KCR Action Plan : ఉన్న పథకాలను కొనసాగిస్తాం... అంతకు మించిన పెద్ద మేనిఫెస్టో ఏమీ ఉండదు మాకు అని 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో కేసీఆర్ చెప్పారు. అప్పటికే రైతు బంధు ప్రారంభించేశారు. పూర్తిగా పాజిటివ్ వాతావరణం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత... రుణమాపీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చారు. కానీ 2023 ఎన్నికలకు వెళ్తున్న సమయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పటాసుల్లా పేలుతున్నాయి. రోజుకో నిర్ణయంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు.
మర్చిపోయిన ఆర్టీసీ విలీనానికి హఠాత్తుగా నిర్ణయం
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హమీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆర్టీసీ ఉద్యోగులు చూసీ చూసీ కేసీఆర్ రెండో సారి గెలిచిన తర్వాత 2019 అక్టోబర్‌లో సమ్మెకు దిగారు. కానీ కేసీఆర్ అప్పుడు ఎంత కఠినంగా వ్యవహరించారంటే ఆర్టీసీ ఉద్యోగులంతా సెల్ఫ్ డిస్మిస్ చేసేసుకున్నారని ప్రకటించేశారు. చివరికి కేసీఆర్ స్టైల్లో కనికరించారు.. దీంతో తమ ఉద్యోగాలు మిగిలాయని చెప్పి అందరూ పాలాభిషేకాలు చేసి డ్యూటీ చేసుకుంటున్నారు. మరో సారి సమ్మె అనే ఆలోచన చేయలేదు. కానీ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నెలన్నరలో రూ. 19 వేల కోట్ల రుణమాఫీ
రైతులకిచ్చిన రుణమాపీ హామీ నాలుగున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఎన్నికల ఏడాదిలో పూర్తి చేయాడనికి బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించారు. 2018 ఎన్నికల్లోనూ పంట రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.37 వేల లోపు రుణాలను మాఫీచేసింది. మొత్తం 5.42 లక్షల మందికి చెందిన రూ.1,207 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మిగిలిన 37 వేల నుంచి 90 వేల లోపు గల రుణాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయాల్సి ఉంది. ఇందు కోసం 19 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో కేటాయించింది ఆరు వేల కోట్లు మాత్రమే. అయినా నెలన్నరలో పూర్తి చేయమని కేసీఆర్ఆదేశించారు.
వరుస పథకాల ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజులుగా ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. తన పార్టీకి ఎక్కడెక్కడ మైనస్ ఉందో సర్వేల మీద సర్వేలు చేయించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు .. ఆర్టీసీ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని తేలిన తర్వాత.. విలీనం నిర్ణయంతో సరి పెట్టారు. అనూహ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ... ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలు వచ్చిన తర్వాత కేసీఆర్ అందుకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిపి అందర్నీ కూల్ చేయడానికి మెట్రో ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అలా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు వంటి పథకాలను ప్రారంభించారు.
నిధుల సమీకరణ ఎలా?
ఇంత కాలం రుణమాఫీ చేయకపోవడానికి కేంద్రం కారణం అని ప్రకటించారు కేసీఆర్. అప్పులు తీసుకోకుండా అడ్డుకోవడమే కారణం అన్నారు. మరి ఇప్పుడు కేంద్రం అనుమతించిందా అన్నదే ప్రశ్న. నిధుల సమీకరణ ఎలా అన్నది మిస్టరీగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున పథకాలకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మినహా జిల్లాల్లో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. మరి వేల కోట్లు ఎలా సమీకరిస్తారన్నది కీలకంగా మారింది. ఎన్నికల్లో ఓటింగ్ జరిగే నాటికి హామీలన్నీ పూర్తి కాకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.