారంలోకి వచ్చాయి. అవన్నీ గుడ్డిగా నమ్మేసిన ఓ మహిళ ఇప్పుడు తీవ్ర అనారోగ్యం పాలైంది. చావు బతుకులతో పోరాడుతోంది.


కెనడాలోని టొరంటోలోని ఒక టిక్ టాకర్ ‘75 హార్డ్’ అనే ఒక వైరల్ ఫిట్ నెస్ చాలెంజ్ లో పాల్గొని ఆసుపత్రి పాలైందట. ఈ చాలెంజ్ లో రోజు రెండు పూటలా కఠినమైన వర్కవుట్లు చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాదు, కఠినమైన ఆహార నియమాలు కూడా ఉంటాయి. రోజూ ఒక గాలెన్ నీళ్లు తాగాలి. ఆల్కహాల్ లేదా చీట్ మీల్ అనే మాట అసలు ఉండకూడదు. 45 నిమిషాల వ్యాయామం, ఆహార నియమాలతో పాటు రోజుకు కనీసం 10 పేజిలు చదవాల్సి ఉంటుంది. ప్రతిరోజు వారి లక్ష్యం దిశగా ఎలా ప్రయాణిస్తున్నారు, శరీరంలో వస్తున్న మార్పులు ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది.


మిచెల్ ఫెయర్బర్న్ ఒక రియల్టర్, పిల్లల తల్లి కూడా. టిక్ టాక్ లో ఆమె స్వయంగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఆమె తనకు వాటర్ పాయిజనింగ్ సమస్య వచ్చిందని చెబుతూ అందులో భాగంగా వికారం, బలహీనత, రాత్రంతా చాలా సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి రావడం. ఏమీ తినలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడ్డానని వివరించారు.


ఇలాంటి సందర్భంలో ఆమె హాస్పిటల్ కు వెళ్లింది. అక్కడ పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆమెకు తీవ్రమైన సోడియం లోపం ఏర్పడినట్లు నిర్ధారించారు. సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు తాగకూడదని, ఆమె కేవలం అరలీటరు మాత్రమే నీళ్లు తాగాలని డాక్టర్లు సూచించారు.


ఇంత అనారోగ్యం కలిగినప్పటికీ ఆమె ఈ చాలెంజ్ పూర్తి చెయ్యాలనే అనుకుంటున్నట్టు తెలిపింది. ఒక సప్లిమెంట్ కంపెనీకి చెందిన సీఈఓ ఆండీ ఫ్రిసెల్లా ఈ ‘75 హార్డ్ చాలెంజ్’ను సృష్టించాడు. ఈ చాలెంజ్ లోని కఠిన నిబంధనలు అనుసరిస్తే ఆస్పత్రిపాలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


సోడియం లోపించడం నిజానికి ప్రాణాంతక స్థితి. కనుక తాను ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్తున్నట్టు అన్ని పరీక్షలు చేయించుకుంటున్నట్టు ఫెయర్బర్న్ చెప్పారు. డాక్టర్లు నీళ్లు పరిమితిలో తాగాలని చెప్పారని సోడియం లెవెల్స్ పెంచుకున్న తర్వాత డాక్టర్ల సలహా మేరకు తాను ఈ చాలెంజ్ ను కొనసాగించాలని అనుకుంటోందట. అయితే, మీరు కూడా ఇలాంటి చాలెంజ్‌లు స్వీకరిస్తున్నట్లయితే జాగ్రత్త. ఏం చేసినా ముందుగా వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.


 Also read : వర్షాలు పడుతున్నాయ్, మీ కళ్లు జర భద్రం - ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇన్ఫెక్షన్స్ దూరం!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial